సాత్విక దృష్టితో చూస్తే..!

విశ్వ మానవ హృదయాల్లో ఏర్పడిన కారు నలుపు మచ్చలను, నిర్హేతుక అపోహలను, నిరర్థక అపార్థాలను నిస్తులమైన నీ కరుణతో తుడిచి వేయి ప్రభూ! అని భారత గణతంత్ర దినోత్సవ శుభ సందర్భాన వేడుకుందాం

విశ్వ మానవ హృదయాల్లో ఏర్పడిన కారు నలుపు మచ్చలను, నిర్హేతుక అపోహలను, నిరర్థక అపార్థాలను నిస్తులమైన నీ కరుణతో తుడిచి వేయి ప్రభూ! అని భారత గణతంత్ర దినోత్సవ శుభ సందర్భాన వేడుకుందాం

65 వ భారత గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా

”దేశమనియెడు దొడ్డ వృక్షం   ప్రేమలను పూలెత్తవలెనోయ్‌” – గురజాడ

దేశం వృక్షమైతే రాష్ట్రాలు శాఖలు. ఆ శాఖలు పచ్చగా ఉంటేనే కదా పులూ ఫలాలూ. అంతేకాదు. ఒంటి కొమ్మతో దిక్కులు చూసే చెట్టు నిటారుగా నిలబడ్డ పీచు జుట్టు. తల అందానికి ప్రతి శిరోజం సహకారి. తరు సౌందర్యానికి ప్రతి కొమ్మ దోహదకారి. మరి ఏ కొమ్మకాకొమ్మ వేరయి పోవాలని మంకు పట్టు పట్టితే ఎలా?

ఇక- పరమోన్నత ప్రభువు ప్రేమ పరిమళాన్ని ఎద నిండా నింపుకున్న మధుర భక్తి ప్రవణులకు విశ్వమంతా దేవుని కుటుంబమే. అందువల్ల వారిలో విశ్వ జనీన దృష్టి, సాత్విక భావన వేళ్ళూనుకుని ఉంటుంది. వారు ఏక కాలంలో జాతీయతనూ, విశ్వజనీనతనూ ఇముడ్చు కున్న సమన్వయశీలురు. ”ఈ లోక ప్రజల బ్రతుకులు శాంతియుతంగా, హృదయాలు నిర్మలంగా ఉండేటట్లు చూడు ప్రభూ!” అని ఆక్రోశించే అభిమాన ధనులు, లోకోద్ధారకులు వారు. అయితే, వారి జాతీయాభిమానం తన చుట్టూ గోడలు కట్టుకున్న ఇరుకు చట్రం కాదు. వారు దేశాభిమానం పేర గత వైభవాన్ని గూర్చి డిండిమం మ్రోగించి వర్తమానాన్ని విస్మరించే వివేకశూన్యులు కారు. దేశ భవిష్యత్తుకు పసిడి ప్రగతుల పునాదులు వేసే నవయుగ వైతాళికులు.

వర్తమాన సమస్యలు కన్నుగప్పగా ముందు చూపు (ఫిరాసత్‌) కోల్పోయే పిరికి సన్యాసులు కారు వారు. వర్తమానంలో సమస్యలకు ఎదురొడ్డి నిలబడి బార సాచి భవిష్యత్తును కౌగిలించుకునే మహా ద్రష్టులు. భవిష్యత్తు మీద, దేవుని మీద అంత ప్రగాఢ   విశ్వాసమున్నవారు కాబట్టే వారు సంకుచితమైన జాతీయతకు అతీతంగా మసలుకుంటారు ”కుల్లు షైయిన్‌ యర్‌జివు ఇలా అస్లిహి” (ప్రతి వస్తువు తన పూర్వ (స్వ) స్థితికి చేరుకుంటుంది) అన్నట్టు ఏనాటికైనా జగమంతా ఒక కుటుంబంలా ఏర్పడి సత్కార్యాల్లో పరస్పరం చేదోడువాదోడుగా నిలిచే, నిండు వసంతాన్ని తలపించే పర్వదినం రానే వస్తుందన్నది వారి ప్రగాఢ నమ్మకం.

వారికి స్వదేశం, స్వరాజ్యం, స్వరాష్ట్రం పట్ల ఎంత అభిమానమున్నా ఇతర దేశాల పట్ల ఎప్పటికీ చిన్న చూపు ఉండదు. విశ్వ జన ప్రగతియే తమ ప్రగతిగా, ప్రపంచ శాంతియే తమ ఆత్మ సంతృప్తిగా, లోక కళ్యాణమే తమ జీవిత ధ్యేయంగా  భావించే  పరిశుద్ధ హృదయులు వారు. అంతటి విశాల మనస్కులు కాబట్టే ”మజ్‌హబ్‌ నహీ సిఖాతా ఆపస్‌మేఁ బైర్‌ రఖ్నా” (ఏ మతమైనా బోధించదుగా ద్వేషాన్ని) అని అనగలిగారు. మంచి అన్నది ఏ గడ్డకూ, ఏ భూభాగానికి చెందినదైనా సాదరంగా స్వాగతించారు.  నిండు గుండెతో అభినందించారు. దాన్ని పెంచేందుకు పగలూ రాత్రి ఒకటిచేసి పరిశ్రమించారు. చెడు అన్నది సొంత గడ్డ మీదున్నా నిద్రాహారాలు మాని, నిరాహార దీక్షలు బూని నియంత్రించేంతవరకు అలుపెరగని కృషి చేశారు. వారిలోని అకుంఠిత దీక్ష, మొక్కవోని సాహసం, అనుపమాన సహనం, వజ్ర సంకల్పం, కార్య దక్షతల వల్ల మానవత్వం మందారం వలే విరబూసింది.

పాశ్చాత్యుల పైశాచికాలూ, పైత్యాలూ వారికి తెలుసు. ఫాసిస్టుల దమన నీతీ వారెరుగుదురు. నాటి భారతాన తెల్ల దొరలు అవలంబించిన   అమానుషత్వమూ  వారికి తెలుసు. నేడు విశ్వ శాంతి పేర సాగిస్తున్న దౌష్ట్యాలూ, దహనకాండలూ వారికి అనుభవైక విషయమే. కాపిటలిస్టు కాళ నాగులూ పరిచితమే. కమ్యూనిస్టు కరాళ దమష్ట్రాలూ వారికి సుబోధకమే. సామ్యవాదుల తుపాకీ తూటాలకు చిల్లులు పడ్డ పసికూనల దేహాలూ వారికి తెలుసు. ఇన్ని తెలిసిన వీరు అన్ని దేశాల ప్రగతి పథకాలను అభినందిస్తూనే వాటి లోపాలను ముక్కు సూటిగా ప్రకటించగలిగే ధీరోత్తములు.

ప్రథమ ప్రపంచ సంగ్రామం వల్ల కలిగిన దుష్ఫలితాలను కళ్ళారా చూశారు వీరు. ప్రపంచానికి యుద్ధం ఎంత ప్రమాదకరమో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం రాక ముందే లోకం జాత్యాహంకార తాపంతో ఎలా కుతకుత ఉడికిపోయినదో గమనించారు. ”ఎప్పుడు ఇద్దరు మనుషులు పరస్పరం సహకరించుకోరో, ఒండొకరి శ్రేయం కోరుతూ హక్కులకై వాదించరో అప్పుడు మానవత్వం నశించింది” అని నమ్మే వీరు, నేడు ప్రపంచం నలుమూలలా రగులుకొంటున్న వైమనస్యాన్ని చూసి భరించలేని బాధతో దిగాలు చెందు తున్నారు. ద్వేషోన్మాదం చిందులు త్రొక్కుతున్న, క్రోధం, లోభం, కామం థదిశల బుసలుకొడుతున్న నేటి ఆధునిక యుగంలో ప్రేమ పద్మం సత్యజ్యోతి వెలుగులో రేకులు విప్పాలని, శాంతి పతాకం ప్రపంచమంతటా రెపరెపలాడాలని కోరుకునే వారిలో వీరు తొలివారు.

మానవుని భవిష్యత్తు పట్ల అచంచల విశ్వాసం, సమర విముఖత, శాంతి కాముకత, కారుణ్య దృష్టి, సౌహార్థ్రత, స్నేహ భావం, కుల గోత్ర, వర్గ-వర్ణ, మత-ప్రాంత విభేదాలకతీతమైన మానవ ప్రేమ; వీరి సాత్విక దృక్పథాన్ని వేనోళ్ళా చాటే అంశాలు. ఈ అంశాలే వారి   మాటల్లో,       చేతల్లో  మనోహరంగా దర్శనమిస్తుంటాయి. అంతటి సువిశాల రమణీయ దృక్పథం ఉండబట్టే వారు మహా మహులుగా, మహి మాన్విత వ్యక్తులుగా ప్రపంచ చరిత్రలో పసిడి సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు. అట్టి పురుషోత్తముల నోట వెలువడే ప్రార్థన మాట ఎంత సుందరమో, సుమధురమో! అది వ్యక్తిగతమైన భక్తి ప్రపత్తికి మాత్రమే పరిమితమైంది కాదు. విశ్వ మానవ అంతః కుహరాల్లో ప్రతిధ్వనిస్తున్న భావాలకది అక్షర సంపుటి.

‘మనస్సు భయముక్తమై, శిరస్సు శిఖరంలా నిల్చిన చోట

జ్ఞానం స్వేచ్ఛగా విహరించే చోట

జాతి భేదాల ఇరుకు గోడలలో ముక్క

చెక్కలు కాకుండా లోకం దీపంగా వెలిగే చోట

క్షుద్రమైన ఆచారాల ఎడారులలో

హేతువు స్రోతస్విని ఇంకిపోని చోట

ఓ ప్రభూ! మా మాతృదేశాన్ని మేల్కొల్పవూ”

ఫాలం మీద ద్వేషరక్తం పులుముకుని

ప్రళయ తాండవం చేస్తున్న దేశాలను

ప్రభూ! నీ దక్షిణ కరంతో స్పృశించు

వారి బ్రతుకుల్లో అమృత శాంతిని నింపు

ప్రవిమల సౌందర్యచ్ఛందాన్ని పలికింపు!!

అన్న ‘విశ్వకవి’ ఆవేదనాభరిత పలుకులు స్పూర్తిదాయకంగా నిలవాలి.

విశ్వ మానవ హృదయాల్లో ఏర్పడిన కారు నలుపు మచ్చలను, నిర్హేతుక అపోహలను, నిరర్థక అపార్థాలను నిస్తులమైన నీ కరుణతో తుడిచి వేయి ప్రభూ! అని భారత గణతంత్ర దినోత్సవ శుభ సందర్భాన వేడుకుందాం.

Related Post