కలిసి నిలబడండి మీ హృదయాలు కలుస్తాయి

Originally posted 2016-12-25 10:50:44.

నమాజ్‌ విశ్వాస (ఈమాన్‌) మాధుర్యం. అది ఆత్మకు ఆహారం. హృదయానికి శాంతిని, నెమ్మదిని ఇచ్చే అరుదైన టానిక్కు. దాంతో పాటు అది ముస్లింల సామూహిక, నైతిక, సంస్కృతీ నాగరికతల సంస్కరణకు దోహదపడే అత్యుత్తమ పరికరం కూడా.

నమాజ్‌ విశ్వాస (ఈమాన్‌) మాధుర్యం. అది ఆత్మకు ఆహారం. హృదయానికి శాంతిని, నెమ్మదిని ఇచ్చే అరుదైన టానిక్కు. దాంతో పాటు అది ముస్లింల సామూహిక, నైతిక, సంస్కృతీ నాగరికతల సంస్కరణకు దోహదపడే అత్యుత్తమ పరికరం కూడా.

ఏ జాతి జీవన ప్రవాహమైనా సామూహిక క్రమశిక్షణ లేకుండా చల్లగా, సజావుగా సాగదు. క్రమశిక్షణా రాహిత్యం, అస్తవ్యస్తత గనక పొడసూపితే ఇక ఆ జాతి జీవనంలో స్తబ్ధత ఆవరిస్తుంది. దాని బ్రతుకంతా చిందరవందర అయిపోతుంది.
  అందుకే ఇస్లాం తన అనుచర సమాజంలో క్రమశిక్షణ చెదరిపోకుండా ఉండటానికి ‘సామూహిక నమాజ్‌’ అనే క్రియాత్మక దృష్టాంతాన్ని నెలకొల్పింది. ఇస్లాం ప్రవక్త (స) ఈ దృష్టాంతం ఆధారంగానే చెల్లాచెదురుగా పడి ఉన్న అరబ్బు జాతిని ఓ కట్టుదిట్ట మైన జీవన విధాన మూసలో పోశారు. వారిని ఒకే త్రాటిపై నడిపించారు. ఐకమత్యం కోసం, సద్భావన కోసం, ఒకే మాటపై నిలిచి,ఒకే బాటపై నడవటం కోసం ‘సామూహిక నమాజు’ను నెలకొల్పటం ఎంత అవసరమో ఉదాహరణప్రాయంగా రూఢీ చేశారు.
  సామూహిక నమాజులో ముస్లింలు వరుసలు తీరి భుజానికి భుజం ఆనించి నిలబటం, ఒకే నాయకు(ఇమామ్‌)డ్ని అందరూ సమానంగా అనుసరించటం అపురూప విషయం. ఒక జాతి జీవనాన్ని ఒకే సమాహారంలో బంధించే విలక్షణ వ్యవస్థ ఇది. సీసం కరిగించి పోయబడిన గోడ పటిష్టంగా ఉన్నట్లే సామూహిక నమాజు వ్యవస్థలో ఇమిడిపోయిన జాతి జీవనం కూడా పటిష్టంగా, చెక్కు చెదరకుండా ఉంటుంది.
అయితే –
  సామూహిక నమాజు చేస్తున్నప్పుడు ఆ నమాజీలలో నిజమైన భక్తి, అణుకువ ఉండాలి. అరమరికలు దూరమవాలి. కల్లాకపటం నిష్క్రమించాలి. దైవ సహాయం కోసం దీనాతిదీనంగా వారి పెదవులు ప్రార్థించాలి. అప్పుడే జాతీయ జీవనంలో పరస్పర సహకార భావం జనిస్తుంది. సంఘీభావం వెల్లి విరుస్తుంది. సాటి సోదరుల పట్ల నిజమైన సానుభూతి పెంపొందుతుంది.
అందుకే –
  అంతిమ దైవ ప్రవక్త (స) వారు సామూహిక నమాజు సందర్భంగా పంక్తులు సరిదిద్దే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
”మీరు కలిసి కట్టుగా నిలబడనంత వరకూ మీ హృదయాలు కూడా పరస్పరం కలవలేవు” అని ఆ మహనీయుడు (స) నొక్కి వక్కాణించారు. (సహీహ్‌ బుఖారీ – కితాబుస్సలాత్)

Related Post