తెల్ల
దొరల పాలనకు అర్థం పీడనగా మార్చి, జాతి సౌభాగ్యాన్ని కొల్లగొడుతున్న ఎర్ర తేళ్ళపై – బతుకు కోసం, భవిత కోసం ఏకోన్ముఖ పోరుకు ఉరకలెత్తిన కోట్లాది భారతీయుల త్యాగాల ఫలితమే నేటి మన స్వతంత్ర భారతం. ‘ప్రాగ్దిశాకాశంలో వినూత్న తార’ ఉదయించి అరవై మూడేళ్ళు పూర్తయ్యాయి.
”దారిద్య్రాన్ని, దాని కవలలైన ఆకలి అనారోగ్యాల్ని నిర్మూలించి, సామాజిక అంతరాలు పూడ్చి, దోపిడీలను అరికట్టి గౌరవ ప్రదమైన జీవన పరిస్థితుల పరికల్పనకు పరిశ్రమిస్తాము” అన్న వాగ్దానం ఏ మేరకు వాస్తవ రూపం దాల్చిందన్న విషయం పరిశీలిస్తే ఆనందంతో పాటు ఆందోళన కూడా కలుగుతుంది.
దేశమంటే అధికారమనీ, భాగ్యవంతులనీ, మెజారిటీలనీ భావించేవాళ్ళు గాంధీలనీ, ఆజాదులనీ, భగత్ సింగుల్నీ, రవీంద్రుల్నీ, నెహ్రూల్నీ, అంబేడ్కర్లనీ గత చరిత్ర పుటల్లో దాచేసి కడుపే కైలాసమని తలపోస్తూ, తమ జాతి గుండెల్లోనే గునపాలు దింపుతూ, నిజాయితికి బేరం పెట్టి పచ్చ కాగితాలకు నిస్సంకోచంగా అమ్ముకునే నాయకులే నేడు మన భారతాన్ని ఏలుతున్నారు. ప్రజా స్వామ్యం ముసుగులో ప్రజల్ని కొల్లగొడుతూ మానవతా వాదులం అన్న మాస్క్‌లు తొడిగి మారణ హోమాలు సృష్టిస్తున్నారు. గూండాగిరీ, దౌర్జన్యాల పట్టా, అత్యాచారాల, అన్యాయాల చిట్టా, హత్యల దమనకాండల డిగ్రీ- ఇవే నేడు మన నాయకుల క్వాలిఫికేషన్లుగా చెలామణి అవుతున్నాయి.
ఇక దేశ ప్రజల పరిస్థితి అంటారా-, ”పేదల పూరి గుడిసెల మధ్య నుండే మన ఉపగ్రహాలు నింగికి ఎగుస్తున్నాయి” అన్న తొలి దళిత రాష్ట్రపతి నారాయణ్ మాటకు అద్దం పడుతోంది నేటి స్థితి. బ్యాగులు భుజానికెత్తుకుని బడికెళ్ళి చదువుకు(కొ)నే బాలల్ని చూస్తుంటే – ముచ్చటేస్తుంది. కానీ బ్రతుకే భారమై బడికెళ్ళలేక బొగ్గు గనుల్లో, టీ అంగళ్ళలో, ఫ్యాక్టరీలలో, ఫుట్‌పాత్‌ల మీద పుళ్ళు పడ్డ చేతుల్తో, కన్నీళ్ళింకిన కళ్ళతో, భయాద్విగ్నంగా, అర్థ నగ్నంగా మొగ్గలోనే వాడిపోతున్న అభాగ్య జీవులు సైతం చదువుకునే రోజులు రావాలని దేశాభిమానులందరూ ఎదురు చూస్తున్నారు.
ఈ అభాగ్యుల బాల్యం అమ్మ కమ్మనైన ఒడిలో పెరగాల్సింది పోయి వీధి పాలయ్యింది. ఎదగని మనస్తత్వాల వింత శాడిజానికి బలి పశువై పోయింది. రాత్రంతా బార్లల్లో తిట్లూ, పిడిగుద్దులు తింటూ, బరువైన గుండెలు చెరువవుతున్నా భరిస్తూ, ఫుట్‌పాత్‌ల మీద కునుకు తీస్తున్న నిశి రాత్రిలో అకస్మాత్తుగా ఖాకీ లాఠీల తాండవానికి కకావికలై వీపులపై పడ్డ వాతల్ని బిగబెట్టిన పెదవులతో సహిస్తూ ఎటు వెళ్ళాలో పాలుపోక, ఏం చేయాలో తోచక అగమ్యగోచరమవుతున్న వారి జీవితాలకు అభయ హస్తం అందించి ఆదుకునే రోజులు ఎప్పుడు వస్తాయా? అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఆ బాల కార్మికులు.
అభాగ్యులైన ఈ భావి భారత పౌరులకు – ఖరీదైన చాక్లెట్లు ఎలా ఉంటాయో తెలీదుగానీ, ఆ చాకెట్ల తాలూకు పేపర్లు ఎక్కడ దొరుకుతాయో మాత్రం తెలుసు. చెత్త కుప్పల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ చిత్తయిపోయిన చిన్నారులు పాలు కారే పాల బుగ్గలు కావు వారివి. పాలు కారే ఖాళీ ప్యాకెట్లు ఎక్కడ ఉంటాయో మాత్రం తెలుసు. బిర్యానీలు, రుచికరమైన తినుబండారాలు ఎలా ఉంటాయో తెలీదు పాపం వారికి. కానీ, తిని పడేసిన ఎంగిలి ఆకులు ఎక్కడుంటాయో బాగా తెలుసు. సుసంపన్నులు భావి భారత విధాతలంటే – మరి వీరు రేపటి భవితలు కారా? మనం చూడబోయే రేపటి కలకు ముందు హెచ్చరికలు కారా? ‘దేశమంటే మనుషులోయ్’ అన్నారే గురజాడ వారు, మరి వీరి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన బాధ్యత మన మీద లేదా?
‘మన స్వాంత్య్రం మేడిపండు – మన దారిద్య్రం రాచ పుండు’ అన్న ఆరుద్ర మాట నేటి మన యవతరంలో నిజమవుతున్నది. యవ్వనం అనే వనంలో, కామం అనే కారడవుల్లో కొట్టుమిట్టాడుతు, చిత్తుగా త్రాగి మత్తుగా పడుకొంటున్నది. లేకపొతే లేదన్న బాధతో త్రాగుతూ ఉంది. ఉంటే – ఉందన్న ఉత్సాహంతో మరింత త్రాగి మానవత్వాన్ని మరచి మృగాల్లా వ్యవహరిస్తున్నది. వీళ్ళ ఈ వికృత చేష్టల వల్ల వల్లకాడవుతున్నది భారతం. అడుగడుగునా ఈ ‘సోనేకి చిడ్యా’ (బంగరు పిచ్చుక) బంజరు భూమిగా మారుతున్నది. స్వరాజ్యాన్ని సంరక్షించే బాధ్యత గల ఈ యువతరం, తమ పొడుగాటి జులఫాలను భుజాలపై వేలాడ దీసుకుని నడుములు వంచి నాట్యాలు చేస్తూ, ప్లబ్బుల్లో, క్లబ్బుల్లో, మబ్బుల్లో తుళ్ళుతూ తూగుతున్నారు. ఎవరి కొంగులపై సైతం పర పురుషుని దృష్టి పడలేదో అట్టి శీలవతులు భారత స్వాతంత్య్రం కోసం సామూహిక మానభంగానికి గురయి అవమానం భరించలేక ఎలా విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలారో, చెట్టాపట్టాలేసుకుని సిగ్గూ, ఎగ్గూ లేకుండా త్రుళ్ళుతూ, తూగుతూ నృత్యాలు చేస్తున్న వనితలకేం తెలుసు?
పాశ్చాత్య దేశాలతో, తెల్ల దొరలతో మనం సైనిక పరంగా ఓడిపోయామంటే ఫరవా లేదు, కాని నైతికంగా వారికి దాసోహ మవటం, పాశ్చాత్య సంస్కృతీ నాగరికతలకు, వారి ఆలోచనా సరళికి, వారి ఫిలాసఫీకి కూడా గులాంగిరీ చేయడం అత్యంత ప్రమాదకర పోకడ. ఇది దేశ ప్రగతికే గొడ్డలి పెట్టు అవ్వచ్చు. తెల్ల దొరలు మన దేశాన్ని వీడి వెళ్ళి చాలా కాలమే అయినా, ఇక్కడి కొందరి మనో మస్త్తిష్కాల్లో పాశ్చాత్యుల బానిస భావం నిండి ఉంది. వారు గీసిన గీతను దాటి తాము స్వతంత్రంగా జీవించ గలం అనే ఆత్మ స్థయిర్యానికి నోచుకోని భావ దారిద్య్రం వాళ్ళని ఆవహించి ఉన్నది.
కూలి కడుపులు గుప్పెడు మెతుకుల కోసం, గుక్కెడు తన్నీరు కోసం అలమటించి పోతుంటే-, రంగుల కలలోన ముంచి వెండి తెర అశ్లీలం – వీధుల్లో ప్రవహిస్తున్న సినిమాయ జగత్తు సిగ్గూ, మానాల్ని, లజ్జా, వ్రీడల్ని నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. టీవీల్లో, నవలల్లో – ఎక్కడ చూసినా సెక్స్, హింస, నేరాలే – కుళ్ళు కుంపటి. కుట్ర కుతంత్ర భావాలే. స్వాభిమానం చచ్చిన, పౌరుషం నశించిన యువతరం, వారికి మార్గదర్శకులుగా వ్యవహరించే వృద్ధ మారాజుల దుష్కర్మల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న చేదు అనైతిక ఫలం. చివరికి ‘స్వలింగ సంపర్కం’ లాంటి లజ్జావిహీన చేష్టకు సైతం లైసెన్సు లభించింది. దేశ సామాజిక సాంస్కృతిక జీవనానికి పట్టుకొమ్మలయిన విలువలు, ఆదర్శాలు ఇలా మట్టి పాలవుతుంటే-, నీతి స్థానే అవినీతి, నిజాయితీ స్థానే నిలువు దోపిడీ, నిర్భయం స్థానే పిరికితనం, నిష్పక్షపాతం స్థానే పక్షపాత ధోరణి, సహేతుకత స్థానే అంధానుసరణ చోటు చేసుకుంటే – దాన్ని పురోగమనం అనాలా? లేదా తిరోగమనం అని చెప్పాలా?
మనం తినే పప్పే నిప్పయి ముప్పయి పోయిన తరుణం ఇది. ఇక స్త్రీ శిశువుల మాట సరేసరి – ఆసుపత్రి గోడల ప్రక్కన, ఆడ శిశువులు ఊరకుక్కల విస్తరి భోజనా లవుతున్నారు. పాపం, పుణ్యం తెలియని పసికూనలు పాషాణ హృదయుల అత్యాచారానికి బలవుతున్నారు. గ్యాంగ్ రేప్‌లు, ఈవ్ టీజింగ్స్, బ్లాక్ మెయిలింగ్‌లు ఉన్మాదానికి పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. శారీరక మానసిక వెతల పాలవుతోంది మహిళ. ఢిల్లీ, ముంబయి, మద్రాసు, హైదరాబాదు, కేరళ, బెంగళూరు, గుజరాత్, కొల్‌కత్తాలలో మహిళల దిక్కులేని మానం మూకుమ్మడిగా వేయబడుతోంది వేలం!! ఇరుకు బందీఖానాల్లో జీవితం, నరకాల ‘గడీ’ల్లో వ్యభిచారం తప్పని శాపమై మగ్గుతున్న మగువల గుండె ఘోషలు! బలయ్యే మూగ జీవాల అర్తనాదాలు!!
మహిళా రక్షణ, సతీ సహగమనం వ్యభిచార నిరోధక చట్టాలన్నీ నిస్సహాయంగా కోర్టు సెల్ఫు పుస్తకాల వరకే పరిమిత మవుతున్నాయి. కళ్ళు లేని చట్టం, కుళ్ళు నిండిన రాజకీయం, హృదయం లేని అధికారం, పంజరంలో ప్రజాస్వామ్యం, నీతి లేని నాయకత్వం మహళల దుస్థితికి, అప్రజాస్వామిక పరిస్థితికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి.
అవును మరి – పువ్వులు సువాసనల్ని వెదజల్లితే అది తోట. మనసును మైమరపించే రాగం వినబడితే అది పాట. స్వార్థానికి, అమానుషత్వానికి అమాయకులు బలయితే అది రాజకీయ ఆట. ఇవేవో మనకు సంబంధం లేని విషయాలని అనుకోకండి. ఒక కేసుతో మీకు ఎలాంటి సంబంధం లేకపోయినా సృష్టించి, శృతులు కల్పి మరీ మిమ్మల్ని ఇరికిస్తారు. ఇరకాటంలో పడేస్త్తారు – దటీజ్ పోలిటిక్స్!
ఇదిగో వచ్చేశాం. ప్రతి మనిషి ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి వచ్చేశాం. చాలీ చాలని జీతాలతో చిరు సుఖాన్ని సైతం చవి చూడకుండా, చితికి చితికి, చితికి ఆహుతి అవుతున్న పేద బ్రతుకులు. తల దాచు కునేందుకుగాను వేసుకున్న ఆ పూరి గుడిసె స్థలాల్ని సైతం కబ్జా పేరుతో కబళిస్తున్న కాళ సర్పాలు… వడ్డీ.. చక్ర వడ్డీ… బారు వడ్డీలతో పేదోడి నడ్డీ విరగ్గొడుతున్న కనక పిశాచులు… ధన పిపాసులు…!! ఇవి చాలవన్నట్టు ఉగ్రవాదం ఒకటి.
ఈ పాపం దేశానిదా? కాదు… కానే కాదు… ఈ దేశ ప్రజలది. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ దేశంలోని కొందరిది… అయితే ఒక్కటి మాత్రం నిజం… మోసం చేస్తున్నది కొందరే. దాన్ని పట్టించుకోని, గుర్తు పట్టని అజ్ఞానం మాత్రం అందరిది… మనందరిది. మన అజ్ఞానం, అశ్రద్ధ, అలసత్వం, అంధానుసరణ అంతం కానంత వరకు సమస్యలు పరిష్కారం కావు. ఎవరో ఒకరు, ఎపుడో ఒకప్పుడు వేయాలనుకునే ‘ఆ అడుగు’ మనం ఎందుకు కాకూడదు? అవును విజయం అడుగు దూరంలోనే ఉంటుంది. అది కొందరికే లభిస్తుంది – అడుగేసి అలసిపోని వాళ్ళకు!!