Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు…

చిత్తశుద్ధితో, కేవలం అల్లాహ్‌ సంతోషం పొందే ఉద్దేశ్యంతో వ్యయపరిచేవారి వ్యయాన్ని మెట్ట ప్రదేశంలో ఉన్న తోటతో పోల్చవచ్చు. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది.

చిత్తశుద్ధితో, కేవలం అల్లాహ్‌ సంతోషం పొందే ఉద్దేశ్యంతో వ్యయపరిచేవారి వ్యయాన్ని మెట్ట ప్రదేశంలో ఉన్న తోటతో పోల్చవచ్చు. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది.

”క్రయవిక్రయాలు కూడా జరగని, మైత్రీ ఉపయోగపడని, సిఫారసు కూడా చెల్లని, (చివరి) దినము రాకపూర్వమే, మేము మీకు ప్రసాదించిన సిరిసంపదల నుండి (మా మార్గంలో) ఖర్చు పెట్టండి”.  (అల్‌ బఖర) ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ”ఎవరైనా తమ పరిశుద్ధమైన సంపాదనలో నుండి ఒక ఎండు ఖర్జూరమంత దానం చేసినా (అల్లాహ్‌ా పరిశుద్ధుడు, పరిశుద్ధ వస్తువులనే స్వీకరిస్తాడు) దాన్ని అల్లాహ్  తన కుడి చేత్తో స్వీకరిస్తాడు. సదఖా ఇచ్చువారికై దాన్ని వారు తమ దూడను పెంచిపోషించినట్లే ఆ సద్ఖాను పోషిస్తాడు. అది పెరిగి కొండంత పెద్దగా రూపొందుతుంది. (ముస్లిం, బుఖారీ)

సదఖా అంటే అల్లాహ్  అభీష్టానికై అల్లాహ్  మార్గంలో ఖర్చు పెట్టడం అని అర్థం. సదఖా క్రియాత్మక విశ్వాసాన్ని వ్యక్త పరుస్తుంది.  నేను విశ్వసించే నా ప్రభువు మార్గంలో నా ధనం, ప్రాణం, సమయం అన్నీ అర్పితం అని తెలియపరుస్తుంది. ”నిస్సందేహంగా నా నమాజు, నా త్యాగం, నా జీవనంం నా మరణం- అన్నీ సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్  కొరకే”. (6:162)

సదఖా అనగానే మన మనసుల్లో మొట్టమొదట వచ్చే భావన డబ్బు ఖర్చు పెట్టడం. ఎక్కువ ఖర్చు పెట్టినవారికే పుణ్యముంది, లేనివారికి లేదు అనే భావన రేకెత్తుతుంది. కాని సదఖా అనే పదానికి చాలా విస్తృతి ఉంది. మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్తకు ప్రతి ఒక్కరి స్థోమత తెలుసు. ఎవరి వద్ద ఎంత శక్తీసామర్థ్యం ఉంది, ఎవరు ఏమి చేయగలరనేది అతనికి తప్ప మరెవ్వరికీ తెలియదు. అల్లాహ్  కొందరికి ధనం ఇచ్చాడు, కొందరికి విద్య, కొందరికి బుద్ధి, మరి కొందరికి వివేకము. ఐతే ఆయన మార్గంలో వీటన్నింటినీ ఉపయోగించడం కూడా సదఖాలోకే వస్తాయి.

కొంతమంది ధనముండుట వలన అల్లాహ్  మార్గంలో రేయింబవళ్లు ఖర్చు పెట్తూ ఉంటారు. లేనివారు వారిని చూసి, నిరాశానిస్పృహలతో ‘మా వద్ద కూడా ధనముంటే ఎంత చక్కగా ఖర్చు పెట్టేవారమో’ అంటూ బాధపడతారు. అలాంటివారు ప్రవక్త (స) గారి ప్రవచనాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అదేమంటే, ”మంచి మాట కూడా సదఖాయే”. మరొక హదీసులో ”నీవు ఏ చిన్న మేలునైనా కించపరచకు. అది నీ సోదరుడు నీతో కలిసినప్పటి చిరు మందహాసమైనా సరే” అని అనబడింది.

ఒక సందర్భాన ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ”సదఖా ఇవ్వటం ప్రతి ముస్లింపై విధి” అన్నారు. అనుచరులు ‘ఓ ప్రవక్తా! డబ్బు లేనివారు ఏం చేయాలి?’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స) ”శ్రమించి మీరు లాభం పొందండి. ఆపైన దానం చేయండి. అదీ కాకపోతే మంచిని అనుసరించండి, చెడుకు దూరంగా ఉండండి” అని బదులిచ్చారు.

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా కూడా బోధించారు: ”మృదువుగా మాట్లాడటం సదఖా, నమాజు చేయటానికి మస్జిద్‌ వైపునకు తీసుకెళ్ళే ప్రతి అడుగూ సదఖా, ప్రతి పుణ్య కార్యం సదఖాయే, తన సోదరుడ్ని చిరునవ్వుతో ఆహ్వానించటం సదఖా, మీ బొక్కెన నుండి అతని బొక్కెనలో నీరు వంచటం కూడా సదఖాయే”.

తాను ప్రవక్త (స) చెబుతుండగా విన్నానని హజ్రత్‌ బురైదా అస్లమీ అన్నారు: ”ప్రతి మనిషి శరీరంలో 360 జోళ్ళు (ఎముకలు) ఉంటాయి, ప్రతి ఎముకకు ఒక సదఖా చెల్లించాల్సిందే”. ఇదెలా సాధ్యం, ఎవరు చేయగలరిలా? అని సహచరులు ప్రశ్నించగా ఇలా ఆదేశించారు: ”మస్జిద్‌లో ఒక ఇటుక పడి ఉండుట చూసి దాన్ని పేర్చినా, దారిలో ఇతరులకు హాని కలిగించే  వస్తువును చూసి దాన్ని దారి నుండి తొలగించినా సదఖాయే, ఇది చేయలేని యెడల రెండు రకాతులు నమాజు చేసినా చాలు”.

హజ్రత్‌ అబూ జర్‌ (రజి) ప్రవక్త (స) వద్దకు వెళ్ళి – ‘నా వద్ద ఏమీ లేదు, నేనెలా సదఖా చేయను?’ అని అనగా ఆయన (స) ఇలా బదులిచ్చారు, ”నీవు అల్లాహు అక్బర్‌, సుబ్హానల్లాహ్‌ా, అల్హమ్దులిల్లాహ్‌ా, లా ఇలాహ ఇల్లల్లాహ్  మరియు అస్తగ్ఫిరుల్లాహ్‌ా పలుకు, మంచిని ఆజ్ఞాపించు, చెడునుండి వారించు, ప్రజల దారి నుండి ఎముక లేక ముల్లు తీసివేయి, గ్రుడ్డివానికి దారి చూపించు, చెవిటివానికి, వెర్రివానికి మాట చక్కగా విడమర్చి చెప్పు, ఎవరినన్నా ఏదైనా వస్తువు వెతుకుతూ చూస్తే నీకు దాని జాడ తెలిస్తే చెప్పు, బలహీనున్ని లేపి నిలబెట్టు, నిస్సహాయునికి సహాయం చేయి, ఇవన్నీ సదఖాలోకే వస్తాయి” అన్నారు. అదీకాక ఓ రైతు పంట పండిస్తే దాన్నుండి పక్షులు తిన్నా, వచ్చేపోయే జనులు ప్రయోజనం పొందినా అదీ సదఖా క్రిందికే వస్తుంది.

అల్లాహ్  మార్గంలో ఏ కొంచెం ఖర్చు చేసినా దాని పుణ్యము ఒకటి నుండి పది, పది నుండి 100, వంద నుండి 700 వరకు వృద్ధి చెందుతుంది. కొన్ని సదఖాలకు పుణ్యాలు తాత్కాలికంగా లభిస్తాయి, కొన్ని సదఖాల్లో పుణ్యం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. ఉదా: ఒక వ్యక్తి లాభదాయకమైన పుస్తకాన్ని పరుల ఉపయోగానికి లైబ్రరీలో పెట్టినట్లయితే దాని నుండి ప్రజలు లాభం పొందుతున్నంత వరకూ పుస్తకం పెట్టిన వ్యక్తికి తెలియకుండా పుణ్యం పెరుగుతూనే ఉంటుంది. అలాగే ఎవరైనా తమ పిల్లలకు మంచి మాట నేర్పిస్తే అలా ఈ మంచి ముందుకు సాగిపోతుంది.  నేర్పించిన వారి ఖాతాలో ఏ  బ్యాంకులూ, స్కీములూ ఇవ్వని లాభాలు చేరుతూ ఉంటాయి.

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ”దానం చేయువారి ధనం తగ్గదు, ఎవరైతే ఇతరుల తప్పులను క్షమిస్తారో వారికి అల్లాహ్  ఆదరణ ప్రసాదిస్తాడు, ఎవరైతే అల్లాహ్‌ా ముందు ప్రాధేయపడతాడో అతని ఆదరణను పెంచుతాడు”.ఒక వ్యక్తి తన భార్యాబిడ్డలపై ఖర్చు పెట్టటం కూడా సదఖాయే, వారిని పస్తులకు గురిచేసి ఇతరులపై ఖర్చు చేయటం మాత్రం తగదు. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు, ”తనపై, తన భార్యాపిల్లలపై ఖర్చుపెట్టేవాడికి  రెండింతలు పుణ్యం లభిస్తుంది. ఒకటి: సదఖా యొక్క పుణ్యం, రెండవది: తన సంబంధీకులను ఆదుకున్నందుకు పుణ్యం”. అలాగే ఒక ముస్లిం పుణ్యఫలాపేక్షతో తన కుటుంబీకులపై ఖర్చు పెడితే అతనికి దానం చేసిన పుణ్యం లభిస్తుంది అని కూడా అన్నారు.

ఈ హదీసులన్నీ తెలియపరచేదేమంటే సదఖా చేయు వ్యక్తికి సంకల్ప శుద్ధి చాలా అవసరం. మనిషి సంకల్పాన్ని అల్లాహ్‌ తప్ప మరెవ్వరూ ఎరుగరు, కాబట్టి దాని పుణ్యఫలానికి ఆధారం చిత్తశుద్ధి. చిత్తశుద్ధితో చేసిన చిన్న మంచి కార్యం కూడా అల్లాహ్  తలుచుకున్నంతవరకు పెంపొందుతూ ఉంటుంది. తీర్పు దినాన దానిని మనిషి ఆశ్చర్యచకితుడై చూస్తాడు. ప్రపంచంలో చేసిన ఆ కొంచెం పుణ్యానికి ఇంత ప్రతిఫలమా! అని విస్తుపోతాడు.

ఈ విషయాన్నే మన వేమన కవి ఎలా వర్ణించాడో చూడండి:-

చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు

కొంచైమైౖనా అదియు కొదువ కాదు

విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత

సంకల్పశుద్ధితో చేసిన సదఖాకు అల్లాహ్  ఇచ్చిన ఉదాహరణ ఇలా ఉంది: ”చిత్తశుద్ధితో, కేవలం అల్లాహ్‌ సంతోషం పొందే ఉద్దేశ్యంతో వ్యయపరిచేవారి వ్యయాన్ని మెట్ట ప్రదేశంలో ఉన్న తోటతో పోల్చవచ్చు. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ భారీ వర్షం కురవక, సన్నని జల్లు పడినా అదే దానికి చాలు. మీరు చేసేదంతా అల్లాహ్  దృష్టిలో ఉంది”. (2: 264) మరో చోట ఇలా ఉంది: ”తమ సంపదను అల్లాహ్  మార్గంలో ఖర్చు చేసేవారి ఖర్చు ఉపమానం ఇలా ఉంటుంది, ఒక్క విత్తనాన్ని నాటితే, అది మొలిచి ఏడు వెన్నులను ఈనుతుంది. ప్రతి వెన్నుకూ నూరేసి గింజలు ఉంటాయి, ఇదే విధంగా అల్లాహ్  తాను  కోరినవారి సత్కార్యాన్ని వికసింపజేస్తాడు”. (అల్‌ బఖరా)

చిత్తశుద్ధి లేని యెడల దాని ప్రతిఫలం ఈ ప్రపంచంలోనే లభిస్తుంది పరలోకంలో ఏమీ ఉండదు.

”విశ్వసించిన ఓ ప్రజలారా! కేవలం పరుల మెప్పును పొందటానికే తన ధనం ఖర్చు చేసేవాని మాదిరిగా, మీరు దెప్పిపొడిచి, దానగ్రహిత మనస్సును గాయపరచి మీ దానధర్మాలను వృథా చేసుకోకండి. అతని దానాన్ని ఈ విధంగా పోల్చవచ్చు, ఒక కొండ రాతిపై ఒక మట్టి పొర ఏర్పడి ఉంది. భారీ వర్షం దానిపై కురవగా ఆ మట్టి కాస్తా కొట్టుకుపోయింది. చివరకు మిగిలింది కొండరాయి మాత్రమే. ఇలాంటివారు తాము దానం చేస్తున్నామని భావించి చేసే పుణ్యకార్యం వల్ల వారికి ఏ ప్రయోజనమూ కలుగదు”. (అల్‌ బఖర)

అందుకే మనం చేసే పుణ్యకార్యాలపై మనం గర్వంతో పొంగి పోకూడదు. ఇతరుల మెప్పు కోసం కాక అల్లాహ్  సంతోషం కోసమే చేయాలి. అప్పుడే దాని పరిణామం అందమైన రూపంలో  మనకు లభిస్తుంది. కొన్ని పుణ్యాలు మన మరణం తర్వాత కూడా మనకు సదకా జారియాగా చేరుతూ ఉంటాయి. ప్రవక్త (సల్లల్ల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు: ”విశ్వాసి చనిపోయిన తర్వాత కూడా లభించే పుణ్యాల్లో విద్యా దానం, పుణ్యకార్యాలు చేసే సంతానం, వారసత్వంగా వదిలిన ఖుర్‌ఆన్‌, ప్రజల ప్రయోజనార్థం జారీ చేసిన నీటి సరఫరా, ప్రయాణికులకై నిర్మించిన సత్రాలు, మరియు యవ్వనపు కాలంలో, పుష్టిగా ఉన్నప్పుడు చేసిన సదఖా”. పుష్టిగా ఉన్నప్పుడు చేసిన సదఖా పుణ్యం ఎక్కువగా ఉంటుంది, కారణం ఆ సమయంలో మనిషికి కోరికలు కాంక్షలెక్కువగా ఉంటాయి, ధన వ్యామోహంతోపాటు భవిష్యత్తు యొక్క దిగులు ఉంటుంది. కాబట్టి అప్పుడు చేసిన సదఖాలకు పుణ్యం అధికం. ఇలా మనం చేసే ప్రతి సత్కార్యానికి పుణ్యమార్జించటం సులభమే. కాని దానికి కావలసింది చిత్తశుద్ధి, మంచి సంకల్పం, అల్లాహ్  దాన్ని ఆమోదించాలనే ఆపేక్ష .

Related Post