అన్ని రోజులూ మంచివే. అన్ని కాలాలూ మంచివే. మనం చేసే పనులు మంచివయితే ఫలితాలు మంచివి అవుతాయి. మన ఆలోచనలు సక్రమంగా ఉంటే మనం చేసే పనులూ సక్రమంగా ఉంటాయి. మన సామర్థ్యం, మన జ్ఞానం, మన అనుభవం, మన విశ్వాసం, మన ఆత్మ విశ్వాసం, కార్య ప్రణాళిక, క్రమశిక్షణ వీటిపైనే మన జయాపజయాలు, లాభనష్టాలు ఆధార పడి ఉంటాయి.అయితే కొందరు ఇవేమి పట్టనట్లు తమ నిర్వాకాలకు అన్యుల్ని, సూర్యచంద్రనక్షత్రాల్ని బాధ్యుల్ని చేస్తారు. ‘మా వాడు మంచి నక్ష త్రంలో పుట్టాడు’ అని ఒకడంటే, ‘మీ హస్తవాసి మంచిది’ అంటూనే హస్తాని కున్న వాచీ మీద కన్నేసేవాడు మరొకడు. ‘అర చేతి గీత చూసి నీ రాత తెల్చేస్తాను’ అంటాడు ఒకడు. ‘నీ ఇంటి వాస్తు చూసి నీ కొంప కూల్చేస్తానంటాడు’ మరొకడు. ‘నీ బోణి మంచిది’ అని ఒకడంటే, ‘నువ్వు ఎదురొస్తే మంచిది’ అంాడు మరొకడు. ఒకడికి పిల్లి శకునం, ఒకడికి బల్లి శకునం, ఒకడికి తుమ్ము శకునం, ఒకడికి వితంతు చెల్లి శకునం, ఒకడికి విధవ తల్లి శకునం. ఒకడికి నక్క శకునం, ఒకటడికి కుక్క శకునం, ఒకడికి వితంతువు అక్క శకునం. ఒకడికి శుభ లగ్నం ఒకవేళ, మరొకడికి శుభ ముహూర్తం మరొకవేళ. కొందరికి కాకి శకునం, కొందరికి గుడ్ల గూబ శకునం, కొందరికి 10, 13 వంటి సంఖ్య శకునం, కొందరికి కొన్ని ఘడియలు శకునం కొందరికి కొన్ని రోజలు శకునం-ఒక్క మాటలో చెప్పాలంటే బాగా అందరిని ప్రభావితం చేసే ప్రమాదకర వైరస్ ఈ శకునం. ఇలాంటి శకునాల్లో ఓ బుల్లి శకునం సఫర్ మాసపు శకునం. నమ్మకం అది ఏదయినా సరే, భౌతికంగా, మానసి కంగా మనల్ని బలహీన పరిస్తే దాన్ని విషంలా భావించి వదిలెయ్యాలి. అది ఎంతమాత్రం సత్యం కాదని తెలిసుకోవాలి. ఎందుకంటే సత్యం సదా మనిషిని బల పరుస్తుంది, దాన్ని నమ్మి నడుచుకునే వ్యక్తిలో నిత్య చైతన్యాన్ని నింపుతుంది. ”అల్లాహ్ మాకు రాసి పెట్టినది తప్ప మరొకటి మాకు జరగదు. ఆయనే మా సంరక్షకుడు. విశ్వాసులయిన వారు అల్లాహ్‌నే నమ్ముకో వాలని (ఓ ప్రవక్తా! వారికి చెప్పు”. (తౌబహ్: 51)
దైవప్రవక్త (స) ఇలా అన్నారు: ”వ్యాధి ఏది స్వతహాగా అంటువ్యాధి అయి ఉండదు. శకునం లేదు. ఏ పక్షిని చెడు శకునంగా భావించడం సరి కాదు. సఫర్ మాసాన్ని చెడుగా భావించడం తగదు”. (ముస్లిం)
సఫర్ మాసానికి సంబంధించి ప్రచారంలో ఉన్న కథనాలలో రెండు. 1) ఈ మాసంలో ప్రవక్త (స) వారు రోగ బారిన పడ్డారని, ఆ రోగ అవస్థలోనే అయన మరణించారని, కాబట్టి సఫర్ మాసం మంచిది కాదని అన్నది ఒకటి. ఈ కారణంగా చాలా మంది ధర్మ అవగాహన లేని ముస్లింలు ఈ మాసంలో వివాహమ, శుభ కార్యం ఇత్యాది వాటిని చెయ్యరు. ఈ మాసంలోనే ప్రవక్త (స) తన ముద్దుల కూతురు ఫాతిమా (ర) గారిని అలీ (ర) గారికిచ్చి నికాహ్ చేశారు అన్న యదార్థం పాపం ఈ అమాయకులకు తెలియదు. ఈ మాసం చివర్లో ‘ఆఖరీ చహార్ షున్బా’ – చివరి బుధవారం పేరుతో పచ్చిక బయళ్ల మధ్య సమయం గడిపి వస్తుాంరు.
2) అజ్ఞానం కాలంలో బాగా ప్రచారంలో ఉన్న భావన-సఫర్ అనే పురుగు మనిషి కడుపు లోపల ఉంటుందని, దానికి ఆకలేస్తే అది మనిషిని అతలా కుతలం చేసేస్తుందని, కొన్ని సందర్భాలల్లో దాని తీవ్రత మరణానికి దారి తీస్తుందని, ఈ కారణమంగా సఫర్ మాసం చెడ్డదని. ఈ రెండు అపనమ్మకాలు, గాలి కబుర్లు నేటికీ ఏదోక రూపమలో ఎక్కడో చోట మనకు దర్శనమిస్తూనే ఉంటా యి. దైవప్రవక్త (స) అన్నారు: ”నిశ్చయంగా చెడు శకునం, తాయెత్తులు వేలాడదీసుకోవడం, మందు మాకు ద్వారా మనసును వస పరచుకోవచ్చు అన్న భావన షిర్క్ విందే” (ముస్నద్ అహ్మద్)
”ఎవరయితే శుకున బారిన పడతారో వారి పరిస్థితి చాలా విచిత్రంగా ఉం టుంది. అతని మంచిని ఆశిస్తూ ఉంటాడు కానీ శకునం తాలూకు నిరాశే అతనిలో అధికంగా ఉంటుంది. అతను మంచి కోరికలు కలిగి ఉంటాడు కానీ, అతనిలో శకునం తాలూకు భయమే ఎక్కువ ఉంటుంది. విధి వక్రించినా, జరగాల్సిన మేలు జరక్కపోయినా ప్రతి దాన్ని అతను ఏదో ఒక వస్తువు శకునంగా భావించి, పరాజయ భారాన్నంతా ఆ వ్యక్తి లేదా వస్తువు మీద నెట్టేసి బాధ్యత నుండి పారి పోయేందుకు ప్రయత్నిస్తాడు. మనిషిలో తిష్ట వేసుకున్న శకున జాఢ్యం అతన్ని ప్రగతి బాటన పయనించకుండా ఆపు తుంది. ఉన్నత స్థాయికి అతను చేరుకోకుండా నిరోదిస్తుంది. అలా అతని ప్రయత్నం వృధా అవుతుంది. అతని ఆశయం నీరుగారి పోతుంది” అన్నారు ఇమామ్ మావర్దీ (ర).
శకునానికి విరుగుడు:
‘శకునం అనే భావన ఎలాంటిదంటే, దాన్ని ఆశ్రయించిన వ్యక్తిని భయం గుప్పెట్లోకి నెట్టుతుంది, అతన్ని తీవ్రంగా నష్ట పరుస్తుంది. దాన్ని పట్టించుకోని వ్యక్తి నుండి అది తోక ముడిచి పారి పోతుంది. అతనికి ఎలాంటి నష్టం వాటిల్లదు.ఎవరికయినా ఎప్పుడయినా ఇలాంటి ఆలోచన వచ్చినా, ఎవరి ద్వారా ఇలాంటి మాట విన్నా, ఇలాంటి దృశ్యాలను కన్నా అతను ప్రవక్త (స) వారు సూచించిన ఈ విరుగుడు ప్రార్థన చెయ్యాలి’ అన్నారు ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ (ర). ”అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరుక్. వ లా తైరా ఇల్లా తైరుక్. వ లా ఇలాహ గైరుక్”. (అహ్మద్) – ” ఓ అల్లాహ్నీ! నీ వద్ద మేలయినదే అసలు మేలు, నీ వద్ద కీడయినదే అసలు కీడు. నువ్వు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు”.
”అల్లాహుమ్మ లా యాతి బిల్ హసనాతి ఇలా అన్‌త. వ లా యజ్‌హబు బిస్సయ్యిఆతి ఇల్లా అన్‌త.వ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిక”. (అబూ దావూద్) ఓ అల్లాహ్ నువ్వు తప్ప మేళ్ళను మాకు ప్రసాదించేవాడు ఎవ్వరూ లేరు. నువ్వు తప్ప మా నుండి చెడులను తొలగించే వాడు ఎవ్వడూ లేడు. నీ అనుగ్రం లేకుండా చెడు నుండి రకణ పొందే ధైర్యం గానీ, సత్కార్యం చేసే శక్తి గానీ మాలో లేదు”. (అబూ దావూద్)
శకునం నష్టాలు: శని, శకున, అరిష్ట భావాలు కలిగి ఉండటం వల్ల కలిగే నష్టాలను మనం పదిగా పేర్కొనవచ్చు.
1) శకునం విశ్వాసానికి విరుద్ధ పదం, నమ్మకానికి వ్యతిరేకం.
2) శకునం వల్ల కీడు సోకడంగానీ, మేలు కలగడం గానీ జరుగదు.
3) శకునం బుద్ధి మాంద్యానికి, వివేక శూన్యానికి నిదర్శనం.
4) శకునం ఆందోళనకు, చపల చిత్తానికి ఆనవాలు.
5) శకునం కార్య శూన్యతకు ప్రేరకం.
6) శకునం మంచి పనులు కూడా చేడకుండా ఆడ్డుకుంటుంది. మనిషి ప్రయత్నాన్ని మాన్పించి, పని దొంగగా
మారుస్తుంది.
7) శకునం అజ్ఞాన కాలపు అవలక్షణం, మూర్ఖపు చేష్ట.
8) శకునాన్ని నమ్మడం అంటే విధి వ్రాతను తిరస్కరించడమే.
9) శకునం అవిశ్వాసుల గుణం.
10) అల్లాహ్ ఆదేశానికి మరియు ప్రవక్త ముహమ్మద్ (స) వారి సున్నత్‌కు వ్యతిరేకం.