కార్య నిపుణత మరియు ఇస్లాం

Originally posted 2017-12-13 16:45:26.

”ఇది అల్లాహ్‌ పనితనం. ఆయన ప్రతి వస్తువును చాలా గట్టిగా చేశాడు. మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు”. (అన్నమ్ల్‌: 98)

పని పట్ల విషయ పరిజ్ఞానం కలిగి ఉండి, చేయాలన్న తపన, చేయగలమన్న నమ్మకం, చేసే ధైర్యం, పూర్తయ్యే వరకూ అవిరళ కృషి, అంకిత భావంతో ఓ పనిని అత్యుత్తమ రీతిలో పూర్తి చెయ్యడాన్ని ఇత్‌ఖాన్‌ అంటారు.

ఒక పనిని, ఒక వస్తువును, ఒక రచనను ఎంతో పగడ్బందీగా, ప్రణాళిక బద్ధంగా, దృఢంగా, బలంగా, చెయ్యడం, నిర్మించడం, వ్రాయడాన్ని అరబీలో ఇత్‌ఖాన్‌ అనంటారు. ఆ పని, ఆ వస్తువు, ఆ రచనలో సదరు వ్యక్తి నైపుణ్యం, పనితనం తెలియడంతోపాటు, తనదయిన బలమయిన ముద్ర ఉంటుంది. కాబట్టి అద్వితీయ శక్తి స్వరూపుడయిన అల్లాహ్‌, తన దాసులు చేసే పని సయితం పూర్ణత్వం గలదయి ఉండాలని అభిలషిస్తాడు.

ఇత్‌కాన్‌ అర్థాలు:

సమయం, సందర్భాన్ని బట్టి ఇత్‌ఖాన్‌ అర్థం మారుతుంది. ఉదాహరణకు – నాణ్యత, అవగాహన, ఏకాగ్రత, నియమబద్ధత, పూర్ణత్వం, ప్రతిభ, అంకిత భావం, దృఢత్వం మొదలయినవి. ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, పని పట్ల విషయ పరిజ్ఞానం కలిగి ఉండి, చేయాలన్న తపన, చేయగలమన్న నమ్మకం, చేసే ధైర్యం, పూర్తయ్యే వరకూ అవిరళ కృషి, అంకిత భావంతో ఓ పనిని అత్యుత్తమ రీతిలో పూర్తి చెయ్యడాన్ని ఇత్‌ఖాన్‌ అంటారు.

అల్లాహ్‌ సృష్టి లోపం లేనిది:

తండ్రికొడుకులు ఖర్జూరపు తోటలో పని చేస్తుండగా, సందేహం కలిగి కొడుకు తండ్రిని ఇలా ప్రశ్నించాడు:
కొడుకు: నాన్నా! గుమ్మడి కాయ తీగను చూడంండి, ఎంత బలహీనంగా ఉండి కూడా బలమయిన, దృఢమయిన కాయ దానికి కాస్తున్నది. కానీ ఖర్జూరపు చెట్టు అంత ఎత్తుగా ఉండి, అంత దృఢంగా, బలంగా ఉండి కూడా దానికి పిసరంతి కాయ కాస్తున్నది. నిజంగా చెప్పాలంటే, గుమ్మడి కాయ దృఢమయిన చెట్టుకి కాసి, ఖర్జూరం బలహీనమయిన ఈ తీగకు కదా కాయాలి?

తండ్రి: బాబూ! ఇది అల్లాహ్‌ సృష్టి. ఆయన ప్రతి పని ప్రణాళిక బద్దంగానే ఉంటుంది. బహుశా కొన్నింటిలోని ఔచిత్యం మనకు బోధ పడకపోవచ్చు. ఇలా అల్లాహ్‌ చేశాడు అంటే అందులో ఏదొక యుక్తి ఖచ్చితంగా దాగుంటుందని మాత్రం నేను చెప్పగలను.
ఇద్దరు పని ముగించి, భోజనానంతరం విశ్రాంతి కోసం ఓ ఖర్జూరపు చెట్టు నీడన ఉపక్రమించి మేను వాల్చి పడుకొని ఉండగా, వీస్తున్న గాలి తాకిడికి సగం మాగిన ఓ రెండు మూడు ఖర్జూరాలు కొడుకు తల మీద పడ్డాయి. ‘అబ్బా….’అని మూలిగాడు. అది గమనిస్తున్న తండ్రి – బాబూ! అబ్బా కాదు, అల్‌హమ్దు లిల్లాహ్‌ అను. అది ఖర్జూరం గనక సరి పోయింది. గుమ్మడి కాయ అయ్యుంటే…… అంటూనే పెదవి దాటకుండా నవ్వును ఆపుకున్నాడు. కొడుకికి తండ్రి ఉద్ధేశ్యం అర్థమయి జ్ఞానోదయం అయ్యింది.
”(ఓ చూచేవాడా! నీవు కరుణామయుని సృష్టి ప్రక్రియలో ఎలాంటి అస్తవ్యస్తత కాన లేవు. కావాలంటే మరోసారి (దృష్టిని సారించి) చూడు. నీకేమైనా లోపం కనిపిస్తోందా? మళ్ళీ, మళ్ళీ దృష్టిని సారించు. నీ దృష్టి అలసి సొలసి, వీఫలమై నీ వైపు తిరిగి వస్తుంది”. (అల్‌ ముల్క్‌: 3,4)

మనిషి గుండె:

”ఏమిటి , వారు భూమిలో సంచరించ లేదా? (ఒకవేళ తిరిగి చూచినట్లయితే) వారి హృదయాలు ఆ విషయాలను గ్రహించ గలిగేవి. లేదా వారి చెవులు విని ఉండేవి”. (అల్‌ హజ్జ్‌: 46) అని అల్లాహ్‌ చెప్పిన మన దేహావయవాల్లో కేంద్ర బిందువుగా ఉన్న గుండెకాయ గురించి తెలుసకుందాం!
”మనిషి మాతృ గర్భంలో అల్లాహ్‌ దూత వచ్చి ఆత్మ ఊదుతాడు” (బుఖారీ, ముస్లిం) అని ప్రవక్త (స) వారు చెప్పిన మాట ప్రకారం – 12 వారాల తర్వాత గుండెకాయ తన పని ప్రారంభిస్తుంది. అలా మొదలయిన దాని ప్రస్థానం 10, 20, 30, 40, 50, 60, 80, 100, 200 సంవత్స రాల వరకూ, అదే ప్రవక్త నూహ్‌ (అ) వారి కాలాన్ని తీసుకుంటే వేల సంవ త్సరాల వరకూ నిరంతరాయంగా, నిర్విఘ్నంగా, అవిశ్రాంతంగా నిమిషానికి 72 సార్లు, కొన్ని సందర్భాలలో 100 నుండి 180 సార్లు కొట్టుకుంటూనే ఉంటుంది. మనిషిలో జీవం నిపండానికి అది అల్లాహ్‌ తనకు నిర్దేశించిన పనిని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఒక్క క్షణం కోసం కూడా విశ్రాంతి తీసుకోదు. తీసుకుంటే మనం శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. అంతలా అంకిత భావంతో మనల్ని సేవించుకునే గుండెకాయను ఇచ్చిన అల్లాహ్‌ను మనం ఎంతలా అంకిత భావంతో సేవించుకోవాలో ఒక్క నిమిషం ఆలోచించండి! ఇది గుండెకు సంబంధించిన ఒక్క ప్రక్రియ మాత్రమే. వివారాల్లోకెళితే మహాద్భుతాలు ఎక్కడో కాదు, మన గుండెలోనే గూడు కట్టుకొని ఉన్నాయి.

సృష్టిలోని కొన్ని నిదర్శనాలు:

”ఇదీ అల్లాహ్‌ సృష్టి! ఇప్పుడు ఆయన తప్ప వేరితరులు ఏం సృష్టించారో మీరు నాకు చూపించండి”. (లుఖ్మాన్‌: 11)ఈ ఆయతులో చెప్పిన సృష్టి మీద కాస్త దృష్టి సారిద్దాం! ”ఏమి, మేము భూమిని పాన్పుగా (నివాస స్థలంగా) చేయ లేదా?”. (అన్నబా: 6) భూమిలో కొన్ని ప్రదేశాలు రాతి నేల ప్రదేశాలుగా ప్రసిద్ధి. ఒక్క నిమిషం కోసం ఆలోచించండి! మొత్తం నేల రాతి నేలగా చేసి ఉంటే మానవ మనుగడ సాధ్యమయ్యేదా?

”ఇంకా మేము మిమ్మల్ని జంటలుగా సృష్టించాము”. (అన్నబా: 8) ఒకవేళ మనల్ని, ఇతర సృష్టితాలను అల్లాహ్‌ జంటలుగా పుట్టించకుండా, కేవలం పురుషులుగా, స్త్రీలుగా చేసి ఉంటే? జంటలుగా పుట్టించినా స్త్రీల పట్ల పురుషలలో, పురుషుల పట్ల స్త్రీలలో ఆకర్షణ పెట్టి ఉండక పోతే సృష్టి ఎంత అర్థరహితంగా ఉండేదో ఆలోచించండి!

”మరియు మేము మీ నిద్రను హాయినిచ్చేదిగా చేశాము”. (అన్నబా: 9)
మనిషి ఎంత అలసి పోయినా కొన్ని గంటలు ప్రశాంతంగా నిద్ర పోతే ఎంత హాయిగా ఉంటుందో, మరెంత ఉత్సాహంతో మళ్ళి పని చెస్తాడో మనందరికీ అనుభవమే. ఒక్క నిద్రను మినహాయించి ప్రపంచలోని ఏ వస్తువును ఉప యోగించి అయినా మనం ఇలాంటి హాయిని పొంద లేము. అంటే అల్లాహ్‌ తన సృష్టిని ఎంత క్రమ బద్ధంగా, ఎంత పగడ్బందీగా, పటిష్టంగా చేశాడో అర్థమవుతుంది.

ఇస్లాం ధర్మం పరిపూర్ణమయినది:

”నేను ఈ రోజు మీ ధర్మాన్ని మీ కోసం పూర్తిగావించాను”. (మాయిదహ్‌:3) అన్న అల్లాహ్‌ మాట రీత్యా ఇస్లాంలోని ప్రతి ఆదేశం పూర్ణమయినదయి, పటి ష్టమయినదయి, అత్యుత్తమమయినదయి ఉంటుంది. అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: ”ఉత్తమంగా మసలుకోండి. ఉత్తమ ప్రవర్తన గలవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు”. (అల్‌ బఖరహ్‌: 195)
”నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతి వస్తువు మీద ఉత్తమ విధానాన్ని విధిగా చేశాడు. కాబట్టి, మీరు (ప్రతీకార శిక్షగా) ఎవరినయినా చంపాలంటే ఉత్తమ పద్దతిలో చంపండి. మరియు మీరు జిబహ్‌ చేసేటప్పుడు ఉత్తమ పద్ధతిలో జిబహ్‌ చెయ్యండి. మీలో జిబహ్‌ చెయ్యాలనుకున్న వ్యక్తి తన కత్తిని బాగా పదును పెట్టుకోవాలి. జిబహ్‌ అయ్యే జంతువుకు త్వరగా ప్రశాంతతను చేకూర్చాలి” అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స). (ముస్లిం)
పూర్వం – ఒకరి హత్యకు ప్రతీకారంగా ఒకరిని చంపాలనుకున్నప్పుడు చాలా జుగుప్సాకరంగా, చిహ్రింసలు పెట్టి చంపేవారు. చంపి కసి తీరకపోతే ముక్కులు, చెవులు కోసి దండలా ధరించేవారు. భారత దేశంలోనయితే బతికుండగానే చెవులు, ముక్కు కోసిన ఉదంతాలు మనకు పురాణ పురుషుల్లోే కనబడతాయి. ఇస్లాం ధర్మం ఇలాంటి విపరీత ధోరణులను సమూలంగా నిర్మూలించింది. మరణించిన తర్వాత కూడా మానవ శరీరాన్ని గౌరవించాలని నొక్కి వక్కాణించింది. దానికి గొప్ప ఉదాహరణ క్రింది సంఘటన.
ఆసిమ్‌ బిన్‌ కులైబ్‌ తన తండ్రి నుండి ఉల్లేఖిస్తూ ఆయన చెప్పిన మాటను తెలియజేశారు: ”మా నాన్నతో కలిసి ప్రవక్త (స) వారు పాల్గొన్న ఒక జనాజాలో నేనూ పాల్గొన్నాను. అప్పటికి నేను బుద్ధిమంతుణ్ని, మంచీచెడుల విచక్షణ నాకుండేది. ప్రజలు జనాజాను సమాధి వద్దకు తీసుకొచ్చి, సమాధి లోపలికి దించారు. కానీ, సరిగ్గా తవ్వకపోవడం కారణం మృతుని శరీరం అందులో ఇమడ లేదు. (ఎలాగోలా సర్దేయాలని ప్రయత్నిస్తున్న వారిని చూసి) ప్రవక్త ఇలా అన్నారు: ”ముందు అతని లహద్‌ను (సమాధిని) సరి చేయండి”. ఇలా ఆయన ఎన్ని సార్లు చెప్పారంటే, అక్కడున్న వారు ఇది తప్పనిసరి సున్నత్‌ ఏమో అనుకో సాగారు. వారి ఆలోచన ప్రవాహాన్ని గమనించిన ఆయన మళ్ళీ ఇలా అన్నారు: ”విషయం ఏమిటంటే, ఇలా చెయ్యడం వల్ల ఈ మృతునికి లాభం గానీ, నష్టంగానీ కలుగదు. కానీ, వ్యక్తి ఒక పని చేసినప్పుడు దాన్ని ఉత్తమ పద్ధతిలో పూర్తి చెయ్యడాన్ని అల్లాహ్‌ ఇష్ట పడతాడు”. (బైహఖీ)

ఆరాధనలో ఇత్‌ఖాన్‌:

వుజూ: ”ఎవరయినా వుజూ చేసి ఉత్తమ పద్ధతిలో దాన్ని పూర్తి చేస్తే అతని పాపాలు తొలగి పోతాయి. చివరికి అతని గోళ్ళ క్రింది నుండి కూడా”.
(ముస్లిం) వుజూలో తర్‌తీబ్‌, మువాలాత్‌, కనిష్టంగా ఒక్క సారి, గరిష్టంగా మూడు సార్లు తదితర విషయాలు వుజూలో ఇత్‌ఖాన్‌కి సంబంధించినవే.

నమాజు: ”వారు తమ నమాజులలో అణకువ, శ్రద్ధ, ఏకాగ్రత కలిగి ఉంటారు”. (మోమినూన్‌: 2)
జీవితంలో గొప్ప విజయం సాధించిన ఒక వ్యక్తిని ‘మీ విజయ రహస్యం ఏమిటి?’ అని ప్రశ్నించగా – ”నేను తల దువ్వుకునేటప్పుడు జుట్టు గురించి మాత్రమే ఆలోచిస్తాను” అని సమాధానమిచ్చాడట. అంటే, ఏకాగ్రత. ఇక నమాజులో ఖుషూ అంటే, అన్నీ రూల్స్‌ను అప్లై చేస్తూ ఉత్తమ పద్ధదతిలో నమాజును పూర్తి చెయ్యడం. ఒక సంఘటన ద్వారా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ”ఒక వ్యక్తి నమాజు పూర్తి చేసుకొని ప్రవక్త (స) వారి సన్నిధికి వచ్చాడు. అతని నమాజును సాంతం గమనిమచిన ఆయన ”వెళ్ళు నమాజు చుదువు, నువ్వు చేసిన నమాజు నెరవేర లేదు” అన్నారు. ఆ వ్యక్తి వెళ్ళి నమాజు చేసి వచ్చాడు. మళ్ళి ప్రవక్త (స) – ”వెళ్ళూ, నమాజు చెయ్య, నువ్వు నమాజు చెయ్య లేదు”. అన్నారు. ఆ వ్యక్తి వెళ్లి నమాజు చేసి మళ్ళీ వచ్చాడు. ప్రవక్త (స) – ”వెళ్ళవయ్యా, సరిగ్గా నమాజు చేసిరా, నీ నమాజే అవ్వ లేదు” అన్నారు. అప్పుడా వ్యక్తి ఎంతో వినయంగా – ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! నాకు తెలిసిన నమాజు ఇదే. తప్పేమన్నా ఉంటే సరి చేయండి’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స) …రుకూ చెయ్యి. రుకూలో నీ అవయవాలన్నీ వాటి చోటుకి చేరుకునేంత నింపాదిగా రుకూ చెయ్యి…… ఇదే మర్యాదను నీ మొత్తం నమాజులో పాటించు” అన్నారు.                                                                                                    (బుఖారీ, ముస్లిం)

హజ్రత్‌ హుజైఫా (ర) ఓ సారి మస్జిద్‌లో ప్రవేశించారు. ఒక వ్యక్తిని తొందర తొందరగా నమాజు చేస్తూ చూసి – ”ఇలా ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నావు?’ అని ప్రశ్నించారు. 40 యేండ్లుగా అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. అది విన్న ఆయన – ”నువ్వు నమాజే చెయ్య లేదు. ఒకవేళ ఇదే స్థితిలో నువ్వు మరణిస్తే ప్రవక్త (స) వారికి అల్లాహ్‌ అనుగ్రహించిన ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా మరణిస్తావు” అని హితవు పలికారు. (షఅబుల్‌ ఈమాన్‌) ఈ కారణంగా సజ్జనులయిన మన పూర్వీకులు – ఖియామ్‌ను కాస్త తగ్గించుకునే వారు కానీ, రుకూ, సజ్దాలను నింపాదిగా పూర్తి చేసేవారు.
నేడు మనలో ఎంత మంది 20, 40, 50, 60 సంవత్సరాలుగా నమాజు చదువుతున్నారు అల్హందు లిల్లాహ్‌. కానీ నమాజులో ఏది రుక్న్‌, ఏది వాజిబ్‌, ఏది సున్నత్‌, ఏది తప్పితే ఏమవుతుంది? పాపం వారికి తెలీదు! రోజుకి అయిదు సార్లు ఎంతో శ్రద్ధాభక్తులతోటి పాటించ బడే నమాజును ఇంత పేలవంగా, నాసి రకంగా చేస్తే అల్లాహ్‌ సంతోషిస్తాడా? చెప్పండి. రేపు ప్రళయ దినాన అడగబడే తొలి ప్రశ్న నమాజు గురించే అన్నది మనందరికి తెలిసిందే. ప్రశ్న ‘నమాజు చేశావా? లేదా?’ అని మాత్రమే ఉండదు, నమాజును ఎంత శ్రద్ధగా, ఎంత ఉత్తమంగా చేశావు అని కూడా ఉంటుంది. కాబట్టి అనుదినం అయిదు సార్లు చేసే నమాజును మనం ఫర్ఫెక్ట్‌గా చేసుకునేందుకు ప్రయత్నించాలి.

జకాతులో ఇత్‌ఖాన్‌:

”ఓ విశ్వసించిన వారలారా! ధర్మసమ్మతమయిన మీ సంపాదనలో నుంచి, మేము మీ కోసం నేల నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులలో నుంచి ఖర్చు చేయండి. వాటిలో చెడు (నాసి రకపు) వస్తువులను ఖర్చు పెట్టే సంకల్పం చేసుకోకండి-స్వయంగా మీరే వాటిని తీసుకోరు”. (అల్‌ బఖరహ్‌: 267)

ఉపవాసంలో ఇత్‌ఖాన్‌: హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ (ర) ఇలా హితవు పలికారు: ”నవ్వు ఉపవాసం ఉంటే, నీతోపాటు నీ చెవులు కూడా ఉపవాసం ఉండాలి. నీ కళ్ళు కూడా ఉపవాసం ఉండాలి. నీ నోరు కూడా అబద్ధం నుండి, హరామ్‌ నుండి ఉపవాసం ఉండాలి. నీ నౌకరులను బాధ పెట్టడం మానెయ్యి. నీలో హుందాతనం ఉట్టి పడాలి, ప్రశాంతత నీలో తొణికిసలాడాలి. నీ ఉపవాసం ఉన్న రోజు, నీ విరమణ దినం ఒకేలా ఉండకూడదు – (నీ ప్రవర్తనలో స్పష్టమయిన మార్పు కన బడాలి).

హజ్జ్‌లో ఇత్‌ఖాన్‌: ”హజ్జ్‌ మరియు ఉమ్రాలను అల్లాహ్‌ కోసం పూర్తి చెయ్యండి”. (అల్‌ బఖరహ్‌: 196)
ఖుర్‌ఆన్‌ పారాయణంలో ఇత్‌ఖాన్‌: సహాబా ఖుర్‌ఆన్‌లో పది ఆయతులు చదివి, వాటిని కంఠస్థం చేసుకొని, అర్థం ఆకళింపు చేసుకొని, ఆచరణలో పెట్టంనంత వరకూ మిగతా ఆయతుల జోలికి వెళ్ళేవారు కాదు.

చివరి మాట:

సూరహ్‌ కహఫ్‌లో పేర్కొన బడిన జుల్‌ఖర్‌నైన్‌ కట్టిన గోడ కంటే పటిష్టమయిన గోడ ప్రళయం వరకూ ఎవ్వరూ కట్ట లేరు – ఇది నిర్మాణంలో నిండుతనం. సూరహ్‌ బఖరహ్‌లో అప్పటి ప్రవక్తను వదలి, ఒక సాధారణ సిపాయి అయిన తాలూత్‌ను అల్లాహ్‌ రాజుగా చెయ్యడం – ఎంపికలో నిండుతనాన్ని సూచిస్తుంది. అలాగే అబూ ఉబేద్‌ (రహ్మ) ఒక రచన కోసం 40 సంవత్సరాలు నిరంతర పరిశ్రమకి పూనుకోవడం ఆ రచన నిండుతనాన్ని సూచి స్తుంది. అలా 40 సంవత్సరాలలో, కొందరయితే జీవత కాలాలన్ని ధారబోసి పూర్తి చేసిన గ్రంథాలను చదివి అర్థం చేసుకోవడానికి నేడు మనం 40 రోజుల్ని సయితం కేయించ లేక పోతున్నాము గనకే మన జీవితపు అన్ని అంగాల్లోను, అన్ని రంగాల్లో నాణ్యత, పూర్ణత లోపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు అప్పగించ బడిన ఏ పని అయినా, దాన్ని ఉత్త్తమ పద్ధతిలో పూర్తి చెయ్యాలి. ఇలా చెప్పుకుంటూ పోతే, విద్యాబోధ, ఖుర్‌ఆన్‌ పారాయణం, ప్రాపంచిక సకల వ్యవహారాలు, సైన్య వ్యవహారాలు, రచనా సంబంధిత వ్యవహారాలు, వార్తా సంబంధిత విషయాలు ఎన్నో దీని పరిధిలోకి వస్తాయి.

Related Post