Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

ప్రశాంత జీవనానికి పునీత మార్గం

ప్రశాంత జీవనానికి పునీత మార్గం – ఐశ్వర్యం ఉంది; ఆనందం లేదు. ప్రార్థన ఉంది; పవిత్రత లేదు. శుభ్రత ఉంది; సౌశీల్యం లేదు. విలాసాల మాటున విషాదాలు, కులాసాల చాటున కుయుక్తులు. ప్రపంచం వెనకాల పరుగు పందాలున్నాయి; గమ్యం లేదు. తరగని ఆస్తులున్నాయి; ఆత్మ సంతృప్తి లేదు. పెదాలపై విరుబూసిన చిరునవ్వు వెనకాల బుసలు కొట్టే మిన్నాగులు. భావి తరం ఏమౌతుందోనన్న భయం పెద్దలకు, పాత చింతకాయ పచ్చడి అన్న చిన్న చూపు పిన్నలకు. అన్నీ ఉన్నా ఎదో తెలియని నైరాశ్యం, ఎవరికీ అంతు బట్టని వింత విచిత్రం వైరాగ్యం. ధనం పెరుగుతున్నది, బంధం తరుగుతున్నది. సుఖం జడలు విపుతున్నది, సంతోషం జడుసుకుంటున్నది. అలవి కాని భయాలు ఒక వైపు, ఏ మాత్రం తగ్గని అహాలు మరో వైపు. ఇన్ని సమస్యల నడుమ ”YOU MUST BE THE CHANGE THAT YOU WANT TO SEE IN THE WORLD” అని బలంగా నమ్మేవారు, లోకం కాదు, లోకులు కాదు. నేను మారాలి, నా ప్రపంచం మారాలి అని ఆలోచించే వారికి ఈ వ్యాసం అంకితం!

”ప్రాపంచిక విషయంలో మీకన్నా  క్రింది స్థాయి వారిని చూడండి. మీకన్నా పై స్థాయి వారిని చూడకండి. ఇలా మీరు చెయ్యడం వల్ల మీకు ప్రాప్తమయి ఉన్న దైవానుగ్రహాల పట్ల మీలో చులకన భావం ఏర్పడదు”. (ముస్లిం)

మన వద్ద ఉన్నదే ప్రపంచం:

 ‘మనం ఆశల్ని వదులుకున్నా ఆశ మనల్ని వదలదు’ అన్నట్టు ఆశల ఈ ఆరాటంలోనే మనిషి రేయింబవళ్ళు ఆవిరయి పోతున్నాయి. ఒండొకరిని మించి పోవాలన్న ప్రాపంచిక వ్యామోహంలోనే మనిషి కాటికి చేరుకుంటున్నాడు. ఆకాశం.. నీరు.. నిప్పు..భూమి.. గాలి..మన శరీరంలోని ఒక్కో అవయవం … ఇవన్నీ దైవం  మనకు అనుగ్రహించిన ఉచిత వరాలు. సృష్టి చరాచరాలకి యజమాని, వారసుడు అల్లాహ్ మాత్రమే. అయినా వాటిని  మనల్ని అనుభవించమన్నాడు… వీటి మీదనే ఆధార పడుతూ… వీటితోనే సహ జీవనం చేస్తూ… ఎంతో ప్రగతిని సాధిస్తూ కూడా… వాటి మూలకర్తను…ఆయన  గోప్పతనాన్ని మరిచిపోయి… కృతఘ్నతతో పరుగులు పెడుతూనే వున్నాడు.  కాబట్టి  అనుగ్రహ దాత గుర్తించి, ఉన్నంతలో తృప్తి చెందడం మనిషికి అన్ని విధాల శ్రేయస్కరం. ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా అన్నారు: ”మీలో ఎవరయితే తన పరివారం మధ్యన, ఆరోగ్యమయిన దేహంతో, ఆ రోజుకు సరిపడ ఉపాధితో ఉదయం చేస్తాడో – అతని కోసం మొత్తం ప్రపంచం సమకూరినట్లే”. (తిర్మిజీ)
 అంటే ఎవరికయితే నీడ వంటి  ప్రశాంత వాతావరణం, శాంతి సుస్థిరతల సమాజం, సంతోషకర సంసారం, అనుగ్రహ రుచులను పెంచే ఆరోగ్యం, నడుమును నిలబెట్ట గలిగేంతటి  ఆహారం ప్రాప్తమయి ఉంటుందో అతనికి మొత్తం ప్రపంచం లభించినట్లే. అతని కోసం సౌభాగ్య జీవన తలుపులు తెరచుకున్నట్లే. ఈ జీవన సత్యాన్ని చిరు ఉపమానాల ద్వారా అర్థం చేసుకోవచ్చు.
 వందల ఎకరాలలో కోట్లు కుమ్మరించి సకల సౌకర్యాలు గల ఓ బలమయిన కోటలో నివసిస్తున్న వ్యక్తికి క్షణక్షణం ప్రాణ గండం పొంచి ఉంటే ఆకాశ హార్మ్యం లాంటి ఆ కోటలో అతను ప్రశాంతంగా జీవించ గలడా? దానికి బదులు ఒక పూరి గుడిసెలో నిశ్చింతగా జీవిస్తున్న వ్యక్తి నయం అన్పించక మానదు.
  అనేక రాజ్యాలకు సామ్రాజ్యాధిపతి మీరనుకుందాం. మీ వద్ద ధనం ఉంది, బలం ఉంది, సైన్య బలగాలున్నాయి. సేవ చెయ్యడానికి లెక్కకు మించిన నౌకరులున్నారు. వైద్యం ఉంది, వైద్యులున్నారు. కానీ మీరు కాళ్ళు, చేతులు ఆడని అచేతనావస్థలో ఒకే చోట కుప్ప కూలి ఉన్నారు. మీపై వాలే ఈగను సయితం తోలుకోలేనంత నిస్సహాయత మీది. మరి మీకున్న ఎనలేని సంపదగానీ, అధికారంగానీ మీకు ఆనందాన్ని ఇవ్వ గలదా?
పూర్వం ఒక రాజుని దైవభీతి పరుడొకడు ఇలా అడిగాట – ‘మహా రాజా! మీరు ప్రాణం పోయేంతటి  దప్పిక మీద ఉండి చల్లని పానీయం మీ ముందర ఉండి, దాన్ని మీరు త్రాగితే తప్ప బతకలేరు అన్న స్థితి ఉండి, త్రాగలేని నిశ్సహాయత ఎదురయి, మీ వద్ద ఉన్న సగం రాజ్యాన్ని చెల్లించి ఆ సమస్య నుండి బయట పడొచ్చు అని తెలిస్తే మీరేం చేస్తారు?’ ఆ రాజ్యాన్ని అమ్మి నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటాను అన్నాడు. మళ్ళీ ఆ వ్యక్తి ఇలా ప్రశ్నించాడు. ‘మీరు త్రాగిన ఆ పానీయం బయటకు  రాని పరిస్థితి ఏర్పడి అది బయటకి రావాలంటే మీ వద్దున్న మరో సగం రాజ్యాన్ని చెల్లించాలి అని తెలిస్తే మీరేం చేస్తారు?’ అది విన్న రాజు మరో మారు ఆలోచించకుండా నా సగం రాజ్యాన్ని ధారబోసి ఆ నీరు బయటికి వచ్చేలా చేసుకుంటాను అన్నాడట.అప్పుడా వ్యక్తి ఇలా అన్నాడు: ‘మహా రాజా! మీ మొత్తం రాజ్యం విలువ ఒక గ్లాసు నీరయినప్పుడు మీరు దేన్ని చూసుకొని మురిపోతు న్నారు? ఏ కారణం చేత మిడిసి పడుతు న్నారు? అలా ఆ రాజు బుద్ధి తెచ్చుకున్నాడ న్నది నీతి. ఇది కేవలం ఆరోగ్యం విలువ.
 మనం మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఊరిలో, మన వారి మధ్య హాయిగా ఉంటూ, రోజుకు సరిపడ తిండి ఉంటే దానికి మించిన భాగ్యం మరొకటి లేదు. కావాలంటే యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న కొన్ని దేశాల, అక్కడి ప్రజల దుస్థితిని ఒక్క సారి నెమరు వేసుకోండి. మనకు లభించిన మహదానుగ్రహాలు ఎంత మహోన్నతమయినవో తెలుస్తుంది.

మనం ఎవరిని చూడాలి?

 ఒకరికి మించిన సౌకర్య కలిమితో కొందరు బతుకుతుంటే, ఒకరికి మించిన సౌకర్య లేమితో చాలా మంది బతుకుతున్నారు. ఒక ముద్ద ఎక్కువ తిందాం అనుకుంటే ఒక్క భారత దేశంలో మాత్రమే నూట 25 కోట్ల ముద్దలు తినాలనుకున్న వ్యక్తుల కడుపుల్లోకి వెళ్ళి జీర్ణమయి మలీన రూపం దాలుస్తాయి.  ఒక్క ముద్ద తక్కువ తిందాం అనుకుంటే నూట 25 కోట్ల ముద్దలు-దానికి సయితం నోచుకోని లక్షలాది బీద జనాల కడుపుల్లోకి వెళ్ళి మానవత్వాన్ని బతికిస్తాయి. సమాజం లోని ఈ కలిమి – లేములు అన్ని వర్గాల్లోనూ కనబడుతాయి.
మంచోళ్లు ఉన్నారు, చెడ్డోళ్ళూ ఉన్నారు. ఆస్తికులూ ఉన్నారు, నాస్తికులూ ఉన్నారు. విశ్వాసులూ ఉన్నారు, విఘాతకులూ ఉన్నారు. మరి మనం ఎవరిని చూడాలి? మనకన్నా పై వారిని మనం చూసినట్లయితే, అసూయ, ఓర్వలేనితనంతోపాటు, అసహిష్ణుత, ఆసంతృప్తి అధికమవుతుంది. ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ప్రాపంచిక విషయంలో మీకన్నా  క్రింది స్థాయి వారిని చూడండి. మీకన్నా పై స్థాయి వారిని చూడకండి. ఇలా మీరు చెయ్యడం వల్ల మీకు ప్రాప్తమయి ఉన్న దైవానుగ్రహాల పట్ల మీలో చులకన భావం ఏర్పడదు”. (ముస్లిం)
   ధనికుల పంచన చేరి, వారి విందులకు, చిందులకు అలవాటు పడిన వ్యక్తులు కనువిప్పు కలిగాక చెప్పిన మాట – మేము ఖరీదయిన స్నేహాన్ని కోరుకునే వారం. ఖరీదయిన వారితో కలిసి తిరిగే వారం. ఖరీదయిన విందుల్లో పాల్గొనే వారం. ఇలా కొంత కాలం గడిచే సరికి మాకే మా పట్ల చిరాకు కలగడం ప్రారంభమయింది. వారి బంగళాల ముందర మా పూరి గుడిసెలు, మిద్దెలు చిన్నవిగా అన్పించేవి. వారి దుస్తుల ముందు మా దుస్తులు పనికిరావనిపించేవి. వారి వాహనాల ముందు మా వాహనాలు వెలవెల, విలవిల అన్పించేది. ఏదో తెలియని వెలితి, అసంతృప్తి, మా మీదే మాకు కసి, కోపం. కన్నవారితో గొడవ, కట్టుకున్న ఇల్లాలితో గొడవ, కన్న పిల్లలతో గొడవ. వారేదో మా అబివృద్ధికి ఆటంకాలు అన్పించేది. ఇలా ప్రవర్తించడం తప్పు అని తెలిసినా అలానే ప్రవర్తించే వారము. సమస్య మూలాలను తెలుసుకున్న మేము కనువిప్పు కలిగి వారి సావాసాన్ని మానుకున్నాము. నిరుపేదలతో స్నేహం చెయ్యడం అలవాటు చేసుకున్నాము. వారితో కష్ట సుఖాలు పంచుకోవడం అలవాటు చేసు కున్నాము. ఇప్పుడు ఆ వెలితి లేదు, ఆ అసంతృప్తి లేదు, కసి లేదు, కోపం లేదు. ఉన్నంతలో ప్రశాంతంగా బతుకుతూ బతుకు భారమయిన బడుగు బలహీన ప్రజలకు భరోసాగా నిలిచి బతుకునిచ్చే సహయాన్ని మాకు చేతనయినంత మేము చేస్తున్నాము. ఇక్కడ ధనికులందరూ చెడ్డ వాళ్ళు అని కాదు. వారి సభలు, సమావేశాలు, పార్టీలలో పాల్గొంటూ ఉంటే దాని ప్రభావం మన మీద పడుతుంది అని చెప్పడమే ముఖ్యోద్దేశం.

అదుపు, పొదుపు అవసరం:

 చాలా మందిని ఇలా అంటూ మనమ చూస్తాము. ‘అన్ఫిఖ్‌ మా ఫిల్‌ జైబి యాతీక మా ఫిల్‌ గైబీ’- నీ జేబులో ఉన్నది ఖర్చు చెయ్యి. గైబులో (అగోచరంగా) ఉన్నది నీన్ను వరిస్తుంది అని. ఇది నిజం కాదు, ఇలా గనక మనం చేశామంటే, నిస్సందేహంగా ఆకులు పట్టుకొని అల్లాడి పోవాల్సిందే. ”ఓ ఆదం పుత్రుడా! నువ్వు ఖర్చు చెయ్యి, నీపై ఖర్చు చెయ్య బడుతుంది” అని (బుఖారీ, ముస్లిం) స్వయంగా అల్లాహ్‌ సెలవిచ్చాడు కదా అని కొందరు అనొచ్చు.  అవును నిజమే, దాని ఉద్దేశ్యం పిసినారితనం వహించ కూడదు అన్నదే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే పై మాట చెప్పి అల్లాహ్‌ ఈ మాటను కూడా చెప్పాడు: ”వారు ఖర్చు పెట్టడంలో అటు మరీ దుబారా ఖర్చు చేయకుండా, ఇటు మరీ పిసినారితనం చూపకుండా  రెండింకీ మధ్య సమతూకాన్ని పాటిస్తారు”.(ఖుర్‌ఆన్‌-25:67)
ఒకవేళ అదపు, పొదుపు లేకుండా వ్యవహరిస్తే జరిగే దుష్పరిణామం గురించి కూడా హెచ్చరిస్తున్నాడు: ”నీ చేతిని నీ మెడకు కట్టి  ఉంచకు. అలాగని దానిని విచ్ఛలవిడిగానూ వదిలి పెట్టకు. అలా చేశావంటే నువ్వు నిందల పాలవుతావు. దిక్కుమాలిన స్థితికి లోనయి కూర్చుంటావు”. (ఖుర్‌ఆన్‌-17:29)
 వాహన సౌకర్యం ఉంది అన్న కారణంగా ధర్మ యుద్ధంలో పాల్గొన లేక పోయిన కఅబ్‌ బిన్‌ మాలిక్‌ (ర) అను సహాబీ తన తౌబా షరతుగా యావదాస్తి ఖర్చు చెయ్యాలనుకున్నాడు. ఇప్పటి లెక్కల్లో కోట్లల్లోనే ఉంటుంది. ఏదో విహారానికో, ఆహారానికో, ఐహిక భోగ భాగ్యాలు అనుభవించడానికో కాదు. అక్షరాలా  అల్లాహ్‌ మార్గంలో. ఎంతో ఉన్నతమయిన ఆశయం, ఉత్తమ ఆలోచన. కానీ ప్రవక్త (స) అడ్డుకున్నారు. అతని ఆధ్యాత్మిక భావోద్వేగాన్ని అదుపు చేశారు. దానకంటూ ఒక హద్దు, ఒక పద్దును ఖరారు చేశారు. ”నీకంటూ కొంత ఆస్తిని ఆపి ఉంచుకో” అని హితవు చేశారు. దానికాయన (ర) – ‘ఖైబర్‌ తోటల్లో నాకున్న షేర్‌ను నేను నా కోసం పెట్టుకుంటున్నాను’ అని సమాధానమిచ్చారు. (బుఖారీ)
 ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ అల్‌ జౌజీ (రహ్మ) ఇలా అన్నారు: ”ధర్మ అవగాహనా రాహిత్యంతో  ఎవరయినా వచ్చి హజ్రత్‌ అబూ బకర్‌ (ర) గారు తన యావదాస్తిని తీసుకొచ్చి ప్రవక్త (స) వారికి ఇచ్చేశారు కదా! అని అభ్యంతరం వెలి బుచ్చితే, దానిక సమాధానం-నిశ్చయంగా హజ్రత్‌ అబూ బకర్‌ (ర) గారు స్వత హాగా ఒక మంచి వ్యాపారి. మొత్తం దానం చేసేసినా అప్పు తీసుకొని మళ్ళి వ్యాపారాన్ని లాభాల బాట పట్టించవచ్చు’.  (సైదుల్‌ ఖాతిర్‌)
 ‘ధనమే మనిషిని నడిపే ఇంధనం’ అన్న మాట పుర్తిగా నిజం కాకపోయినా కొంత వరకు వాస్తవం మాత్రం అందులో ఉందని అంగీకరించాల్సి ఉంటుంది. ఆ మేరకు మనిషి ముందు చూపుతో వ్యవహరించడం చాలా అవసరం.

అసూయ ఉంది జాగ్రత్త!

 ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అనుగ్రహాలు ప్రాప్తించిన ఉన్న ప్రతి  వ్యక్తి పట్ల అసూయ చెందడం జరుగుతుంది”. (తబ్రానీ)
 దేవుడు మనల్ని మహా గొప్ప ప్రతిభాపాటవాలను, ఆస్తిపాస్తులను, ఆరోగ్యాన్ని, సంతా నాన్ని అనుగ్రహించి ఉండొచ్చు. మన జీతం, మన వాహనం, మన భవనం, మన పిల్లలు, ఇతరులకు ప్రాప్తమయి ఉన్న వాటికన్నా గొప్పగా ఉండొచ్చు. మనం ఏక సంతాగ్రాహులం అయి ఉండొచ్చు. ఇలా మనకు ఏ ప్రత్యేకత ఉన్నా మన యెడల అసూయ చెందే వారు ఉంటారు. కాబట్టి  బహిరంగ విషయాలలో కాకపోయినా మన అంతరంగిక వ్యవహారాలు, ఆస్తి వివరాలను రహస్యంగా ఉంచడం ఉత్త మం. ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీ మీ అవసరాలను ప్రజల నుండి దాచి ఉం చండి” అన్నారు ప్రవక్త (స). (తబ్రానీ)
”నువ్ను నీ ప్రభువు అనుగ్రహాలను గురించి ప్రస్తావిస్తూ ఉండు”. (ఖుర్‌ఆన్‌-93:11) అని అల్లాహ్‌ సెలవిచ్చాడు కదా! అని కొందరు అనొచ్చు.ఇక్కడ అల్లాహ్‌ అనుగ్రహాలు ప్రాప్తించినందుకు గొప్పలు పోండి అని చెప్పడం లేదు. వినయం కూడిన ప్రదర్శనతోపాటు ఆయనకు నిండు హృదయంతో.. కృతజ్ఞతాభినందనలు తెలుపుకోవాలన్నది, సమాజంలోని బడుగు బలహీన ప్రజల పక్షం  వహిం వారి హితాన్ని కోరుతూ వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలని, వారి అవసరాలు తీర్చాలని ఆ విధంగా అల్లాహ్‌ అనుగ్రహాల  ఘనతను చాటాలన్నది ఆయన ఉద్దేశ్యం. కాబట్టి  అనుగ్రహాలు కలిగిన మనం అన్నింటినీ అందరితో పంచుకోవడం సరి కాదు. దాంతో పాటు దిష్టి, అసూయ నుండి కాపాడే వజ్రాయుధాల వంటి  ప్రామాణిక దుఆలను సయితం చేసుకుంటూ ఉండాలి.

సానుకూల దృక్పథం:

మన ఆలోచనా సరళిలోనే ఒక శక్తి ఉంది. ఒక ప్రత్కేత కన్పిస్తుంది. ఎవరయితే ఉదయం నుంచి సాయంత్రం వరకూ సకరాత్మక ఆలోచనలతో, సానుకూల దృక్పథం తో ఉంటారో వారు అత్యంత భాగ్యవంతులు. ఒక వ్యక్తి దగ్గర అతన్ని సుఖ పెట్టే సవా లక్ష  బాహ్య సాధనాలున్నాయి. కానీ, అంతరంగికంగా అతనిలో నకారాత్మక భావాలు వేళ్ళూనుకొని ఉంటే అతను సంతోషంగా ఉండ లేడు. అతని ధనం అతనికి ఆనందానివ్వదు,. అతని సంతానం అతని ఆనందాన్నివ్వ దు. అతని హోదా అతనికి ఆనందాన్నివ్వదు. కారణం అతనిలో తిష్ట వేసుకొని ఉన్న నకారాత్మక ఆలోచనలే.
 మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరయినా వచ్చి ప్రేమగా, నవ్వుతూ పలుకరిస్తే మనకెంత ఆనందం, హాయి అన్పిస్తుంది. మనమే ముందు ఎందుకు నవ్వకూడదు?అన్న సానుకూల ఆలోచన కలిగిన వ్యక్తి మందహాసం చేస్తూ, మృదువు హృదయం కలిగి, హుషారుగా, అన్యుల్ని ఉత్తేజ పరిచే విధంగా ఉంటాడు. అతని వద్ద పెద్దగా ఏమీ లేకపోయినా సరే. అదే నెగేటివ్‌ ఆలోచనలు కలిగిన వ్యక్తి ఎంత ఆస్తి పరుడయినా, అతని ముఖం మీద చిరునవ్వు ఉండదు, అతని మనస్సు ఇరుకుప్రాయమయి ఉంటుంది. అతనిలో చురుకుదనం ఉండదు. అలాంటి  వారిని చూస్తే ఉన్న ఉత్సాహం కాస్త పోతుంది. ప్రవక్త ముహమ్మద్‌ (స) ”ఫాల్‌ (మంచి శకునం)ను ఇష్ట పడేవారు. దుశ్శకునాన్ని అయిష్ట పడేవారు”.  (ముస్నద్‌ అహ్మద్‌)
ఓ సారి ప్రవక్త (స) రోగి అయిన ఓ వృద్ధ వ్యక్తిని పరామర్శించడానికి వేళ్ళారు. ”లా బఅస తహూరున్‌ ఇన్‌ షా అల్లాహ్‌’ – చింతించకు, అల్లాహ్‌ అభిలష్తే అంతా మేలే జరుగుతుంది” అన్నారు. అది విన్న ఆ రోగి ”మేలు జరుగుతుంది అంటున్నారు మీరు”. మేలు లేదు పాడు లేదు. ఇది బుసలు కొట్టే జ్వరం, శరీరాన్ని కాల్చి వేస్తున్నది, వృద్ధుడనయిన నన్ను స్మశానం బలంవంతాన లాక్కెళుతున్నది.  అన్నాడు. అది విన్న ప్రవక్త (స) ”నువ్వెలా అనుకుంటే అలానే” అన్నారు. (బుఖారీ) వేరొక ఉల్లేఖనంలో – ”నువ్వు నా మాటను అంగీకరించడం లేదంటే నువ్వన్నట్టే జరుగుతుంది. అల్లాహ్‌ రాసి ప్టిెంది జరిగి తీరుతుంది”. ఉల్లేఖకులు అంటున్నారు: ”మరుసటి  రోజు  సాయంత్రానికి ముందే ఆ వ్యక్తి మరణించాడు (మజ్‌మవుజ్జవాయిద్‌)
 మనం ఎంత బాధలో ఉన్నా మన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరితో చెప్పు కోకూడదు. అది మనకు బాగానే ఉన్నా ఎదుటి  వారికి చికాకు కలిగించవచ్చు, చిరాకు  తెప్పించ వచ్చు. అలాగే మనం సమస్యల్లో ఉండి ఎవరయినా వచ్చి ఓ నాలుగు మంచి మాటలు చెబితే దాన్ని సానుకూలంగా తీసుకోవాలే తప్ప, ప్రతికూలంగా ప్రతిస్పందించ కూడదు.  ఖైబర్‌ యుద్ధ సందర్భం గా ఒక వ్యక్తి  ”ఇవిగో కూరగాయలు తీసుకోండి!” అని  చెప్పిన మాట ప్రవక్త (స) వారికి నచ్చింది. ఆయన ఇలా అన్నారు: ”మేము  సంసిద్ధంగా ఉన్నాము. నీ నోటి మాట నుండి మంచి శకునాన్ని తీసుకున్నాము. మమ్మల్ని ఆ తోటలు గల ప్రాంతం వైపునకు తీసుకెళ్ళండి” అన్నారు. తర్వాత పెద్ద యుద్ధమేమి జరగకుండానే విజయం ప్రాప్తించింది.     (ముఅజముల్‌ ఔసత్‌)

పరలోక చింత:

ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ఎవరి చింతయితే పరలోకమయి ఉంటుందో, 1) అల్లాహ్‌ వారి హృదయంలో నిరపేక్షతను, సంపన్నతను పొందు పరుస్తాడు. 2) అతని పనులను సులభతరం చేస్తాడు. 3) ప్రపంచం అతని పాదాక్రాంతం అవుతుంది. మరెవరి చింతనయితే ప్రపంచం అయి ఉంటుందో, 1) అల్లాహ్‌ దారిద్య్రం అతని కళ్ళ మధ్యన ఉండేలా చేసాడు. 2) అతని పనులు చెల్లాచెదురయి పోతాయి. 3) అతని విధిరాతలో వ్రాసింది తప్ప  (అతను ఎంత ప్రాకులాడినా) అతనికి దక్కదు”. (తిర్మిజీ)
 అంటే ప్రాపంచిక జీవతం గురించి అస్సలు ఆలోచించకూడదు అని ఎంత మాత్రం కాదు. ”అల్లాహ్‌ నీకు ప్రసాదించిన దానితో పరలోకాన్ని కూడా అన్వేషించు. మరి నీ ప్రాపంచిక భాగాన్ని కూడా మరువబోకు. అల్లాహ్‌ నీకు ఏ విధంగా మేలు చేశాడో అదే విధంగా నువ్వు కూడా (ప్రజల పట్ల) సద్వ్యవహారం చెయ్యి”. (అల్‌ ఖసస్‌: 77) మన చింత ఇహంకన్నా అధికంగా పరం గురించి ఉండాలి.

Related Post