ప్రజల్లో ఇస్లాం ధర్మం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. కారణం – ఇస్లాం వాస్తవికత గురించి పూర్తి అవగాహనలేమి కావొచ్చు లేదా ముస్లింల ప్రవర్తనా శైలీ అవ్వొచ్చు. లేక ఇస్లాం శత్రువుల తరపున సాగుతున్న ప్రాపగండా అయివుండొచ్చు. ఈ కారణాల ఫలితమే అధిక శాతం మంది ఇస్లామీయ సిద్ధాంతాల గురించి అది ఇచ్చే శిక్షణ గురించి, పిలిచే మార్గం గురించి పూర్తి అపార్థానికి గురై ఉండటం మనం చూస్తాం. ఈ వ్యాసంలో ఇస్లామీయ మౌలిక సిద్ధాంతాల గురించి చర్చించడం జరిగింది.
మొదటి అంశం: ఏకేశ్వరోపాసన, ఏకదైవారాధన. ఇస్లాం సర్వమాన వాళిని సృష్టికర్త అయిన అల్లాహ్‌ాను ఆరాధించమని చెబుతుంది. ఆయన్ను వదలి ఇతరుల్ని పూజించడంగానీ, ఆయనకు ఇతరుల్ని భాగస్వాములుగా చేసి నిలబెట్టడం గాని క్షమించరాని నేరంగా పరిగణిస్తుంది. సర్వ కోటి జీవరాసులను, సర్వ శ్రేష్టులైన మానవులను పుట్టించినవాడు ఆయనే గనక మన పూజా ప్రార్థనలకు ఆయన ఒక్కడే నిజమైన అర్హుడు అని, మానవు లకు, సృష్టిలోని ఇతర జీవరాసులకు ఉపాధినిచ్చేవాడు ఆయన ఒక్కడేనని వక్కాణిస్తుంది. మనిషి కూడా ఇక్కట్ల పాలైనప్పుడు (ఆకాశం వైపు చూస్తూ) దేవా! నన్ను రక్షించవయ్యా! అని వేడుకోవడం మనం చూస్తుంటాం కదా!!
సృష్టికర్త గురించి, సృష్టి రహస్యాల గురించి తెలుసుకోవాలన్న ఆతురతతో అలౌకికంగా అన్వేషణ ప్రారంభించిన అనేక వర్గాలు తప్పుదారి పట్టాయ న్నది గమనార్హం. వారిలోని కొందరు తమలాంటి మట్టి మనుషుల్నే ఆరాధించారు. మరికొందరు సూర్యాచంద్ర నక్షత్రాల్ని ఆశ్రయించారు. ఇంకొందరేమో స్వహస్తాలతో చేసిన ప్రతిమల్ని, చెక్కిన శిల విగ్రహాలకు హారతులు పట్టారు. మిగతా కొందరు ఈ సృష్టిబ్రహ్మాండాన్ని చూసి ఆశ్చ ర్యానికి లోనై; సృష్టి, సృష్టిలోని జీవరాసులు, మానవులు ఒక విస్పోటం ద్వారా ఉనికిలోకి వచ్చేశాయి అన్నారు. ఒకటి అతి వృష్టి అయితే మరొకటి అనావృష్టి.
అయితే ఇస్లాం ఈ విషయంలో మానవాళికి నిజమైన సృష్టికర్త వైపునకు మార్గదర్శకం చేస్తుంది. ఆయనే నిజమైన ఆరాధ్యుడు అల్లాహ్‌ా. ఆయనకు సాటి సమానులుగానీ, భాగస్వాములుగానీ, సహవర్తులుగానీ లేరని ఘంటాపథంగా చెబుతుంది. అలా పూర్తి మానవాళిని భ్రమల వలయం నుండి కాపాడటమే కాక ఆయా మార్గాలకు గురైనవారి జీవితాలకు ఓ కొత్త అర్థానిస్తుంది.
రెండవ అంశం: నిజం చెప్పాలంటే అల్లాహ్‌ా మనిషిని ఇట్టే ఏదో వేళాకోళంగా పుటించలేదు. పుట్టించిన తర్వాత ఏ మార్గదర్శకమూ లేకుండా అతని మానాన అతన్ని వదలనూ లేదు. వారి వైపు అనేక మంది ప్రవక్తలను ప్రభవింపజేశాడు.
ప్రవక్తలనే ఈ వర్గం దైవాదేశాలను ప్రజలకు అర్థమయ్యేలా బోధించే వారు. సన్మార్గం ఏదో, శాంతి ఏ మార్గం గుండా ప్రాప్తమ వుతుందో, ఏ మార్గం ద్వారా వారి జీవితాలు చరితార్థమౌతాయో హితవు చేసేవారు. ఈ దైవాదేశాలన్నిటిలోను ప్రజల శ్రేయం, క్షేమం తొణికిసలాడుతూ ఉండేది. మానవ లోకంలో మృగ మనస్తత్వం గల మనుషులు ప్రజలపై చేసే ఆకృత్యాలను, పాల్పడే అఘాయిత్యా లను అరికట్టి, వారి జీవితాలను సంస్కరించేవి. వారిలో గొప్ప నైతిక తను నాంది పలికేవి. ఈ పవిత్ర లక్ష్యం కోసం ప్రభవింపజేయబడిన ప్రవక్తల పరంపరలోని చిట్టచివరి దైవప్రవక్తే ముహమ్మద్ (స). అల్లాహ్‌ా ఆయన్ను ఓ ప్రత్యేక వర్గం కోసమో, ప్రత్యేక ప్రాంతం, జాతి కోసమో కాకుండా సర్వ మానవాళి కోసం అంతిమ ప్రవక్తగా, సర్వలోక కారుణ్య మూర్తిగా చేసి ప్రభవింపజేశాడు. ఈ లక్ష్య సాధ నకై వారికి దైవగ్రంథమైన ఖుర్‌ఆన్ వొసగాడు. అందులో ప్రజలం దరి కోసం వారి ప్రభువు ఇచ్చిన ఆదేశాలున్నాయి. మానవ శ్రేయం, ఇతరత్రా జీవరాసుల క్షేమానికి సంబంధించి ప్రతి విషయం వైపున కు ఖుర్‌ఆన్ మానవాళిని ఆహ్వానిస్తుంది. ఖుర్‌ఆన్ బోధించని మంచి, వారించని చెడు అంటూ ఏదీ లేదు. మానవ జాతికి చెందిన ప్రతి చిన్నా పెద్ద విషయాలను ఖుర్‌ఆన్ చర్చించడంతో పాటు వాటి కి సరైన పరిష్కార మార్గాలను కూడా బోధపరుస్తుంది.
మూడవ అంశం: అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) మనకు చేరవేసిన ఇస్లామీయ ఆదేశాలు ఓ గొప్ప మానవ సమాజ నిర్మాణం కోసం ఆయువు పట్టులాంటివి. మానవ శాంతి శ్రేయాల విషయం లోనైతేనేమీ, మానవ ప్రగతిని నీరుగార్చే చెడు విషయాల, హానికర మార్గాల నిర్మూలన విషయంలోనైతేనేమీ ఇస్లామీయ సిద్ధాంతాలు చాలా పెద్ద పాత్రనే పోషిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇస్లామీయ ఆదేశాలను తు.చ తప్పకుండా ఆచరించే ఏ సమాజంలోనైనా న్యాయం నాలుగు పాదాల నడుస్తుంది. సమాజం లోని వ్యక్తులందరి మధ్య సమానత్వం, సమన్వయాలు, స్నేహ సం బంధాలు, సహిష్ణుతా భావాలు వెల్లివిరిస్తాయి.
ఇస్లాంలో కులం, వర్ణం, వర్గం, ప్రాంతం అన్న తారతమ్యాలకు తావు లేదు. అంటరానితనం, నిమ్నోన్నత భావాలకి, అగ్రవర్ణం, అధమ వర్ణం అన్న అప్రధాన అంశాలకి చోటు లేదు. ధనిక-పేద, రాజ-ప్రజ, నల్ల- తెల్ల అన్న కృత్రిమమైన గీతలు లేవు. ఇవేమీ వ్యక్తి గౌరవానికి, కీర్తి ప్రతిష్ఠలకు తార్కాణాలు కావు. ఏ వ్యక్తి అయినా అతనిలో గల దైవభీతి, దైవ విధేయతతోనే గుర్తించబడతాడు. అలాగే స్త్రీని గౌరవించాలని, ఆమెకు పురుషుడితోపాటు సమానమైన హోదాను ఇవ్వాలని హితవు చేస్తుంది ఇస్లాం. మనిషికి దేవుడు ఇచ్చిన గౌరవంలో ఆమెకు సైతం సమాన హక్కు ఉందని వక్కాణిస్తుంది.
అదే విధంగా కుటుంబ వ్యవస్థ విషయంలో మరింత శ్రద్ధను కన బరుస్తుంది ఇస్లాం. కుటుంబ వ్యవస్థ పురోభివృద్ధి కోసం భార్యా భర్తల అనుబంధానికి పెద్ద పీట వేస్తుంది. వారి మధ్య అన్యోన్యతను పెంపొం దించే సూత్రాల్ని తెలియ పర్చడంతోపాటే కుటుంబ విచ్ఛిన్నానికి, సమాజ వినాశానికి దారి తీసే వ్యభిచారం, అక్రమ సంబంధాలను అరి కడుతుంది. దాంపత్య జీవితంలో తన జీవిత భాగస్వామి అయిన మగు వను, ఆమె వ్యక్తిత్వాన్ని గుర్తించి ఆమెకివ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వమం టుంది. ఆమెతో మంచిగా ప్రవర్తించమని హితవు చేస్తుంది. అదే విధం గా భార్య సైతం తన భర్తతో మంచిగా వ్యవహరించాలని, అతని ఇంటి నీ, సంతానాన్ని, పరువు ప్రతిష్టను కాపాడమని ప్రబోధిస్తుంది. అలాగే పెద్దల్ని మర్యాద పూర్వకంగా పలుకరించాలని, పిల్లలతో ప్రేమగా మసలుకోవాలని, వృద్యాప్యంతో ముఖ్యంగా తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలని, ఇది మానవులందరి సాంఘీక సమిష్టి కర్తవ్య మని వక్కాణిస్తుంది. మాధవుడికి దగ్గర చేసే అతి గొప్ప సాధనం సాటి మానవుల పట్ల సత్ప్రవర్తన కల్గి ఉండటమేనని హితవు చేస్తుంది.
ఇక ముస్లిం (విశ్వాసి) విషయానికొస్తే-తాను తన మాటల్లో, చేతల్లో సత్య సంధతను అలవర్చుకోవాలి. కార్యాచరణలో పూర్తి చిత్తశుద్ధి కలిగి వుండాలి. ఆత్మ పరిశుద్ధతతో పాటు బాహ్య పరిశుభ్రతను సైతం ప్రాముఖ్యం ఇవ్వాలి. బాహ్య పరిశుభ్రత విశ్వాసంలోని సగభాగమైతే, మరో సగ భాగం ఆత్మ పరిశుద్ధత అంటోంది ఇస్లాం.
ఇస్లాం యొక్క ఓ ప్రత్యేకత ఏమిటంటే; అది తన్ను విశ్వసించేవారిని దైవభీతి ప్రాతిపదికపై సమైక్యపరుస్తుంది. రక్త సంబంధం కన్నా గట్టి సంబంధం అయిన విశ్వాస సంబంధానికి నాంది వేస్తుంది. మంచి కార్యాల్లో, సమాజానికి సంఘానికి ఉపకరించే పనుల్లో పరస్పరం సహాయ సహకారాలు అందిపుచ్చు కోవాలని ప్రోత్సహిస్తుంది. వారి మధ్య శాశ్వత ప్రేమాభిమానాలను, అప్యాయత, అనురాగాలను పెంచి పోషిస్తుంది.
ఇస్లాం ఇచ్చే శిక్షణలో సాటివారితో మంచిగా మసలుకోవడం అనేది ప్రధానమైనది. వారు ముస్లింలు అయినా, ముస్లింమేత రులైనా ఆస్థికులైనా, నాస్తికులైనా మంచి మాట అందరి కోసం అనునయిస్తుంది అంటుంది. మంచి నడవడిక ప్రతి ఒక్కరికీ అలపడాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో మనిషి కడు జాగ్రత్తగా ఉండాలని బోధిస్తుంది. స్వర్గమైనా, నరకమైనా వారిద్దరేనని జ్ఞాపకం చేస్తుంది. అలాగే అన్నాతమ్ముళ్ళతో, అక్కాచెల్లెళ్ళతో, బంధుమిత్రులతో సత్సంబంధాన్ని పటిష్ట పరచుకోవాలం టుంది. అప్పుడప్పుడు వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకోవడంతోపాటే అవ సరార్థం చేతనైనంత సహాయం చేయాలంటుంది. స్నేహ సౌహార్థ్రతలను వృద్ధిపరిచే గిప్ట్‌ను బహూకరించండని ప్రోత్సహిస్తుంది.
అంతే కాకుండా సమాజంలో నివసించే పీడిత జనోద్ధరణ కోసం పాటు పడమని, అనాధల్ని ఆశ్రయమిచ్చి ఆదుకొమ్మని, ఆకలిగొన్నవారి పాలిట అన్నదాతలు కండని, అతిథులకు తగిన సత్కార్యాలు చేయమని, చెడుగా బిహేవ్ చేసేవారిని మంచి మనస్సుతో క్షమించమని హితవు చేస్తుంది. మనిషి చేపట్టే ఏ కార్యమైనా స్వార్ధరహితమైనదై ఉండాలని, ఎవరితోను ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించవలదని, తను చేసే ప్రతీ పని దైవాభీష్టం కోసం మాత్రమే అయివుండాలని నొక్కి చెబుతుంది.
అలాగే మత్తు పదార్థాలను ఇస్లాం నిషేధిస్తుంది. మనిషి మస్తిష్కాన్ని మత్తు పదార్థాలు నిర్వీర్యం చేస్తాయి గనుక, తెలివి అనే సరళ రేఖే గనక లేకపోతే మనిషికీ జంతువుకీ ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉండదు గనక ఇస్లాం మత్తు పదార్థాలను పూర్తిగా నిరసిస్తుంది, నిషేధిస్తుంది. మనిషికి మేలుని చేకూర్చే ప్రతి వస్తువును ధర్మసమ్మతం చేస్తుంది.
నాల్గవ అంశం: ఇస్లాం అగోచర విషయాలపై సైతం దృష్టి సారిస్తుంది. అందులోని నిజానిజాలను వేరు పర్చి, వాటి పట్ల ప్రజలలో ప్రబలివున్న అపోహాలు, మూఢవిశ్వాసాల్ని ప్రక్షాళనం గావిస్తుంది.. ఇస్లామీయ సిద్ధాంతాలన్నీ ‘ఈ నిఖిల జగత్తుకి ప్రభువు ఒక్కడే’ అన్న కేంద్రాంశంతో ముడిపడి వుంటాయి. ఇస్లామీయ మౌలిక సిద్ధాంతాల్లో సృష్టిరాసుల్లో ని అద్భుత సృష్టి అయిన దైవదూతల (వెలుగుతో సృజించబడినవారు) పై విశ్వాసం కూడా ఒకటి. వారి స్వభావాలు, అవసరాలు, చర్యలు మానవ లోకానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. అలాగే అల్లాహ్‌ా అవతరింపజేసిన ఆకాశ గ్రంథాలపై విశ్వాసం కూడా ఈ కోవకు చెందినదే. (సశేషం)