మనం మన సమాజంలో నివసించే వ్యక్తుల్ని ‘మానవ హక్కులు’ అంటే ఏమిటి? అని ప్రశ్నించామనుకోండి, వారి నుండి విభిన్న సమాధానాలు వినవస్తాయి. వారికి తెలిసిన, కావాల్సిన హక్కుల గురించి చెబుతారేగానీ, మానవ హక్కుల గురించి పూర్తి అవగాహన వారిలో ఉండదు. బహుకొద్ది మందికి మాత్రమే వాటిని గురించి తెలిసి ఉంటుంది.
హక్కు అంటే ఒక విధమయినటువంటి స్వేచ్ఛ, మనకు సంక్రమించే అధికారం అన్న మాట. సాధారణంగా ఈ హక్కులు వ్యక్తి నివసించే సమాజం, ప్రాంతం దేశాన్ని బట్టి ఉంటాయి. అంటే, వారికి లభించిన హక్కుల్ని వారు తమ దేశ సరిహద్దుల్లో మాత్రమే పరిపూర్ణంగా పొందగలుగుతారు. ఉదాహరణకు – అన్నీ దేశాలలో నివసించే వారికి ఓటు హక్కు ఉంటుంది. కాని వారు ఆ అధికారం ఉంది కదా అని ఏ దేశంలో పడితే ఆ దేశంలో ఓటు వెయ్యలేరు.
మానవ హక్కుల విషయమయి ప్రతి కాలంలోనూ సత్పురుషులు, సంఘ సంస్కర్తలు కొందరు ఉద్యమిస్తూనే వచ్చారు అన్నది నిజం. చివరికి 30 హక్కులతో కూడిన ‘మానవ హక్కుల’ చార్టర్‌ను 20 సంవత్సరాల తర్జనభర్జన తర్వాత 1948 ప్రచురించి ఐక్యరాజ్య సమితి తన సభ్య దేశాలకు పంపించింది అన్న మాట కూడా నిజమే. ఒకప్పుడు ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల సంఖ్య 58 మాత్రమే. నేడు మొత్తం 192 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగి ఉన్నాయి అన్నదీ స్పష్టమే.
అయినా నేటికీ కోట్లాది ప్రజలు వేదనకు, యుద్ధ హింసకు, మత హింసకు గురవుతూనే ఉన్నారు. వారికున్న కనీస మానవ హక్కుల్ని గౌరవించలేని దౌర్భాగ్య స్థితి. సార్వజనీన మానవ హక్కుల ప్రకట ఆహార హక్కును కల్పించినప్పటికీ ప్రతి రోజు 15,000 బాలలు ఆహార కొరతతో అశువులు బాస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రకటనల్లో పొందు పర్చ బడినప్పటికీ ఇంకా లక్షలాది మంది తాము నమ్మింది సత్యం అనుకుంది చెప్పినందుకు జైళ్ళల్లో మగ్గుతున్నారు. బానిసత్వాన్ని నిరోధించినప్పటికీ నేటికీ కోట్ల మంది బానిసలుగానే బ్రతుకుతున్నారు. ఈ సంఖ్య బానిసల కాలం నాటికమటే రెండింతలు ఎక్కువ! విద్యాహక్కు ఉన్నప్పటికీ నేటికీ 100 కోట్ల మంది కంటే ఎక్కువ మందికే చదవడం రాదు. నేడు మన సమాజంలో ఉన్న వ్యక్తు లకు 30 మానవ హక్కుల్లో ‘కూడు, గూడు, గుడ్డ’ అనే మూడుకంటే ఎక్కువ తెలీదు. ఇంత చెప్పారు బాగానే ఉంది కానీ, మానవ హక్కుల తో ఇస్లాంకున్న సంబంధం ఏమిటి? మీరు అడగవచ్చు. అదే మనం ఈ వ్యాసం ద్వారా తెలుసుకోబోతున్న చారిత్రక సత్యం!
ఇస్లాం కేవలం ఓ మత సిద్ధాంతం, మత విశ్వాసం కాదు. అది ఆధ్యా త్మిక వికాసం, మానవీయ సద్గుణాల నిర్మాణం, వాటి సంస్కరణ వరకే పరిమితం కాదు. అది సర్వతోముఖ, సమన్విత ఏకాంకం. అందులో న్యాయవంతమయిన ఆర్థిక విధానం, సమతూకం, సమ తౌల్యం, సామరస్యం, సుహృద్భావన గల సామాజిక వ్యవస్థ, సివిల్, క్రిమినల్, జాతీయ, అంతర్జాతీయ శాసనాలు, నియమ నిబంధనలు,
ప్రత్యేక జీవనతత్వం, శారీరక శిక్షణకై విశేషమయిన ఏర్పాట్లున్నాయి. అవన్నీ అది ప్రసాదించే మౌలిక విశ్వాసానికి నైతిక, ఆధ్యాత్మిక స్వభావానికి ఉద్భవించిన కొమ్మలు, రెమ్మలే.
గాంధి గారి మాటల్లో చప్పాలంటే, ”ప్రస్తుతం ప్రపంచంలో పని చేస్తు న్న ఏకైక ప్రజాస్వామ్య బద్ధమయిన విశ్వాసం-ఇస్లాం అని నేను భావి స్తున్నాను. ఆలోచనాపరులందరూ నా ఈ అభిప్రాయాన్ని బలపరు స్తారు. నేను ఒక హిందువు, హిందూ మతంలో ప్రగాఢమయిన నమ్మకం గలవాడయినప్పటికీ ఈ మాట అనడానికి సాహసిస్తున్నాను.
నా మతంలో ఏ మౌలిక సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఆచరణాత్మకంగా నా స్వంత మతం సఫలం కాలేకపోయింది. ఏ ఇతర మతము కూడా దాని సిద్ధాంతం ఏదయినప్పటికీ, సర్వ మానవ సమానత్వం అన్న సిద్ధాంతాన్ని అమలు పర్చడంలో ఇస్లాం సాధించిన విజయాన్ని పొంద లేదు. దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికాలోని దక్షిణ రాష్ట్రాలలో నూ చివరకు ఇంగ్లాండ్‌లోనూ తలెత్తుతున్న తారతమ్య భావాలు, వ్యత్యాసాలు ఇస్లాంలో ఉండే అవకాశమే లేదు”.
గాంధి గారి ఇదే మాటను ధృవీకరిస్తూ ‘స్వామి వివేకానంద సరస్వతి’ వారు లెటర్స్ ఆఫ్ స్వామి వివేకానంద పేజీ నం 463లో ఇలా అభి ప్రాయ పడ్డారు: ”ఇతర జాతులకన్నా ముందుగా ఆద్వైత సిద్ధాంతాన్ని కనుగొన్న వారిగా హిందువులు పేరు పొంది ఉండవచ్చు కానీ, ఆచర ణాత్మకంగా మానవ జాతి సమస్తం ఒకే ఆత్మగా భావించడమన్న భావన హిందువుల్లో ఎన్నడూ జనించలేదు. దానికి భిన్నంగా, నా అనుభవంలో సమానత్వాన్ని ప్రశంసాభరితమయిన రీతిలో, స్థాయిలో సాధించిన మతమంటూ ఏదన్నా ఉందంటే అది కేవలం ఇస్లాం మాత్రమే. కాబట్టి వేదాంత సిద్ధాంతాలు ఎంత గొప్పవయినప్పటికీ ఇస్లామీయ ఆచరణ లేకపోతే అవి జన సామాన్యనికి ప్రయోజనరహిత మయినవిగా మిగిలి పోతాయి”.
1) సృష్టి శ్రేష్ఠుడు మానవడు
ఇస్లాం – దేశం, జాతి, ప్రాంతం, మతం, వంశం, రంగు, భాషలకు అతీతంగా మనిషిని ఒక మనిషిగా గుర్తిస్తుంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మేము ఆదం సంతతికి పెద్దరికాన్ని ప్రసాదించాము. వారికి నేలపై, నీటిలో నడిచే వాహనాలను ప్రసాదించాము. వారికి పరిశుద్ధ మయిన వస్తువులను ఆహారంగా ఇచ్చాము. మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి స్పష్టమయిన ఆధిక్యాన్ని అనుగ్రహించాము”. (దివ్యఖుర్‌ఆన్-17; 70)
మానవుడు అందం గురించి చెప్పాలనుకున్నప్పుడు సూర్య చంద్రుల్ని, గులాబి పువ్వును, ముత్యాల్ని, పగడాల్ని ఉపమానంగా పేర్కొంనడం మనం గమనిస్తాం. ఇదంతా ఒక విధంగా అతని ఆలోచనా లేమియే. వాస్తవం ఏమిటంటే మానవ సృజనలో ఆ సృష్టికర్త ఎంతటి అందాన్ని, వైవిధ్యాన్ని పెట్టాడో, తల నుండి గోటి దాకా ఎంత అందంగా పొంది కగా అవయవాలన్నింటిని అమర్చాడో అంతకంటే అద్భుత స్థాయి సృజన మరే జీవిలోనూ కానరాదు. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్ ఇలా పేర్కొంటుంది: ”మేము మానవుణ్ణి అద్భుతమయిన, సుమనోహరమ యిన, సుందరమయిన ఆకృతిలో సృజించాము”. (దివ్యఖుర్‌ఆన్ -95:4)
2) ఇస్లాం మనందరి జన్మ హక్కు
మనిషి మానం మర్యాదకు, కీర్తిప్రతిష్టకు కిరీటం దేవుని ఏకత్వ భావం. తౌహీద్ మనిషిని ఒక వైపు నిజ ఆరాధ్యుని ముందు మోక రిల్లజేస్తుంటే, మరో వైపు అతనిని గడపగడపన తలను వంచ కుండా, ఆత్మ వంచనకు పాల్పడకుండా కాపాడుతుంది. కాబట్టి మనిషికి దేవుని ఏకత్వానికి – తౌహీద్‌కి మించిన గౌరవం లేదు. బహుదైవ భావనకు, నాస్తిక భావనకు మించిన అవమానం లేదు. ఇస్లాం దృష్టిలో మానవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, రాయి, రప్ప, పాము, పుట్టకంటే ఉత్కృష్ట జీవి. పర్వతాలకంటే, సముద్రాలకంటే, నదీనదాలకంటే, అండ, పిండ, బ్రహ్మాండాలకంటే గౌరవనీయుడు మనిషి. అందువల్ల అతని దేహానికే తలమానికం అయిన అతని శిరస్సు అతన్ని ఇంత అందమయిన ఆకృతిలో సృజించిన ఆ సృజనశీలుని ముందర తప్ప ఇంకెవరి ముందరా వంగ కూడదు అంటుంది ఇస్లాం.ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఇస్లాం, పుట్టే ప్రతి శిశువు జన్నతః పొందే హక్కు’. ఇస్లాం గురించి అతను తెలుసుకోవడం అంటే, కుటుంబం, ప్రాంతం, పరిసరాలు, ఆచారాల కారణంగా కోల్పోయిన తన జన్మ హక్కును తిరిగి పొం దడమే. ఒక్క మాటలో చెప్పాలంటే కూడు, గూడు, గుడ్డకు సంబం ధించిన హక్కులన్నింటికంటే ప్రప్రధమమయిన హక్కు ఇస్లాం. ఈ హక్కు పట్ల విస్మరణకు, అలక్ష్యానికి, అలసత్వానికి, అపార్థానికి లోనవడం అంటే, బానిసత్వంలో మ్రగ్గడమే. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స)అన్నారు: ”పుట్టే ప్రతి శిశువు ప్రకృతి ధర్మం మీదే పుడుతుంది. కానీ, దాని తల్లిదండ్రులు దాన్ని మజూసిగానో (అగ్గి పూజారిగానో), యూదునిగానో, క్రైస్తవునిగానో మార్చి వేస్తారు”.
3) మానం మర్యాదకు ప్రమాణం
ఇస్లాం మనిషి మానం మర్యాదలకు పెద్ద పీట వేస్తోంది. బ్రతికున్న మనిషినే కాదు మరణించిన మనిషి శరీరాన్ని సయితం గౌరవించా లంటుంది ఇస్లాం. మనిషి జీవితంలో ఎన్ని అంశాలయితే అతనికి బాధ కలిగిస్తాయో మనిషి మృత శరీరానికి సయితం ఆయా బాధలు కలగకుండా వారిస్తుంది. అతని పార్థివ శరీరాన్ని గౌరవ ప్రపత్తులతో స్నానం చేయించాలి. పరిశుభ్రమయిన వస్త్రాలు తొడిగించి, సువాసన లతో నింపి మృతుని కోసం నమాజు చేసి, అతని/ ఆమె క్షమాపణ కోసం దుఆ చేసి,ఆ తర్వాత భుజాల మీద ఎత్తుకుని ఖననవాటికకు తీసుకెళ్ళి అతి జాగ్రత్తగా దీవెనలు కురిపిస్తూ సమాధి చేయాలి అం టుంది. ఒకసారి ముస్లిమేతర శవాన్ని ఖననవాటికకు తీసుకెళుతుండ గా చూసి మహా ప్రవక్త ముహమ్మద్ (స) లేచి నిలుచున్నారు. ‘అది ముస్లిం శవం కాదు కదా’ అని ఎవరో అనగా, ‘ప్రాణం అందులో కూడా ఉండేదిగా’ అని సమాధానమిచ్చారు కారుణ్యమూర్తి (స).
ఇస్లాంకు పూర్వం యుద్ధ సమయంలో అరబ్బులు తమ శత్రువుల మృత దేహాల పట్ల చాలా దారుణంగా వ్యవహరించేవారు. దేహావయ వాలను నిర్దాక్షిణంగా కోసి వేెసేవారు. చెవులు, ఇతర అంగాలను హారంగా చేసి మెడలో వేసుకొని పైశాచికానందాన్ని పొందేవారు. శత్రువుల పుర్రెలో సారాయి పోసుకుని తాగి తూగేవారు. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) వారి బాబాయితో ఉహద్ సంగ్రామంలో అలానే వ్యవహరించడం జరిగింది. ఇలా చేయడాన్ని అరబీ భాషలో ‘ముస్లా’ అనంటారు. మానవ మహోపకారి ముహమ్మద్ (స) ఈ అమానవీయ చేష్ట నుండి వారించారు.
4) ప్రాణ రక్షణ
మానవ జీవిత రక్షణ, ప్రాణ రక్షణ ఇస్లాం చూపిన జీవన విధానంలో పరిపూర్ణంగా ఉంది. దివ్య ఖుర్‌ఆన్ ఒక మనిషి ప్రాణం అన్యాయం గా తీయడాన్ని తీవ్రంగా వారించింది: ”అల్లాహ్‌ా నిషేధించిన ఏ ప్రాణి నీ న్యాయంగా తప్ప హతమార్చకండి”. (దివ్యఖుర్‌ఆన్-17:33) దివ్య ఖుర్‌ఆన్ ఒక మనిషిని అన్యాయంగా హత్య చేస్తే మానవులం దరినీ హత్య చేసినట్లేనని చెబుతోంది. ఎందుకంటే మానవ జీవితానికి అసలు గౌరవం అనేది లేకపోతే ఒక మనిషయినా, ఒక సమూహమ యినా ఒక్కటే! ”హత్యకు బదులుగా గాని లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసి నందుకు బదులుగా గాని కాక ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. అలాగే ఎవరయినా ఒక మనిషి ప్రాణం కాపాడితే అతను యావత్తు మానవాళిని కాపాడినట్లే”. (దివ్యఖుర్‌ఆన్-5;32)
ఇస్లాం పుడమిపై పాదం మోపిన మానవుల ప్రాణానికి రక్షణ కల్పించ డమే కాక, మాతృగర్భంలో పెరుగుతున్న పసికందుల్ని కూడా రక్షిస్తుంది. ”కేవలం ఆకలిదప్పులకు భయపడి మీ సంతానాన్ని హత్య చేయకండి”. (దివ్యఖుర్‌ఆన్-17; 31) ఈ నాడు ఫ్యామిలీ ప్లానింగ్ దిక్కుమాలిన ఆచారం ఎంతగా ప్రబలిందంటే పూర్తి మానవతకే మాయని మచ్చలా తయారయింది. అలాగే మనిషి స్వయాన్ని కూడా హతమార్చకూడదు అని ఇస్లాం నొక్కి వక్కాణిస్తోంది. ఆడ, మగ అన్న విభజన, ఎటువంటి వివక్ష లేకుండా ఇస్లాం మానవ ప్రాణానికి రక్షణ కల్పించింది.
5) మాన రక్షణ
మానసం గల మనిషికి అన్నింటికంటే ప్రధానమయినది అతని మాన మర్యాదలు. ఇస్లాం మనిషి మానం, మర్యాదలకు ప్రాధాన్య తనిస్తోంది. మనిషి గౌరవోన్నతులను దృష్టిలో పెట్టుకుని మీరు ఎవరి ఇంటికయినా వెళితే ఆ ఇంటి యజమానినే నమాజుకు ఇమామ్‌గా వ్యవహరిమచమని చెప్పండి అంటోంది. ఈ ఉపదేశం వెలుగులో మనం ఎవరి ఇంటికి, ఆఫీసుకి వెళితే ఆ ఇంటి యజమాని, ఆ ఆఫీసు అధికారి హోదాకు సంబంధించిన సీటులో కూర్చోకూడదు. దీనిని హదీసులో ‘తక్‌రమహ్‌ా’ అనబడింది. అలాగే వ్యక్తి ఎవరయినా ఎగతాళి చేయరాదని వారించ బడింది: ”పురుషులు ఇతర పురుషులను ఎగతాళి చేయకూడదు. వీరి కంటే వారే శ్రేష్ఠులయి ఉండొచ్చు. స్త్రీలు ఇతర స్త్రీలను ఎగతాళి చేయ కూడదు. వీరికంటే వారే శ్రేష్ఠులయి ఉండొచ్చు. మీరు పరస్సపరం ఒండొకరు ఎత్తి పొడుచుకోకండి. ఒకరినొకరు చెడ్డ పేర్లతో పిలుచు కోకండి”. (దివ్యఖుర్‌ఆన్- 49: 11)
ఇస్లాం అమలు పర్చే శాసనంలో – వ్యభిచారం కోసం కఠినమయిన శిక్ష నిర్ణయించబడింది. ఇస్లాం మానవుల పరువుప్రతిష్టలను ఎంతగా ఆదరించిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని కించ పరచినా, ఒకరిపై అపనిందలు మోపినా అలా చేసిన వ్కక్తికి ఎనభయి కొరడా దెబ్బలు శిక్షగా నిర్ణయించబడ్డాయి. మత్తు పానీయా లకు, మాదక ద్రవ్యాలకు బానిసయి వ్యక్తి ఇతరుల కీర్తి కండూతిని లెఖ్ఖ చేయడు. తన, పర అన్న విచక్షణా జ్ఞానమూ అతనికుండదు. కొన్ని సందర్భాలలో వావివరుసలు సయితం అతనికి గుర్తుండవు. మనిషి మానానికి ఇస్లాం ఇచ్చే స్థానం దృష్ట్యా ఇస్లాం ఇటువంటి చేష్టను ఖండించడమే కాక, మత్తు పదార్థాలను, మాదకద్రవ్యాలను విక్రయించే వారిని. కొనేవారిని, త్రాగేవారిని, త్రాపించేవారిని, దానిని మోసుకొచ్చేవారందరినీ శపించడమే గాక కఠిన శిక్ష కూడా నిర్ణయిం చింది. కొన్ని ఉల్లేఖనాల్లో నలభయి, మరికొన్ని ఉల్లేఖనాల్లో ఎనభై కొరడా దెబ్బలు కొట్టాలని చెప్పబడింది.
6) వ్యక్తిగత జీవిత పరిరక్షణ
మనిషి వ్యక్తిగత జీవిత పరిరకణ ప్రధానమయినది.మనలోని ప్రతి ఒక్కరూ తన వ్యక్తిగత జీవితంలో ఎవరూ కలుగజేసుకోకూడదు అను కుంటారు. తను వ్యక్తపర్చని విషయాలు బహిర్గతం కావడం ఎవరికీ ఇష్టం ఉండదు. ఇస్లాం ఈ విషయాలను పరిగణలోకి తీసుకొంటుంది. అందువల్లనే ఒకరి వెనకాల మాట్లాడటాన్ని, రంధ్రాణ్వేషణ ద్వారా ఒకరి కూపీలు లాగటాన్ని, ఒకరి ఇంట్లో తొంగి చూడటాన్ని వారిస్తుంది. ఒకరి ఇంట్లోకి తొంగి చూడటమంటే వారి ఇంట్లోకి ప్రవేశించి నట్లేనని హెచ్చరిస్తోంది. ఖుర్‌ఆన్ ఇలా ఉపదేశి స్తింది: ”మీకు అనుమతి లభించనంత వరకు, వారికి సలామ్ చేయ నంత వరకూ ఎవరి ఇంట్లోనయినా సరే ప్రవేశించకండి”. (దివ్యఖుర్‌ఆన్-24;27)
7) వాక్ స్వాతంత్య్రం
ఇస్లాం అలోచనా స్వాతంత్య్రాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను దేశ పౌరు లందరికీ సమానంగా ఇస్తుంది. అయితే ఈ స్వేచ్ఛ కేవలం మంచినీ, సత్యాన్నీ ప్రచారం చేయడానికి మాత్రమే వినియోగించాలి. చెడుని, అశ్లీలాన్ని, అనైతికాన్ని ప్రచారం చేయడానికి వాడరాదు అన్న ఆంక్ష విధిస్తుంది. పాశ్చాత్య దేశాల్లోని భావ ప్రకటనా స్వేచ్ఛకన్నా ఇస్లాం మనిషికి ప్రతిపాదించే భావన ఎంతో ఉన్నతమయినది. అది ఎలాంటి పరిస్థితుల్లోనూ చెడుల ప్రచారానికి అనుమతినివ్వదు. వాక్ స్వాతం త్య్రంలో విమర్శ, నిరసనల హక్కులు కూడా అంతర్లీనమయి ఉన్నాయి.
ప్రవక్త (స) శ్రేష్ఠతరమయిన విమర్శకు అనుమతించడమే కాక, దాని ని ప్రోత్సహించారు కూడా.”దౌర్జన్యపరుడయిన రాజు ముందు సత్యం పలకడం జిహాద్‌లో శ్రేష్ఠతర స్థాయికి చెందినది” అని ఉపదేశించారు ప్రవక్త (స). ఖుర్‌ఆన్ హదీసులో అలాంటి నిర్మాణాత్మక విమర్శను ‘నహీ అనిల్ మున్కర్’ చెడు నుండి వారించడం అని చెప్పబడింది.
ఇది ముస్లింలకు విధిగా ఖరాలు చేసింది. అయితే విమర్శల పేరు తో దూషించే, ద్వేషించే, ఇతరులను కించపర్చే అధికారాన్ని ఇస్లాం ఎవరికీ ఇవ్వదు. ఇస్లాంలో వ్యవస్థా పరంగా అభిప్రాయానికి ద్వారాలు తెరచే ఉంటాయి. షరీయతు ఆజ్ఞల్లో కూడా ఖుర్‌ఆన్ హదీసులకు లోబడి అభిప్రాయానికి చోటు కల్పించింది ఇస్లాం.
8) మత స్వేచ్ఛ
మనస్సాక్షి, అభిప్రాయ వ్యక్తీకరణతో ‘మత స్వేచ్ఛ’ ముడి పడి ఉం టుంది. దివ్యఖుర్‌ఆన్ ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది: ”మత విషయంలో ఎలాంటి బలాత్కారం లేదు”. (బఖర; 256)
మత బోధ అన్నది హృదయానికి, మనస్సాక్షికి సంబంధించిన విషయం. దివ్యఖుర్‌ఆన్ ప్రవక్త (స)ను సంబోధిస్తూ ఓ చోట: ”నీ పని కేవలం సందేశం విన్పించడం మాత్రమే. నీవు ప్రజలపై కాపలాదారు కాదు”. (షూరా: 48) మరో చోట: ”ప్రవక్తా! హిత బోధ చేస్తూ ఉండు, నీవు కేవలం హితబోధ చేసేవాడవు మాత్రమే గాని, వారిని బలవంతంగా దారికి తెచ్చే బాధ్యత నీపై లేదు”. (దివ్యఖుర్‌ఆన్-88:21, 22)
9) వృత్తి స్వేచ్ఛ
ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం కొన్ని ప్రాంతాలలో కొన్ని వృత్తులు కొందరి కోసం ప్రత్యేకమనే భావన ఉండేది. ప్రత్యేకించి భారత దేశంలో విభిన్న కులాల కోసం వారి వారి కుల వృత్తులు నిర్ణయించబడి ఉండేవి. వారు ఆ నిర్ణీత పనులే చేయాలి. కాని ఇస్లాం పనుల విషయంలో ఎలాంటి హద్దులు పెట్ట లేదు. ఏ వృత్తిని చిన్న చూపు చూడలేదు. ప్రతి వ్యక్తి ఉపాధి కోసం న్యాయబద్ధ మయిన ఏ వృత్తినయినా ఎంచుకోవచ్చు. ఒక వృత్తిని వదలి మరో వృత్తిని చేపట్టవచ్చు. అయితే ఎవరు ఏ వృత్తిని అవలంబించినా దాని ద్వారా ప్రజలకు లాభం ఉండాలి. దేశ, ప్రజల సంక్షేమం అందులో దాగుండాలి. దాని కోసం సామర్థ్యం అవసరం. వైద్యం గురించి తెలియని వ్యక్తి వైద్యం చేయకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే – ఒకరి కర్మలకు ఇతరుల్ని బాధ్యుల్ని చేయకపోవడం, మత నాయకులు, మతాల పట్ల సమరస భావంతో వ్యవహరించడం, సమానత్వం, పాలకులు చట్టానికి అతీతులు కారు అన్న భావన, ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఎండగట్టే హక్కు, న్యాయం పొందే హక్కు, కూటములు ఏర్పరిచే హక్కు, ఆస్తి హక్కు, మొదలయిన అనేక మౌలిక హక్కులను ఇస్లాం మానవాళికి ప్రసాదిస్తోంది. ఒక్క మాట లో చెప్పాలంటే ఇస్లాం ఇటు వ్యక్తినీ కాదనదు. అటు సమాజాన్నీ త్రోసి రాజనదు. అది ఈ రెండింటిలోనూ సామరస్యాన్ని, సమతూ కాన్ని స్థాపించి వాటికి వాటి వాటి నిజ స్థానాలను ప్రసాదిస్తుంది.
ఇస్లాం దాని దృక్పథం రీత్యా, అది అవలంబించే విధానం రీత్యా అంతర్జాతీయమయినది. అజ్ఞాన కాలపు అహంభావాల్ని, నిర్బంధాల్ని, విచక్షణల్ని, వివక్షల్ని అది సమ్మతించదు. జాతీయ వైష మ్యాల, కలహాల కారణంగా చిన్నాభిన్నమయిపోయిన నేటి ప్రపం చానికి ఇస్లాం ఒక జీవనదాయక సందేశం, ఆశాజ్యోతి, మహోజ్వల మయిన భవిష్యత్తుకు మార్గం!