Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

సుహృద్భావం సామరస్యానికి పునాది

Originally posted 2018-04-04 18:46:46.

ప్రజలు సహజంగా శాంతికాముకులు. వారు శాంతిని, మనశ్శాంతిని, ద్వేషరహిత, అణ్వస్త్ర రహిత శాంతినే కోరుకుంటారు. అందుకే శాంతి అనేది మనుజ జాతి మనుగడతో ముడిపడి ఉన్న అవిభాజ్యాంశం అయింది నాటి నుంటి నేటి వరకు. తగాదాలను చిలికి, చిలికి గాలి వానగా చేసుకొని పరస్పర విధ్వంసానికి దారి తీసే పశు ప్రవృత్తిని శాంత స్వభావులు ఎవ్వరూ ఇష్టపడరు. కాబట్టి సుహృద్భావాన్ని పెంపొందించి సామరస్యాన్ని సాధించుకునే దిశగా మనిషి పురోగమించాలి.
నిఖిల జగుత్తు నిర్వహణకర్త అయిన పోలిక, సాటి, సమానులు లేని ఆ సర్వేశ్వరుడైన అల్లాహ్‌ సెలవిచ్చినట్లు ”వ జఅల్నాకుమ్‌ షువూబఁవ్‌ వ ఖబాయిల లి తఆరఫూ” – ఒక ప్రాంత సంస్కృతి, ఆచార వ్యవ హారాలు, జీవన సరళి, శైలిని మరో ప్రాంత ప్రజలు చారిత్రక, సామాజిక, నైతిక నేపథ్యంలో తమ దృక్కోణం నుంచి కాక, వారి దృక్పథం ద్వారా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉంది.
   
   ఏ సమాజ పురోగమనంలోనైనా, తిరోగమనంలోనైనా యువకుల పాత్ర విస్మరించరానిది. కాబట్టి వారి పాఠ్య పుస్తకాలలో మతతత్వ ప్రచారంగాని, మత వ్యతిరేక ప్రచారంగానీ ఉండకూడదు. అన్ని మతాలకు సంబంధించిన వారి పిల్లలు ఉన్న పాఠశాలలో  కేవలం ఒక మత బోధ జరిపితే, కొందరిని ప్రోత్సహించి, కొందరిలో అసంతృప్త జ్వాలలను రగిలించిన వారమవుతాము. అలాగే, నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో అన్ని వర్గాల యువకులను తరచూ కలిపే క్రీడా కార్యక్రమాలు విస్తృతంగా జరగాలి. ఒక మతస్తులు ఒక చోట, వేరొక మతస్తులు మరొక చోట ఆడుకునే దోష సంస్కృతి పోవాలి. గత 60 ఏండ్లలో వచ్చిన వేర్పాటు ధోరణిని అధిగమించి మతంతో, జాతితో, వృత్తితో, హోదా అంతస్థులతో నిమిత్తం లేని రీతిలో అందరూ ఒకే చోట ఆటపాటల్లో పాల్గొనటం నేటి ముఖ్యావసరంగా గుర్తించాలి. అన్ని మతాలలోని శాశ్వత మానవ విలువలైన – సత్యనిష్ఠ, ధర్మ నిరతి, దైవభక్తి, దయ, కరుణ, పరోపకారం. సానుభూతి, త్యాగం, ఔదార్యం వంటి సద్గుణాలను వెలికి తీసి, వాటిని ప్రధానాంశాలుగా భావించేటట్లు భావితరాలను తీర్చి దిద్దాలి.
   చారిత్రక, వాణిజ్య, వ్యావసాయిక కారణాల వల్ల ఒక ప్రాంతంలో ఒక మతస్తులు, మరో ప్రాంతంలో వేరొక మతస్తులు సంఖ్యాధిక్యత కలిగి ఉండవచ్చు. దాంతో అల్పసంఖ్యాకులైన సోదరులకు (వారు ఏ మతస్తులైనా) తాము అల్ప సంఖ్యాకులుగానే మిగిలిపోతామేమోననే భయం కలగటం సహజం. అయితే ఈ మానసిక దౌర్బల్యాన్ని అధిగమించడం అవసరం. ఎందుకంటే అలా భయపడినవాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోలేరు. మేము వేరు, వారు వేరు కనుక మేము ఎవరితోనూ కలిసేది లేదని అధిక సంఖ్యాకులు భావించినా, అల్ప సంఖ్యాకులు తలపోసినా – రెండూ ప్రమాదకర ధోరణులే.
  ఈ నిమిత్తం పిల్లల్లో సుహృద్భావాన్ని, సహిష్ణుతను, సోదరభావాన్ని, సమానత్వ భావ-నను, స్వేచ్ఛా పిపాసను నూరిపోయడం అవసరం. అలాగే పొరపాటు వైఖరిని అవలంబించే పెద్దలను, వైషమ్యాన్ని చిలికించే శాంతి విఘాతకులను సన్మార్గానికి మళ్ళించాల్సిన గురుతర బాధ్యత అన్ని మతస్తుల వారిపై ఉంటుంది. ‘అల్‌ ఫిత్నతు అషద్దు మినల్‌ ఖత్ల్‌’ – కల్లోలం సృష్టించటం, అలజడి రేకెత్తించటం హత్యకన్నా దారుణం అన్న యదార్థాన్ని అందరూ సమానంగా గుర్తించాలి. ‘అన్యాయంగా ఒక ప్రాణిని బలిగొంటే సమస్త మానవాళిని బలిగొన్నట్లు. ఒక ప్రాణిని కాపాడితే సమస్త మానవాళిని కాపాడినట్లు’ అన్న ఆ సర్వేశ్వరుని శాసనానికి అందరూ తలొగ్గి జీవించాలి. గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఈ బృహత్తర కార్య సిద్ధికి అందరూ చిత్తశుద్ధితో పూనుకుంటారని ఆశించటం అత్యాశ కాదేమో!!

Related Post