Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

చెట్టు ప్రగతికి మెట్టు

అందరికి అన్ని వేళలా పనికొచ్చే ‘గ్రీన్‌ గోల్డ్‌’ పచ్చని పసిడిని ఏ కొందరికి మాత్రమే పనికొచ్చే పశుపు పసిడిగా, పచ్చ నోటుగా మార్చుకునే కుయుక్తి పన్నుతున్నాడు. చెట్టు సంక్షేమమే తన సంక్షేమమని, చెట్టు సంక్షామమే తన సంక్షామమని గ్రహించలేక పోతున్నాడు.

అందరికి అన్ని వేళలా పనికొచ్చే ‘గ్రీన్‌ గోల్డ్‌’ పచ్చని పసిడిని ఏ కొందరికి మాత్రమే పనికొచ్చే పశుపు పసిడిగా, పచ్చ నోటుగా మార్చుకునే కుయుక్తి పన్నుతున్నాడు. చెట్టు సంక్షేమమే తన సంక్షేమమని, చెట్టు సంక్షామమే తన సంక్షామమని గ్రహించలేక పోతున్నాడు.

”పోనీ, మీరు రాజేసే నిప్పును గరించి ఎప్పుడయినా ఆలోచించారా? దాని వృక్షాన్ని మీరు ఉత్పత్తి చేశారా? లేక దానిని ఉత్పన్నం చేసినది మేమా? మేము దానిని గుణపాఠ సూచనగా, బాటసారులకు ప్రయోజనకర వస్తువుగా చేశాము. కాబట్టి నువ్వు మహోన్నతుడయిన నీ ప్రభువు నామ పవిత్రతను కొనియాడు”. (దివ్యఖుర్‌ఆన్‌ -56: 71-74)

చెట్టు ప్రగతికి మెట్టు:

పరవళ్ళు తొక్కే జలపాతం, చిరు కొమ్మ చిగురు చివరన నీటి బిందం… కోకిల రాగం…కొండపై నుండి జాలు వారే జలపాతం…పరవశింపజేసే ప్రకృతి అందాలు మనుసును పులకింపజేస్తాయి. ప్రతి అందం అద్భుతం, ప్రతి అంశం అద్వితీయం. ప్రకృతి అందంలో సగం వృక్షం సొంతం అంటే అతిశయోక్తి కాదు. నిన్న విత్తు, నేడు మొక్క, రేపు చెట్టు, మర్నాడు మహా వృక్షం, ఓ పూట పూత పూస్తుంది, మరో పూట పుల్లని కాయ కాస్తుంది, మరుసటి రోజు అదే కమ్మని పండయి నోరూరిస్తుంది. అంటే వృక్షం-విత్తుగా, మొక్కగా, చెట్టుగా, పూతగా, కాయగా, పండుగా మనిషికి మేలు చేస్తుంది. చెట్టు-పర్యావరణం, ఆత్మ- శరీరం లాంటివి. మనిషి నిత్యావసరాలయిన నీరు, నిప్పు, ఆహారానికి మూలం వృక్షం. భూమిపై మానవాళికి దేవుడు అనుగ్రహించిన మహా ప్రసాదం వృక్షం. వృక్ష రహిత జీవితం మహా భయంకరం. చెట్టు వల్ల మనిషికి అనేక ఆరోగ్య, ఆర్థిక ప్రయోజనాలు ఒనగూడుతాయి. నీరు, నిప్పు, ఆహారం కన్నా అధిక అవసరమయిన ఆక్సిజన్‌-ప్రాణ వాయువుకి నెలవు చెట్టు. అది లేకపోతే మనిషి జీవితానికి చెప్పాల్సి వస్తుంది సెలవు.

గ్రీన్‌ గోల్డ్‌ ఘనత:

దేవుడు మనిషిని ఈ భూమీ మీద వసింపజేయడానికి ఎన్నో శతాబ్దాల ముందే ధరితి కొంగును రకరకాల చెట్లతో అలంకరించాడు. అందులో వారి అవసరాలను సమకూర్చి పెట్టాడు. ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంట్లో పొయ్యి వెలగాలన్నా, హలం కట్టాలన్నా, పొలం పండాలన్నా, బండి నడవాలన్నా ఒక దశలో చెట్టే ఆధారం. అలాంటి ప్రాణప్రదమయిన చెట్టును, అదే చెట్టు కట్టెను అమర్చిన గొడ్డలి చేపట్టి తెగ నరకడానికి ప్రయత్నిస్తున్నాడు మనిషి. అందరికి అన్ని వేళలా పనికొచ్చే ‘గ్రీన్‌ గోల్డ్‌’ పచ్చని పసిడిని ఏ కొందరికి మాత్రమే పనికొచ్చే పశుపు పసిడిగా, పచ్చ నోటుగా మార్చుకునే కుయుక్తి పన్నుతున్నాడు. చెట్టు సంక్షేమమే తన సంక్షేమమని, చెట్టు సంక్షామమే తన సంక్షామమని గ్రహించలేక పోతున్నాడు.

మన జీవితానికి శ్వాస చెట్టు, మన బాల్యానికి ఊయల చెట్టు, మన పెళ్ళి తోరణం చెట్టు. మన ఆభరణం చెట్ట్టు, మనిషి కాడె చెట్టు, మనిషి పాడె చెట్టు. అయినా మనిషికి దయ లేదు. నిర్దయగా నరకడాన్నే ఇష్ట పడుతు న్నాడు. చెట్టు రహిత భవిష్యత్తు ఎంత ఘోరంగా ఉండబోతుందన్న భయం ఒకవైపు, మనిషి మారకపోతాడా, తప్పు తెలుసుకోక పోతాడన్న చిన్న ఆశ మరో వైపు. ఆ భయాన్ని తొలగించమని, ఆ ఆశను వెలిగించమని అల్లాహ్‌ను వేడుకోవాలి!

ఓ చెట్టు నాటుదాం!

ఆది మానవుని గురించి ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది: ”అప్పుడు వారిరువురూ స్వర్గంలోని ఆకులను తమపై కప్పుకోసాగారు” (అల్‌ ఆరాఫ్‌:22) ఆకులు కప్పుకోవడం మొదలు బట్టలు కట్టుకునే దాకా, ఆహారాన్ని ఏరుకోవడం మొదలు ధాన్యం పండించుకునే దాకా మానవ చరిత్ర చాలా మలుపులే తిరిగింది. ప్రతి మలుపులోనూ చెట్టుంది. చెట్టుకున్న ఈ ప్రాధాన్యతను మరింత నొక్కి వక్కాణిస్తూ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ఇంకాసేపట్లో భయంకర ప్రళయం ముంచుకురానున్నదని తెలుస్తున్నా మీ చేతిలో గనక మొక్క ఉంటే ఆ మొక్కను నాట గలిగితే అది సంభవించక ముందే నాటేయండి”. (ముస్నద్‌ అహ్మద్‌, అదబుల్‌ ముఫ్రద్‌) వృక్ష సంపద విలువను తెలియేజేసే దీనికన్నా బలమయిన ప్రవచనం ఈ ప్రపంచంలో మరొకి లేదు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.

జీవ కోటికి జీవనాధారం చెట్టు:

పక్షుల గూడు చెట్టు. కిలకిల కబుర్లూ, కువకువ ముచ్చట్ల నిలయం చెట్టు. ”ముస్లిం ఎవరయినా ఒక చెట్టు నాినా, లేదా పంట పండించినా దాన్నుండి పక్షిగానీ, మనిషిగాని, పశువుగాని తింటే అతనికి దాని పుణ్యం లబిస్తుంది”. అన్నారు ప్రవక్త (స). (బుఖారీ)

మనం ఒక మొక్క నాటడం వల్ల ఎన్నో ప్రాణులకు మేలు జరుగుతుంది. అదెలా? అంటే, ఒక చెట్ట్టుపై ఆధార పడి బతికే జీవాల సంఖ్య 500 అన్నది ఓ అంచనా. అంటే, మనం ఒక చెట్టు నాటి 500 జీవాల్ని పోషించినట్లే. ఆ జీవాలన్నీ పర్యావరణ పరిరక్షణలో వీర సైనికులే. చెట్టు వల్ల భూసారం దెబ్బ తినకుండా ఉంటుంది. పర్యావరణానికి రసాయనాల కీడు తప్పుతుంది. మనం నాటే ఒక్క చెట్టు గాలి, వాన వల్ల కొట్టుకుపోకుండా ఏటా పాతిక కిలోల సారవంతమయిన మట్టిని కాపాడుతుంది. ప్రతి చెట్టు తన జీవిత కాలంలో కాయల రూపంలో, కల్ప రూపంలో కనీసం 5 లక్షల రూపాయలు విలువయిన వస్తువుల్ని తన యజమానికి కానుకగా ఇస్తుంది. అది విడుదల చేసే ప్రాణ వాయువును వెలకడితే ఆ మొత్తం కోట్లలోనే అనాలి.

విశ్వకర్త వాక్కులో వృక్షం:

”అల్లాహ్‌ పరిశుద్ధ వచనాన్ని దేంతో పోల్చాడో మీరు గమనించ లేదా?అది ఒక పరిశుద్ధ వృక్షం వంటిది. అది బాగా వ్రేళ్ళూనుకుని ఉంది. దాని శాఖలు ఆకాశంలో ఉన్నాయి,. తన ప్రభువు ఆజ్ఞతో అది ఎల్లప్పుడూ పండ్లను ఇస్తోంది. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకుగాను అల్లాహ్‌ వారి ముందు ఈ ఉపమానాలను వివరిస్తున్నాడు”. (దివ్యఖుర్‌ఆన్‌- 14: 24,25) (దీనికి భిన్నంగా) ”అశుద్ధ వచనం ఉపమానం అశుద్ధ వృక్షం వంటిది. అది నేల ఉపరితలంపై నుంచే పెకళించి వేయ బడింది. దానికి స్థిరత్వం అనేదే లేదు”. (దివ్యఖుర్‌ఆన్‌-14: 26)

”సిద్రతుల్‌ మున్‌తహా” దగ్గర. అక్కడే ‘జన్నతుల్‌ మఅవా’ కూడా ఉంది”. (దివ్యఖుర్‌ఆన్‌-53: 14,15)

పై వచనంలో ‘సిద్రతుల్‌ మున్తహా’ అనేది ఒక రేగు వృక్షం. అది ఏడవ ఆకాశంలో ఉంది అని పలు ప్రవచనాల ద్వారా తెలుస్త్తుంది. అలాగే స్వర్గపు వృక్షాల వర్ణలు అనేకం ఖుర్‌ఆన్‌ మరియు హదీసులో ఉన్నాయి.

విశ్వ ప్రవక్త దృష్టిలో వృక్షం:

విశ్వ కారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స) విశ్వాసాన్ని విత్తనంతో పోల్చితే, విశ్వాస ఆధారంగా చోటు చేసుకునే కర్మల్ని చెట్టుతో పోల్చారు. ఓ సందర్భంలోనయితే విశ్వాసిని మేలిమి వృక్షంతో ఉదాహరించారు. ”వృక్షాల్లో ఓ వృక్షం ఉంది. దాని ఆకులు రాలవు. నిశ్చయంగా అది విశ్వాసిని పోలి ఉంటుంది. ఆ చెట్టు పేరేమిటో మీకు తెలుసా?” అని అడిగారు. అందుకు సహచరులలోని ఒకరు – ‘అది ఖర్జూరపు చెట్టు’ అని సమాధానమిచ్చారు. (బుఖారీ). వేరొక ఉల్లేఖనంలో -”విశ్వాసి ఉపమానం ఖర్జూరపు చెట్టు వంటిది. దాన్నుండి దేన్ని తీసుకున్నా అది నీకు లాభాన్నే ఇస్తుంది, మేలునే కలుగజేస్తుంది” అన్నారు ప్రవక్త (స). (తబ్రానీ)

వృక్ష ప్రయోజనం:

కంటికి ఒత్తిడిగా అనిపించినప్పుడు కాసేపు పచ్చని పైరు, పొలాలను, చెట్లను చూడాలనకుంటాడు మనిషి. ఒక వ్యక్తి అలా పచ్చని చెట్లను చూస్తున్నప్పుడు అతనిలోని ఒత్తిడితో ముడి పడి ఉన్న కార్టిసోల్‌ హార్మోన్‌ వూట పదమూడు శాతం పడి పొయినట్లు నిపుణులు గుర్తించారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే – చెట్ల మధ్య ఇల్లు కట్టుకున్న వయోధికుల్లో హృద్రోగ ప్రమాణం తక్కువని అంచనా. ఇంటి ఆవరణంలో చెట్టుంటే స్వయంగా ఇంట్లో చెట్టంత వైద్యుడున్నట్లే. 30 మీటర్ల చెట్టు ఏడాదికి పాతిక కిలోల బొగ్గు పులుసు వాయువును పీల్చుకుంటుంది. అది ఒక కారు 45000 కిలోమీటర్లు ప్రయాణించడం వల్ల ఏర్పడే కాలుష్యానికి సమానం. దుమ్మును, ధూళిని చెట్లు ఆకర్షిస్తాయి. తద్వారా మనిషి ఊపితి తిత్తుల మీద కలుషిత ఒత్తిడి తగ్గుతోంది. శ్వాస సంబంధితమైన కాన్సర్‌ నుంచి ఏటా 10 లక్షల మంది స్వస్థత పొందడంలో వృక్షాలు కీలక పాత్రను పోషిస్తాయి అన్నది శాస్త్త్రవేత్తల మాట. నేడు మనిషి ఎంతో కొంత స్వచ్ఛమయిన గాలిని పీలుస్తున్నాడంటే కారణం చెట్టు. ప్రతి చెట్టు ఏడాదికి కొన్ని వేల కిలోల ప్రాణ వాయువును అందిస్తుంది.

పాడి-పంట:

”ఎవరికీ చెందని ఓ బంజరు నేలను పంట పొలంగా మార్చిన వ్యక్తికే ఆ భూమి చెందుతుంది” అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ, అబూ దావూద్‌)

ప్రవక్త (స) వారి ఈ ప్రవచన ఆధారంగానే ద్వితీయ ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ (ర), బిలాల్‌ (ర) గారినుద్దేశించి – ”ప్రవక్త (స) వారు మీకు ఈ భూమిని ఇచ్చింది ప్రజల నుంచి ఆపి ఉంచడానికయితే ఖచ్చితంగా కాదు. కాబట్టి మీరు సేద్యం చెయ్యగలిగేంతటి భూమిని మీ వద్ద ఉంచుకొని మిగతా భూమిని తిరిగి ఇచ్చేయండి” అన్నారు.

యుద్ధంలో వృక్ష సంరక్షణ:

యుద్ధ సందర్భంగా శత్రు పొలాల జోలికి వెళ్ళ కూడదని, చెట్టును నరకరాదని ప్రవక్త (స) సైన్యానికి ఫర్మానా జారీ చేశారు. అంతే కాదు ”రేగు వృక్షాన్ని నరికినవాడి తలను అల్లాహ్‌ నరకంలో మాడ్చుగాక!” అని అభిశపించారు. (అబూ దావూద్‌) అలాగే ”నీడనిచ్చే చెట్టు క్రింద మల మూత్ర విసర్జన చేయడం ప్రజా అభిశాపానికి గురి చేస్తుంద”ని హెచ్చరించారు. (అబూ దావూద్‌)

చెట్టు చుట్టు నమ్మకం:

కాల క్రమేణా చెట్టులో చోటు చేెసుకునే మార్పుల వల్లనో, దాని వల్ల తనకు లభించే ప్రయోజనాల వల్లనో, భయం వల్లనో, భ్రాంతి వల్లనో చెట్లను కొలిచే ఆచారం దాదాపు అన్ని దేశాలలో మనకు కనబడుతుంది. మనిషి నమ్మకం-అపనమ్మకం-అమ్మకాల నడుమ చెట్టు నలిగి పోతున్నది. కొందరు కొన్ని చెట్ల మీద దేముళ్ళు కొలువుదీరుతారు అంటే, కొందరు కొన్ని చెట్లను దెయ్యాల దిబ్బగా అభివర్ణిస్తుంటారు. రావి చెట్టు, వేప చెట్టు, జెండా మ్రాను, మర్రి చెట్టు ఈ కోవకు చెందినవే.

నిజ దైవమెవరో తెలియక మనిషి ఈ చెట్ల చుట్టూ సంపద ఇవ్వమని అలౌకికానందంతో ప్రదక్షిణలు చేస్తాడు. దారాలు కడతాడు. సంతానం ఇవ్వమని చిన్న పాటి ఉయ్యాల కడతాడు. వేప చెట్టుకు రావి మ్రానుకు పెళ్ళి జరిపిస్తారు. అదే చెట్టు ఎండి పోతే, కూలి పోతే తాపిగ్గా తీసుకెళ్ళి పొయ్యిలో పెడతారు. ఏది ఏమయినా చెట్టును చెట్టుగా చూడాలే గానీ దానికి దైవత్వాన్ని ఆపాదించడం అజ్ఞానం,మూర్ఖత్వమే. అలాంటి వారిని ఖుర్‌ఆన్‌ ‘అస్హాబుల్‌ ఐకహ్‌’గా పేర్కోంటుంది. ”ఐకహ్‌ జనులు కూడా దైవప్రవక్తలను ధిక్కరించారు”.(అష్‌షుఅరా: 176) దట్టమయిన వృక్షాన్ని అయికహ్‌ అంటారు. షుఐబ్‌ ప్రవక్త (అ) జాతి ఆ వృక్షాన్ని దైవంగా భావించేది గనక వారిని ‘ఐకహ్‌ జనులు’ అని పిలవబడింది.

ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి కాలంలో ఉమ్మెసులైమ్‌ అనే ఓ సత్య బాంధవి ఉండేది. నిజ దైవాన్ని గ్రహించిన ఆమె వద్దకు వివాహం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో అబూ తల్హా అనే వ్యక్తి వచ్చాడు. అప్పుడు ఆమె అన్న మాట – ”మీ బోటి వారి సంబంధాన్ని ఏ స్త్రీ కాదనదు. కానీ నేను ముస్లింని, మీరు ముస్లిం కాదు. ఏది ఏమయినా ఒక్క సారి ఆలోచించండి! మీరు కొలిచే దేవుళ్ళను ఫలానా తెగకి చెందిన ఆచారి ఫలానా చెట్టు నుండి తయారు చేశాడు. ఒకవేళ మీరే గనక వాటికి నిప్పింటిస్తే అవి కాలి బూడిదయి పోతాయి. అవి ఎలా దైవం కాగలవు చెప్పండి!”. అప్పుడు అబూ తల్హాకు కోపం వచ్చినా తర్వాత బాగా ఆలోచించిన మీదట ఆయన మిథ్యా దైవారాధనకు శాశ్వతంగా స్వస్తి పలికి నికార్సయిన విశ్వాసిగా జీవించారు. (తబ్ఖాతుల్‌ కుబ్రా)

చెట్టును దైవంగా కొలిచే దుష్కృతి ఒకవైపయితే, చెట్టును విచక్షణా రహితంగా తెగ నరికే విష సంస్కృతి మరో వైపు. కార్ఖానాల, వాహనాల పొగ బాగా పెరిగిపోయింది. వృక్ష సంపద బాగా తగ్గిపోయింది. మనిషి స్వార్థం ఏ స్థాయికి చేరుకుందంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమెజాన్‌ అడువులు 2025 వరకు దాదాపు 40 శాతం అంతరిస్తాయేమోనన్న ఆందోళన చెందెంత. అడవులతోపాటు జంతువులు గంటకు ఆరు జాతుల చొప్పున అంతరించి పోతున్నాయి. ఒక జీవి అంతరిస్తే దాన్ని నమ్ముకుని బ్రతికే మరో జీవి సంక్షోభంలో పడుతుంది. తద్వారా ప్రకృతిలో సహజంగా ఉన్న సమతౌల్యత దెబ్బ తింటుంది. అల్లాహ్‌ ప్రతి దాన్ని ఒక పద్దతి ప్రకారం పుట్టించాడు. ఆ పద్దతని తప్పే, ఆ క్రమాన్ని తప్పించే ప్రయత్నం చేస్తే మానవ మనుగడకు భూమి మీద నూకలు చెల్లినట్టే. అడవిలో ఉండే ఏనుగులు జన వాసాలాపై పడతాయి, సింహాలు, పులులు పల్లెల్లో బస చేస్తాయి. కాబట్టి త్రాగే కొద్దీ దప్పికను పెంచే ఉప్పు నీటి దాహం వంటి స్వార్థాన్ని స్వస్తి పలికి సాత్విక బుద్ధితో అల్లాహ్‌ ఈ ఆదేశానికి శిరస్సు వంచడమే కాక, శిరసా వహించాలి.

”ఆయనే ఆకాశాన్ని ఎత్తుగా చేశాడు. మరియు ఆయనే (సమతూకం నిమిత్తం) త్రాసు ఉంచాడు. మీరు తూకంలో (ప్రకృతి సమతుల్యతలో) వైపరీత్యానికి పాల్పడకుండా ఉండేందుకు! కాబట్టి తూకం (సృష్టి సమతౌల్యం) సరిగ్గా-న్యాయ సమ్మతంగా-ఉండేలా చూడండి. తూకంలో తగ్గించి ఇవ్వకండి.(సృష్టి సమతూకాన్ని ఏ మాత్రం పాడు చేయకండి)”. (దివ్యఖుర్‌ఆన్‌-55: 7-9)

Related Post