మనం మారితే లోకం మారునోయి – మనం ఒక్కరికి మేలు చేస్తే, లోకం మొత్తానికి మేలు చేసిన వారం అవుతాము. మనం ఒక్కరికి హాని చేస్తే, లోకం మొత్తానికి హాని చేసిన వారం అవుతాము. మనం ఒకరికి చేసే మేలుగానీ, కీడుగానీ ఆ వ్యక్తి వరకే పరిమితం కాదు. దాని ప్రభావం ఏదోక విధంగా లోకం మీద పడుతుంది. కాబట్టి మన వల్ల ఒకరికి మేలు జరగాలనుకున్నా, మన వల్ల ఒకరికి హాని జరగ కూడదనుకున్నా ముందు మనం మారాలి. మార్పు మన నుండే మొదలవ్వాలి. ‘నేను నా సౌకర్యం, నేను నా సేఫ్టీ – భద్ర్రత’ అనుకుంటే అసౌకర్యం, అభద్రత వాటంతట అవే వచ్చి వాలతాయి. నాకు ఎలాంటి సమస్యలు ఉండ కూడదు అన్న ఆలోచనే అనేకానేక సమస్యలకు మూలం అని గ్రహించాలి. చలనం ఉన్న మనిషీ మారతాడు, చలనం లేని శవ స్థితి మారుతుంది. ఆ రకంగా మనం శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం కూడా మార్పుకి సంకేతమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకంలో మారదంటూ ఏది లేదు. సంపూర్ణంగా జీవించి, సంతృప్తిగా మరణించేలా మనల్ని తీర్చదిద్దే అమూల్య సాధనమే మార్పు. సంపూర్ణుడయిన అల్లాహ్ ఇలా ఉపదేశిస్తున్నాడు: ”నిశ్చయంగా అల్లాహ్ ఆ జాతి గతిని మార్చడు. ఏ జాతయితే తన మనోమయ స్థితికి మార్చుకోవడానికి సిద్ధంగా లేదో;;. (అర్రఅద్;11). మంచి మార్పును ఆశిస్తూ…… ఆ మార్పుకి పనికొచ్చే పది పనిముట్లను ఇక్కడ పొందు పరుస్తున్నాము.
మొదటి పనిముట్టు: దశక సూత్రం.
మనం మన జీవితంలో ఏదేని సమస్యల వల్ల సతమతమవుతుంటే, క్రింద ఇవ్వబడిన మూడు ప్రశ్నలకు సరయిన సమాధానాలు రాబట్టు కోవాలి.
1) ప్రస్తతం మనకు ఎదురయి ఉన్న ఈ సమస్య ఓ పది రోజుల తర్వాత కూడా ఇంతే ప్రాధాన్యత గలదయి ఉంటుందా?
2) సమస్య వచ్చి పది నెలల గడచిన తర్వాత కూడా ఇంతే ప్రాధాన్యత ఉంటుందా?
3) సమస్య ఎదురయి పది సంవత్సరాలు పూర్తయి తర్వాత కూడా ఇంతే ప్రాధాన్యత ఉంటుందా?
పై ఇవ్వబడిన మూడు ప్రశ్నలలో రెండింటికి మీ సమాధానం ‘లేదు’ అని ఉంటే, తక్షణమే ఆ సమస్య గురించి ఆలోచించడం, బుర్ర పాడు చేసుకో వడం మానేయండి. మీ దృష్టిని, మీ ఏకాగ్రతను అత్యంత ప్రధాన అంశాల, ఆశయాల మీద కేంద్రీకరించండి!
రెండవ పనిముట్టు: ఒక్క శాతం చాలు.
ఈ రోజు పనిని రేపటికి వాయిదా వెయ్యకు, రేపు చెయ్యాలనుకున్నది ఈ రోజు చెయ్య, ఈ రోజు చెయ్యాల్సినది ఇప్పుడే చెయ్యి అన్నట్టు, ఈ క్షణం మీ జీవితంలో మారాలి అనుకుంటున్న అత్యంత కీలక కోణాన్ని, వృద్ధి పర్చుకోవాలనుకుంటున్న ముఖ్య ఘట్టాన్ని నిర్ధారించుకోండి. కావాలంటే ఒకటి కాదు, నాలుగయిదు విషయాలను ఎంచుకోండి. ఈ క్షణమే వాటిలో ఒక్క శాతం మార్పు, వృద్ధి, వికాసానికి ప్రయత్నించండి. అలా జీవితంలో మీరు అశించిన మార్పు, వృద్ధి, వికాసం రోజుకి ఒక్క శాతం అంటే పూర్తి యేడాది తర్వాతి మీరెక్కడుంటారో ఆలోచించండి! ఇదే నిలకడ, స్థిరచిత్తం కొనసాగితే ఓ అయిదు సంవత్సరాల తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి!
ఇప్పుడే కలం, కాగితం తీసుకొని వృద్ది పర్చాల్సిన, మార్చాల్సిన కొన్నింటిని రాసుకోండి. ఉదాహరణకు – రెండు మూడు సవత్సరాల్లో మీ జీవితం మారక పోతే ఒట్టు. రొటీన్ లైఫ్ అన్న బోరింగ్ పోయి డేరింగ్ మనస్తత్వం మీ సొంతమవుతంది.
మూడవ పనిముట్టు: నకారాత్మక విషయాలకు స్వస్తి పలకడం.
ఎలాట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మీద హాట్ న్యూస్‌గా ఉన్న హెడ్ లైన్స్‌ను, చర్చాగొష్టిని, ఒండొకరికి ఛాలెంజ్ విసురుకోవడం వంటి వాటిని ఈ క్షణమే త్యజించండి. అత్యవసరమయిన వార్తలు, సంభాషణలు, చర్చలు తప్ప వేరే వాటి జోలికి వెళ్ళకండి. సోషల్ మీడియాలో మీతో జత అయి ఉన్న నెగెటివ్ ఆలోచనలు గల వ్యక్తులను, పేజీలను అన్‌ఫాలో, అన్‌ఫ్రెన్డ్ చేసేయండి. అలాంటి గ్రూపుల నుండి బయికి వచ్చి వాటిని డిలీట్ చేసేయండి. తర్వాత ఎంత ప్రశాంతత ఉంటుందో మీరే గ్రహిస్తారు.
నాల్గవ పనిముట్టు: క్షమించండి!
ఎప్పుడో ఎవరో ఒకరు మనకు పెట్టిన బాధ, చెప్పిన మాటను తీసుకొని ఇప్పటి వరకూ వారిని గురించి అదే విధమయినటువంటి ఏహ్య భావం కలిగి ఉన్న ఎంత మంది మన మధ్యన లేరు చెప్పండి! దీని వల్ల మన గతం ఏమయినా మారి పోయిందా? పైగా ఆ ఆలోచనలు మనల్ని వెంటాడుతూనే వేధిస్తూనే ఉన్నాయి. అదే మనం వారిని మనస్ఫూర్తిగా మన్నించేసి ఉంటే, దాని వల్ల మన గతం అయితే మారేది కాదుకానీ, భవిష్యత్తు బాగు పడేది. మన ఫోకస్ మన ప్రాధాన్యతల మీద ఉండేది. ఒక్క నిమిషం కోసం ఆలోచించండి! మనలో చాలా మందిలో ఉన్న, కేవలం దేవునికి మాత్రమే తెలిసిన అవలక్షణాలు, వెకిలి చేష్టలు, పాపాలు ఒకవేళ మన తల్లిదండ్రులకు తెలిస్తే వారు మనల్ని వెళ్ళ గొడతారు. భార్యకు తెలిస్తే విడాకులిచ్చే వెళ్ళిపోతుంది, పొరుగు వారికి తెలిస్తే అసహ్యించుకుంటారు. స్నేహితులకు, పరిచయస్తులకు తెలిస్తే ఛీ కొడతారు. నౌఖరులకు తెలిస్తే దగ్గరకే రారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అల్లాహ్ ఎంత కృపాకరుడు, క్షమాశీలుడు అని. మరి అల్లాహ్ మనలో సయితం క్షమా గుణాన్ని కోరుతున్నాడు: ”వారిని క్షమించాలి. వారి పట్ల మన్నిఫుల వైఖరిని అవలంబించాలి. ఏమి, అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు అభిలషించరా? అల్లాహ్ మాత్రం (తప్పులను) క్షమించే వాడు. కరుణామయుడు”. (అన్నూర్: 22)
కాబట్టి ఈ క్షణం మీ మనస్సు నొప్పించిన వారిని మనస్ఫూర్తిగా మన్నించేయండి. గుర్తుంచుకోండి! అధిక శాతం మంది ప్రజలు మంచోళ్ళయి ఉంటారు. భావోద్రేకానికి లోనయి వారి వల్ల ఓ అనుచిత వ్యాఖ్యగానీ, చేష్ట గానీ వెలువడి ఉండోచ్చు. వారి వల్ల జరిగిన ఆ తప్పిదం వారి ప్రవృత్తి అయి ఉండదు. అదో తాత్కాలిక చర్య అయి ఉంటుంది అంతే. దాని వల్ల వారు కూడా బాధ పడుతుంటారు. ఆత్మాభిమానం అడ్డోచ్చి అన లేక పోవచ్చు.
అయిదవ పనిముట్టు: సదా కృతజ్ఞులయి ఉండండి.
మనం మన రోజువారి జీవితాన్ని అల్లాహ్ కృతజ్ఞతతో ప్రారంభించాలి. మన ఆరోగ్యం,మన పరివారం, మన ఉద్యోగం, మన స్కిల్స్, మన ప్రతిభ, ప్రజలు మనలో ఇష్ట పడే గుణాలు, మనకు ప్రాప్తమయి ఉన్న స్థాయి గౌరం అన్నీ అల్లాహ్ కృపాకరమే. నిజంగా చెప్పాలంటే, అల్లాహ్ కృపానుగ్రహాలను మనం లెక్కించాలన్నా లెక్కించ లేము. కాబట్టి అల్లాహ్ ఒక్కొ అనుగ్రహాన్ని తలచుకొని నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. వాక్కు పరమయిన కృతజ్ఞత, ధన పరమయిన కృతజ్ఞత, దేహ పరమయిన కృతజ్ఞను నిత్యం చేసుకోవాలి. కృతజ్ఞతా భావం అనేది శుభాల తలుపుల్ని తెరిచే గొప్ప సాధనం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నడు: ”ఒక వేళ మీరు కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా ప్రసాదిస్తాను”. (ఇబ్రాహీమ్: 7) కృతజ్ఞతా భావం వల్ల మనలో సాత్విక భావాలు చోటు చేసుకొని, సానుకూల దృక్పథం అలవడి ఒక విధమయిన ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. అది మనల్ని మరింత బలవంతులుగా తీర్చి దిద్దుతుంది. మునుపెన్నడూ ఎవ్వరికీ లభించని, ప్రళయం వరకూ ఇంకెవ్వరికి దక్కని గొప్ప రాజ్యాధికారం కలిగిన ప్రవక్త సులైమాన్ (అ) కృతజ్ఞతా పూర్వకంగా చెప్పిన వాక్యాలు మనకు ఆదర్శం. ”నా ప్రభూ! నువ్వు నాకూ, నా తల్లిదండ్రులకూ ప్రసాదించిన అనుగ్రహాలకుగాను నిత్యం నీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధిని నాకు ఇవ్వు. నేను నీ మెప్పును పొందే మంచి పనులు చేసేలా దీవించు. నీ దయతో నన్ను నీ సజ్జన దాసులలో చేర్చుకో”. (అన్నమ్ల్: 19)
ఆరవ పనిముట్టు: ఆరోగ్యమే మహా భాగ్యం.
”నీ ఆరోగ్యాన్ని నీ అనారోగ్యానికన్నా ముందు గొప్పగా భావించు” అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). (ముస్నద్ అహ్మద్)
మన శరీరమే మన సర్వశ్వం. ‘వెన్ యో లుక్ గుడ్, యో ఫీల్ గుడ్!’ మీ దేహాకృతి బాగుంటే, మీ మానసిక స్థితి కూడా బాగుంటుంది. మనకు ఆరో గ్యం బాగోలేకపోతే మనం ప్రపంచంలో ఏ పనిని సజావుగా చెయ్యలేము. ఎంత మంది ధనికులున్నారు, వారు కోరింది తిన లేరు, కోరిన చోటుకి వెళ్ళ లేరు. మంచం మీదనే జీవిత ముగిసి పోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆరోగ్యం బాగోలేకపోతే మనం ఎంతో ఇష్టం చదివే నమాజును సజావుగా చెయ్య లేము. రుకూ, సజ్దా, ఖియామ్, ఖఅదహ్ కుదరవు. కాబట్టి ఆరోగ్యాన్ని మనం నిజంగా మహా భాగ్యంగా భావించి, ప్రతి రోజు కొంత సమయం (అర గంట) వ్యాయామం కోసం కేయించాలి. మన శరీరం దృఢంగా ఉంటే మనం ఆలోచనలపై దాని ప్రభావం సానుకూలంగా ఉంటుంది. ప్రపంచంలో ఖరీదయిన ఏ వస్తునయినా పాడయిపోతే మార్చగలం. కానీ, ఒక్క సారి శరీరారోగ్యం పాడయితే బాగు చేసుకో లేము.
ఏడవ పనిముట్టు: చదువు, చదువు, చదువు.
ఖుర్‌ఆన్‌లో అవతరించిన తొలి వాణి ”చదువు నీ ప్రభువు పేరుతో” (అల్ అలఖ్:1) అన్నది. ”నిశ్చయంగా అల్లాహ్‌కు వాస్తవ రీతిలో భయ పడేవారు ఆయన దాసులలోని విద్యావంతులే” (ఫాతిర్:28) అన్నది అల్లాహ్ మాట. ప్రవక్త ముహమ్మద్ (స) తన గురించి చెప్పిన మాట – ‘నేను అధ్యాపకునిగా చేసి పంప బడ్డాను’. (ఇబ్ను మాజహ్) అన్నది. ”విద్యార్జన ప్రతి ముస్లిం (స్త్రీ, పురుషుని)పై తప్పనిసరి విధి” (సహీహుల్ జామె) అన్నది ఇస్లాం ఉపదేశం. ”ధర్మ విద్యార్జన నిమిత్తం బయలుదేరిన విద్యార్థి బాటలో దైవ దూతలు తమ రెక్కలను పరుస్తారు” (ముస్నద్ అహ్మద్) అన్నది ధర్మం ఇచ్చే శుభవార్త. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యను అర్జించడమంటే విజయానికి బాటలు వేసుకోవడమే. ”విద్యార్జన నిమిత్తం ఒకరు ఒక మార్గాన్ని ఎంచుకుంటే అల్లాహ్ వారి కోసం స్వర్గానికెళ్లే మార్గాన్ని సులభతరం చేస్తాడు” (ముస్నద్ అహ్మద్) అన్నారు మహనీయ ముహమ్మద్ (స). దీన్ని బట్టి విద్యార్జన ఎంత ప్రాముఖ్యమయనదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక మాసంలో కనీసం ఒక పుస్తకం పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకోవాలి. పుస్తకం మన మస్తిష్కాన్ని ఉత్తేజ పరుస్తుంది, ఉన్నత ఆలోచనలకు ఊతం అవుతుంది. ఉత్తమ ఆశయాలను నిర్దేశిస్తుంది.
బిల్‌గెట్స్ రీడింగ్ హాబీ కోసం ఎన్నిగంటలు కేయిస్తాడో తెలుసా? అక్షరాల ఆరు గంటలు. వార్న్ బఫెట్ రోజుకి ఎన్ని పేజీలు చదువుతాడో తెలిసా? 600 పేజీలు. మార్క్ జకర్ బర్గ్ వారానికి రెండు పుస్తకాలు పూర్తి చేస్తాడు. వీరందరూ ప్రపంచంలో ప్రముఖ విజేతలుగా ఉన్నారు. మరి వీరికి పుస్తకాలు చదవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? కారణం ఒక్కడే, చదువు కేవలం కొలువు కోసం కాదు. అది అతి గొప్ప మస్తిష్క ప్రేరకం.
ఎనిమిదవ పనిముట్టు: ఒక సమయంలో ఒకే లక్ష్యం.
ఏక సమయంలో అనేక లక్ష్యాలు, ఒకే బాణం మూడు పిట్టలు అన్న ఆలోచనను మానుకోండి. ఒక సమయంలో ఒకే లక్ష్యాన్ని ఎంచుకోండి. దాన్ని పూర్తి చేయక ముందు మరో లక్ష్యం జోలికి వెళ్లకండి. మీ మొత్తం దృష్టి దానిపైనే కేంద్రీకరించండి. మీరు ఏ పని చేసినా అంకిత భావంతో, ఆనందంగా చెయ్యండి. ఆ తర్వాత మారిన అద్భుత లోకాని మీరే చూస్తారు. ”వారు ఎటూ కాకుండా మధ్యలో ఊగిసలాడుతూ ఉంటారు. పూర్తిగా అటూ ఉండరు, సరిగ్గా ఇటూ ఉండరు”. (అన్నిసా: 143)
తొమ్మిదవ పనిముట్టు: ఓర్పు సహనం.
”ఓ విశ్వసించిన ప్రజలారా! ఓర్పు సహనం మరియు నమాజు ద్వారా అల్లాహ్ సహాయం కోరండి. నిశ్చయంగా సహనమూర్తులకు తోడుగా అల్లాహ్ ఉంటాడు”. (అల్ బఖరహ్: 153)
మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించే మార్గంలో అనేక ఆటు పోట్లు ఎదురవుతాయి. ఓర్పు సహనాలతో మనం వాటిని అధిగమించి, అల్లాహ్ సహాయాన్ని అనుక్షణం అర్థిస్తూ ఉంటే రంగం ఏదయినా అందులో మంచి ఉంటే విజయం మన సొంతం అవుతుంది.”ప్రతి మనిషీ దేని కోసం స్వయంగా కృషి చేస్తాడో అది మాత్రమే అతనికి లభిస్తుంది. నిశ్చయంగా అతని కృషి త్వరలోనే చూడ బడుతుంది. మరి అతనికి సంపూర్ణ ప్రతిఫలం వొసగబడుతుంది”.(అన్నజ్మ్:39- 41)
పై ఆయతులో మూడు విషయాలు బోధ పడతాయి. 1) మనం ఏది చెయ్యాలన్నా బతికుండగానే చేసుకోవాలి. మనం చేసింది, సంపాదించింది మాత్రమే మనదవుతుంది. 2) మనం చేసిన మంచిగానీ, చెడు గానీ దాన్ని త్వరలోనే మనం చూసుకుంటాము. 3) మనం చేసిన కర్మను బట్టి శిక్షా బహుమానాలు ఖచ్చితంగా లభిస్తాయి.
పదవ పనిముట్టు: అనవసర విషయాల జోలికి వెళ్ళొద్దు.
అఖీదాలో, ఆరాధనల్లో, వ్యవహారాల్లో, సామాజిక సంబంధాలలో, నైతికతలో, సేవలో…జీవితపు ఏ రంగలోనయినా, ఏ అంగంలోనయినా అనవసర విషయాల జోలికి వెళ్ళకూడదు. అనవసరంగా ఒకరి విషయంలో జోక్యం చేసుకోకూడదు. ”వారు అసత్యానికి సాక్షులుగా ఉండరు. ఎప్పుడయినా వ్యర్థమయిన వాటి గుండా పోవలసి వస్తే, హుందాగా ముందుకు సాగి పోతారు”. (అల్ ఫుర్‌ఖాన్: 72)
”వ్యక్తి ధర్మం (ఇస్లాం), అత్యున్నత స్థాయికి చెందినది అనడానికి – అతనికి సంబంధం, అవసరం లేని విషయాల జోలికి వెళ్లకుండా ఉండటం అనేది ఒకటి” అన్నారు మహనీయ ముహమ్మద్ (స). (తిర్మిజీ