Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

ప్రభావవంతులం అవ్వాలంటే

ప్రభావవంతులం అవ్వాలంటే ‘అలవాటు’ అనేది ఒక్కసారిగా అలవడేది కాదు. తెలిసో తెలియకో ఒక పనిని మాటి మాటికీ చేస్తూ గాడిలో పడిన సత్ప్రవర్తన, గాడి తప్పిన దుష్ప్రవర్తన – దాన్ని అలవాటుగా అభివర్ణిస్తారు. అలవాటు అనేది పూర్తిగా మానసికమయినా, పరిసరాలు, వాతావరణం, పరివారం, వ్యక్తులు, స్నేహితులు, ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక స్థితిగతులు అలవాట్లపై బలమయిన ప్రభావాన్ని చూపుతాయి. ప్రతిభావంతులను ప్రేరణగా తీసుకొని మనల్ని సయితం ప్రభావ వంతుల జాబితాలో చేర్చ గలిగే సప్త సూత్రాలను అందజేసే ఓ చిరు ప్రయత్నమే ఈ వ్యాసం. పాఠక మహోదయులకు మేలు చేస్తుందని నమ్మకం.

మనలో నాలుగు మంచి అలవాట్లు ఉన్నాయి అంటే మన భవిత బంగారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే మనలో ఓ నాలుగు చెడ్డ అల వాట్లు ఉన్నట్లయితే మన భవిష్యత్తు అంధకార బంధురం అయ్యే ప్రమాదం ఉంటుంది.

అలవాటును మనం చిరు మంటతో పోల్చ వచ్చు. చీకటిలో దారి చూపించడానికీ పని కొస్తుంది. చలి కాచుకోవడానికీ పనికొస్తుంది. అదే అదుపు తప్పితే మనిషి జీవితానికి చితి పేర్చి భస్మీపటం కూడా చేస్తుంది. కొన్ని సంద ర్భాలలో మనం ఒక అలవాటుకు బానిసలం అయి పోతాము కానీ మనకు దాని స్పృహ కూడా ఉండదు. ఉదాహరణకు – ఒకరికి టైమ్‌ మేనేజ్‌మెంట్ కన్నా టైమ్‌ పాస్‌ ఇష్టం. ఒకరికి మౌనం కన్నా వాగుడు ఇష్టం. ఒకరికి ఏ ఒక్క విషయం మీద ఫోకస్‌ ఉండదు. అతను ఏ పని మీద మనసును లగ్నం చెయ్య లేడు. విచిత్రం ఏమింటే, ఇదో చెడ్డ అలవాటుగా మారిందన్న విషయం బహుశా ఆ వ్యక్తికి కూడా తెలియకపోవచ్చు. తెలిసి తెలియక మనం ఏర్పరచుకునే కొన్ని అలవాట్లు మనల్ని రాజుగా చేసి నిలబెట్టనయినా నిల బెడతాయి లేదా ఒఠ్ఠి బానిసగానయినా మార్చి వేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, మనలో నాలుగు మంచి అలవాట్లు ఉన్నాయి అంటే మన భవిత బంగారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే మనలో ఓ నాలుగు చెడ్డ అల వాట్లు ఉన్నట్లయితే మన భవిష్యత్తు అంధకార బంధురం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాసంలో పేర్కొన బడిన సప్త సూత్రాలను మన అలవాటుగా మార్చుకో గలిగితే మనం, మన పిల్లలూ వెన్నుముక వ్యక్తిత్వం గల వ్యక్తులుగా ఎదిగే అవకాశం ఉంది. మనల్ని మనం అంచనా వేసుకోగలగడమే కాక, అన్యులను సయితం అంచనా కట్టే సామర్థ్యం మనకు అలవడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మొదటి సూత్రం: ఆరంభించు!

మనం పుడమిపై పాదం మోపింది మొదలు మళ్ళి పుడమి పాలయ్యేంత వరకూ మన జీవితంలో సంక్షోభాలు, సందిగ్ధాలు, ఆరాటాలు, పొందటాలు,
పోగొట్టుకోవడాలు అవిభాజ్యాలయి ఉంటాయి. జీవితమనే ఈ చదరంగంలో అనుక్షణం చురుగ్గా అక్టివ్‌గా ఉండాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది గ్రహించ లేని స్థితిలో ఉన్న మంద బుద్దులు కొందరు అనుదినం అవమానాల పాలవుతూ ఉంటారు. ఎన్ని సార్లు హెచ్చరించినా, ఎన్ని సార్లు శిక్షించినా దుస్థితిని దూరం చేసుకునే, తిరోగతిని పురోగతిగా మార్చుకునే ప్రయత్నం చెయ్యరు. అలాంటి వారిని గురించి ”ఆరభింపరు నీచ మానువులు” అన్నాడు భత్తృహరి.

అవును, నీచులు – విఘ్న భయంతో ప్రారంభించరు. మధ్యములు-ప్రారంబిస్తారు. విఘ్నం కలిగితే మానేస్తారు. ధీరులు-ఎన్ని విఘ్నాలు కలిగినా ఆరంభించిన కార్యాన్ని పూర్తి చేసి తీరతారు. కాబట్టి ప్రయత్నించాలి, ప్రయత్నించాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రయత్నించని వాడు ఓడి పోయే అవకాశం లేదు. కాని ప్రయత్నించిన వాడు 99 సార్లు ఓడిపోతాడు; ఒక్క సారి గెలవడానికి. ”నిన్నటి పనిని ఈ రోజే చెయ్యి, ఈ రోజు పనిని ఇప్పుడే చెయ్యి” అన్న ప్రభావ వంతుల మాటను ఆచరణలో పెట్టి ప్రభావ వంతులుగా ఎదగాల్సిన ఎందరో అసలు పనిని ప్రారంభించరు. వాయిదాల వ్యాధితో నిరతం సతమతమవుతూ ఉంటారు. ప్రాణం మీదికి వస్తేగానీ ప్రారంభించరు. ఇలాంటి వారికి జీవితంలో ఏదయినా ఛాలెంజ్‌ ఎదురయితే ఆక్టివ్‌ అవ్వాల్సింది పోయి రియాక్టివ్‌ అవుతారు.

క్రికెట్ భాషలో అర్థం చేసుకోవాలంటే, బ్యాట్ మెన్‌ – ముందస్తుగానే బ్యాట్ పట్టుకొని వచ్చే బాలు కోసం తీక్షణంగా ఎదురు చూస్తూ ఉంటే, చౌకా గానీ, ఛక్కా గానీ కొట్టే అవకాశం ఉంటుంది. బాలు వచ్చాక చూసుకుందాంలే అని నిర్లక్ష్య ధోరణితో ఉంటే, క్లీన్‌ బౌల్డ్‌ అవ్వడమో, అవుట్ అవ్వడమో ఖాయం. అలాగే సంసారమనే సమర క్షేత్రంలో కేరీర్‌ పరంగా, ఫ్యూచర్‌ పరంగా, విద్యా పరంగా ఆయా రంగాలను కావాల్సిన సరంజామాతో యుద్ధం చెయ్యడానికి మనం సదా సిద్ధంగా ఉండాలి. తుఫాను రాక ముందే నౌకను సిద్ధం చేసుకోవాలి. మనకు మన మానం, మర్యాదల పట్ల ఏ కాసింత గౌరవ మున్నా మనం ఓ సత్కార్యానికి శ్రీకారం చుట్టాలి. ఈ క్షణం నుంచే ఓ గొప్ప పనిని ప్రారంభించాలి.

రెండవ సూత్రం – ముగింపు ముఖ్యం:

ఒక పనిని అట్టహాసంగా ప్రారంభిస్తే సరి పోదు. దానికి సరయిన ముగింపు కూడా చెప్ప గలగాలి. మనం శ్రీకారం చుట్టిన కార్య చివరి పరిణామం ఎలా ఉంటుంది? అన్న అవగాహన మనకుండాలి. ‘ఫలాన్ని, ఫలితాన్ని ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్లు’ అన్న మాట అది నమ్మే కొందరికి వదలి పెట్టి మనం మాత్రం ఫలితం మీద దృష్టిని కేంద్రీకరించాలి. ఫలం, ఫలితం ఎలా ఉండబోతుంది అన్న అవగాహన ఉన్నప్పుడే మనం చురుగ్గా పనిని పూర్తి చెయ్యగలం. అలా కాక, ఫలితం విషయంలో స్పష్టత కొరవడితే, పడిన శ్రమకి అసలు ఫలితం దక్కుతుందో లేదో తెలియక పోతే అలాంటి పనిని మనం మన శ్వాసగా మార్చుకోవడం, ఒక అలవాటు గా చేసుకోవడం సాధ్యం కాదు. అలాంటి పని కోసం ధన, మాన, ప్రాణ త్యాగం కాదు కదా, దోమ త్యాగానికి కూడా మనిషి సిద్ధమవ్వడు. ఆలోచనా పరుల వద్ద ఒక విజన్‌, దార్శనికత, దూరదృష్టి, లక్ష్యంపై గురి ఉంటుంది. విజన్‌ ఉన్న వ్యక్తి ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. ఉత్తమ ఆశయాలకనుగుణంగా వారి కార్యప్రణాళిక ఉంటుంది గనక అనితర సాధ్య విజయాలు వారికి సాధ్య మవుతాయి. స్టూడెంట్స్ భాషలో చెప్పాలంటే, ఒక విద్యార్థికి తన భవిత మీద స్పష్టత లేదు గానీ, మంచి కాలేజీలో మాత్రం జాయిన్‌ అయ్యాడు. ప్రతిఫలం తెలిసిందే. అదే ఒక విద్యార్థికి తానేం అవ్వాలనుకుంటున్నాడో స్పష్టత ఉంది ఇంజనీరో, డాక్టరో. అతను దానికనుగుణంగా కష్ట పడి ఫలితాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.

విజన్‌ అనేది బయట ప్రపంచానికి చూపించ గలిగేది కాదు. ప్రతి ఒక్కరి కల వేర్వేరుగా ఉంటుంది. కొందరి కలలు ఇంకొందరికి అర్థ రహితంగా, అసంపూర్ణంగా తోచే అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విజన్‌ అనేది మనల్ని చైతన్య వంతుల్ని చేసే ఒక అతర్లీన ప్రేరణ.

మూడవ సూత్రం: ప్రధానం – అప్రధానం

ప్రభావవంతుల జీవితాల్లో దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అన్న అవగాహన ఉంటుంది. దేన్ని ముందు చెయ్యాలి? దేన్ని కాస్త తర్వాత చేసినా ఫర్వా లేదు అన్న స్పష్టత ఉంటుంది. అనేక పనులు, అనేక పరిచయాలు ఏమంత ప్రాధాన్యం గలవయి ఉండవు. తర్వాత చెయ్యాల్సిన పనులను ముందే చేసి, ముందు చెయ్యాల్సిన పనులను తర్వాత చేస్తే వచ్చే తలనొప్పి సమస్య వీరి కుండదు. కాబట్టి వీరి జీవితంలో వాయిదాల వ్యాధికి చోటు లేదు. ఉదాహరణకు ఒక విద్యార్థి తన విద్యా విషయమయి అనుక్షణం అప్రమత్తంగా ఉండకుండా, అన్య విషయాలలో ఎంతో చురుకుగా ఉన్నాడు అంటే అతను తన ప్రాధ్యాన్యతలకు విలువ ఇవ్వడం లేదన్న మాట.తత్కారణంగా తన విద్యకు సయితం ఒక దశలో స్వస్తి పలికే అవకాశం ఉంటుంది. ఏ విషయాలు మరే విలువలు లేకుండా మన జీవితాన్ని ఊహించుకోవడం కష్టమో అలాంటి వాటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

నాల్గవ సూత్రం: గైలుద్దాం! గెలిపిద్దాం!!

నేను గెలవాలి, నా తోటి వారు గెలవాలి అనుకోవడం ఆలోచనా పరులు లక్షణం. నేను మాత్రమే గెలవాలి అనుకోవడం దురాలోచనా పరుల లక్షణం. వీరి ఆలోచన ఎలా ఉంటుందంటే, వారు గెలిచినందుకు కలిగే ఆనందం కన్నా సాటి వారు ఓడి పోయారు అన్న పైశాచికానందమే ఎక్కువగా ఉంటుంది. దీనికి భిన్నంగా ప్రభావ వంతమయిన వ్యక్తి త్వం గలవారు – ‘నేను లాభ పడాలి, నా తోటి వారూ లాభ పడాలి అని ఆలోచిస్తారు. ఇలాంటి సాత్విక ఆలోచన కారణంగా ప్రజల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుంది. తమ విజయాన్ని కోరుకునే వ్యక్తి చుట్టూ ప్రజలు గుమి గూడుతారు. ఉదాహ రణకు – ఒక కాలేజీ నడిపే ప్రిన్సిపాల్‌గానీ, అధికారిగానీ స్టూడెంట్స్ నుండి అందే ఫీజు తనకు మాత్రమే చెందాలి. నయా పైసా ఎవ్వరికి ఇచ్చేది లేదు అంటే, పని చెయ్యాలనుకున్న వారు ఉచితంగానే పని చెయ్యాలి అంటే అలాంటి కళాశాల మూత పడానికి ఎక్కువ కాలం ఏమీ పట్టదు.

జీవితంలో మనం ఓ ప్రాథమిక సూత్రాన్ని ముడి వేసి పెట్టుకోవాలి. ఎందులోనయితే మనం మన మేలును కోరుకుంటామో అందులో అన్యుల మేలుని సయితం కాక్షించాలి. అలా కాంక్షించమని స్వయంగా ప్రవక్త ముహమ్మద్‌ (స) చెప్పారు: ”నీ కొసం దేన్నతే నువ్వు ఇష్ట పడాతవో దాన్నే నీ సోదరుని కోసం ఇష్ట పడు”. (బుఖారీ,ముస్లిం) మనకు జీవితంలో ఎవరి ద్వారానయినా మేలు జరిగి ఉంటే మనం వారిని గుర్తు పెట్టుకొని దానికి మించి లేదా అదే స్థాయి మేలు చేసే ప్రయ త్నం చెయ్యాలి.

అయిదవ సూత్రం: అర్థం చేసుకున్న తర్వాతే అర్థం అయ్యింది అనాలి.

ప్రపంచంలో అత్యంత కీలకాంశం ప్రజా సంబంధాలు. మనలో సాటి ప్రజలను అర్థం చేసుకునే నైపుణ్యం గనక ఉన్నట్లయితే మనం విజయం సాధించినట్లే. ప్రజల సంస్కృతిని, వారి మనస్తత్వాలను, వారి అలవాట్లను, వారి రీతి రివాజులను అర్థం చేసుకోవడం మన విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం అవగాహన వరకే పరిమితం అవ్వక వారి సమస్యలను పట్టించుకోవాలి, పరిష్కరించే ప్రయత్నం చెయ్యాలి. అంటే బాగుండాలను కునే సమాజంలో ఒకరి బాగును కోరుకునే వారం మనం అవ్వాలి. దీనికి భిన్నంగా ఒక సమాజం గురించి, ఒక దేశం గురించి, ఒక ప్రాంతపు ప్రజల రాతా రీతులు గురించి ఎంత చదివినా, ఎన్ని సర్వేలు జరిపినా, ఎన్ని కమీటీలు ఏర్పాటు చేసినా ప్రజల పట్ల మన అవగాహన అంతంత మాత్రమే ఉంటుంది. జంతు భాషలో దీన్ని అర్థం చేసుకోవాలంటే, సింహం గడ్డి తినదు. అది మాంసమే తింటుంది. చాలా మంది వ్యక్తులు సింహానికి కూడా గడ్డి వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదీ ఆహారమే కదా అన్నది వారి వాదన. దీన్ని బట్టి తేట తెల్లమయ్యేది ఏమిటంటే, ఎవరికి ఎవరిని గురించి ఎంత అవగాహన ఉంటుందో వారు అవతలి వారితో అంతే జాగ్రత్తగా మసలుకునే అవకాశం ఉంటుంది.

ఆరవ సూత్రం: శక్తివంతమయిన జట్టు.

మనిషి సంఘ జీవి. ఒంటరిగా ఏదీ సాధించ లేడు, ప్రగతి, పురోభివృద్ధి, వికాసం అనేది ఒక శక్తివంతమయిన జట్టు ద్వారానే సాధ్యమవుతుంది. ఎవరయితే జీవితంలో ఒక జట్టును ఏర్పాటు చేసుకోవడంలో సఫలమవుతారో వారిలో మహా గొప్ప ప్రతిభ, నాయకత్వ లక్షణం ఉందని అర్థం. మన ఉత్తమ ఆశయాల పరిపూర్తికై ప్రజల్ని ప్రోగు చేసుకో గలిగితే, వారి మనోభావాలను అంచనా కట్టగలిగితే, వారి అవసరాలను మనతో జోడించుకో గలిగితే మనం లీడర్‌గా ఎదగ గలం. అంటే ఒక నాయకుడిలోని శక్తి, ఎనర్జీని జట్టులోని ప్రతి ఒక్క వ్యక్తిలో నింప గలిగితే అది సైనర్జీ అనబడుతుంది. ఇది ఒక వ్యక్తిగా కాకుండా మహా శక్తిగా రూపొందుతుంది.

ఇలాంటి ఒక జట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడంలో తప్పు లేదు. కానీ, దానికి తగ్గ మనలో అటువంటి అకుంఠిత దీక్ష, అవిరళ పరిశ్రమ, అంకిత భావం ఉండాలి. వారు మనల్ని తమ పాలిట అభయ క్షేత్రంగా భావించ గలగాలి. అన్యుకలను భరించ గలిగే సహిష్ణుత, సుహృద్భావం మనలో ఉండాలి. మనం ఒక్కరమే నడవటం కాదు మనతోపాటు సాటి వారిని సయితం నడిపింఛ గలగాలి. దానికి మనం ఎదుటి వారిని పెద్ద మనసుతో మన్నించ గలగాలి. వారి కలలను మన కలలుగా భావించేంతటి మంచి సంస్కారం మనకుండాలి. వారి ప్రాధాన్యతలను మన ప్రాధాన్యతలుగా భావించి స్పదించ గలిగే గొప్ప దార్శనికత మనలో ఉండాలి. ఇది గనక మనం చెయ్య గలిగితే మనం ప్రభావ వంతుల జాబితాలో చోటు దక్కించు కోవడం సుసాధ్యం.

ఏడవ సూత్రం: మన ఆయుధాలను పదును పెట్టుకోవాలి.

మనం ప్రతి దినం, అనునిత్యం ప్రవద్ధమానం అవుతూ, ఎదుగుతూ ఉండాలి. అలా జరగడం లేదంటే, మనం ప్రభావ వంతమయిన వ్యక్తులం కాలేము. స్వీయ అభివృద్ధికి మొదటి చిట్కా: స్వీయ అభివృది అనేది స్వీయ ఆలోచన, ఆత్మ పరిశీలనతోనే మొదలవుతుంది. మనం మన అలవాట్లను సమీకించుకోవాలి. మన ప్రతిభను మెరుగు పర్చుకోవాలి, మన మనస్తత్వాన్ని బేరీజు వేసుకోవాలి.మనం ఎక్కడికి వెళుతున్నాము? మనం ఏం చేస్తున్నాము? మనం ఏం చెయ్యాలి? మనం ఇక్కడ, ఈ సమయంలో ఎందుకు వచ్చాము? మనకంటూ ఒక లక్ష్యం ఉందా? లేదా? ఒకవేళ లక్ష్య రహిత జీవితం మనం జీవించడం లేదు కదా? మన జీవితం బూడిదలో పోసిన పన్నీరయితే కావడం లేదు కదా? అన్న ఆత్మ విమర్శ మనలో బయలు దేరాలి.
రెండవ చిట్కా: పుస్తక పఠనం. మనకు అత్యవసరమయిన పుస్తకం మాత్రమే కాకుండా వేరే మంచి సాహిత్యం అనబడే ఇతర పుస్తకాలను సయితం చదువుతూ ఉండాలి. మనకవసరమయిన పుస్తకం ఎలాగో మనం చదువుతాం, చదివి తీరాల్సిందే. అదే మంచి సాహిత్యం నిత్యం మన అధ్యాయనంలో అవిభాజ్యాంశం అయితే, కొత్త కోణం, కొత్త విషయం, కొత్త స్కిల్స్‌ తెలిసే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడూ అవసరమయిన పుస్తక పఠనంతోపాటు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలను సయితం చదువుతూ ఉండాలి. వివిధ రకాల కోర్సుల్లో తరచూ పాల్గొంటూ ఉండాలి. సెమినార్స్‌, సభలు, సమావేశాలలో పాల్గొంటూ ఉండాలి. ఆయా సమావేశాలలో, సెమినార్లలోని ముఖ్యమయిన అంశాల్ని నోట్ చేసుకోవడం అలావటు చేసుకుంటే గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. అలా మనం చేసిన నాడు రోటీన్‌ లైఫ్‌ బోరు కొడుతుంది అన్న షికాయతు ఉండదు. ప్రతి రోజు మనం ఒక కొత్త ప్రపంచలో జీవిస్తాము. మనలో నేర్చుకునే ఉత్సాహం నీరుగారకుండా చూసుకోవాలి. మన కలలు తుప్పు పట్టకుండా జాగ్రత్త పడాలి. మన బంగారు భవిష్యత్తుకై మనం వేటినయితే అనునిత్యం, అనుక్షణం ఉపయోగిస్తూ ఉంటామో వాటికి తుప్పు పట్టకుండా జాగ్రత్త పడాలి.

మనం బుడి బుడి అడుగులతో పడుతూ లేస్తూనే నడక నేర్చాము. నడుస్తూ నడుస్తూనే పరుగెత్తడం అలవాటయింది. అదే మనం పుట్టినప్పటి స్థితిలోనే ఇప్పటికీ పడి ఉండి ఉంటే ఎలా ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి! కాబట్టి మనం నిత్య నూతనంగా తయారవుతూ హుషారుగా ఉండాలి. ఇప్పటి వరకు చెప్ప బడిన విషయాలు కేవలం చదవడం, వినడం ద్వారా అలవడవు. వాటి స్ఫూర్తిగా మనం మనల్ని ఎదిగేందుకు శక్తి వంచన లేకుండా కష్ట పడాలి. ఎందుకంటే, 50, 60 యేండ్ల వయసు గల ఏ భిక్షగాడిని నీ జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని ముందే ఊహించావా? అని అడిగితే లేదనే సమాధానం చెబుతాడు. కాబట్టి ఈ రోజు, ఈ క్షణం ఈ ఘడియ మాత్రమే మనది. సమయమనే ఈ అపార సంపదను గనక మనం సద్వినియోగ పర్చుకో గలిగితే విజశ్రీ మన కాళ్ళు పడుతుంది.

Related Post