Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

ఆధ్యాత్మిక వికాసానికి, పవిత్ర జీవితానికి,సేతువు ఉపవాసం

Originally posted 2018-04-04 18:46:49.

  మనిషి నడుస్తున్న జీవితపు ఈ బాటలో ఇరువైపులా ఎన్నెన్నో అతివాదాలు, కోర్కెలు, ఆకాంకలు, ఆశంకలు, ప్రేరణలు, మార్గవిహీనతలు, అవిధేయతలు, అతిక్రమణల ముళ్ళ పొదలు ముసురుకుని ఉంటాయి. ఈ దారిలో ఈ రకరకాల ముళ్ళ నుండి తప్పించుకుని నడవడం, విధేయతా పథాన ముందుకు సాగడమే తఖ్‌వా, ధర్మనిష్ఠ. ప్ర

మనిషి నడుస్తున్న జీవితపు ఈ బాటలో ఇరువైపులా ఎన్నెన్నో అతివాదాలు, కోర్కెలు, ఆకాంకలు, ఆశంకలు, ప్రేరణలు, మార్గవిహీనతలు, అవిధేయతలు, అతిక్రమణల ముళ్ళ పొదలు ముసురుకుని ఉంటాయి. ఈ దారిలో ఈ రకరకాల ముళ్ళ నుండి తప్పించుకుని నడవడం, విధేయతా పథాన ముందుకు సాగడమే తఖ్‌వా, ధర్మనిష్ఠ. ప్ర

 

ధార్మిక వ్యక్తులనగానే ఆధ్యాత్మిక     వికాసమొందిన చిదానంద స్వరూపం మన ముందు నిలుస్తుంది. ఇటువంటి రూపాలు మన ఊహల్లో మెదలినప్పుడు వీరి ఆత్మలు పరమాత్మతో సాయుజ్యం పొందినవిగా మనం భావిస్తాము. అదే ఆధ్యాత్మిక వికాసానికి అత్యున్నత శిఖరాగ్రంగా మనం తలుస్తాము. ఈ ఆధ్యాత్మిక వికాసానికి సాధనం, ఆరాధనలు, ఉపాసనా సాధనలు అన్నది మత పరిభాషలో అంగీకృత సత్యం.

‘ఆరాధన’ అన్న మాటలో పూజాభావం స్ఫురణకు వచ్చే గుణముంది. ఆరాధన అంటే కేవలం పూజ  అన్నది మూఢభావన. మూఢ ప్రజలు తమ ఆరాధ్యులను మానవతుల్యులుగా పరిగణిస్తారు. మానవుల్లో పెద్దలు, పరిపాలకులు, అధికారులు భట్రాజు పొగడ్తలతో, ముడుపులతో సంతోషించినట్లే, నీ బాంచనని, కాల్మొక్తానని కాళ్ళమీద పడటంవల్ల ఆనందించినట్లే ఈ ఆరాధ్యులు కూడా స్తుతి కీర్తనలతో, మొక్కు బడులతో, వినమ్రతా ప్రదర్శనలతో ప్రసన్నులవుతారని తలుస్తారు. ఇలాంటి కొన్ని పూజా లాంఛనాల చెల్లింపును మాత్రమే ఆరాధనగా పేర్కొంటారు. ఇది మూఢత్వపు ఆరాధనా భావన.

ఆరాధన లేక ఆధ్యాత్మిక సాధన అంటే మరో భావన కూడా ఉంది. దైవధ్యానంలో చిత్తం లగ్నం చేసి తపస్సు   నాచరించడం. ఈ ధ్యాన నిమగ్నత వల్ల, ఆరాధనా సాధన వల్ల అంతచ్ఛక్తులు పెంపొంది మహిమలు, మహత్యాలు ప్రదర్శించే శక్తుల్ని సృజించుకోవడం, అంతిమంగా ముక్తిని, మోక్షాన్ని, పరమాత్మ సాయుజ్యాన్ని పొందడం ధ్యేయమవుతుంది. ఇందులో ప్రాపంచిక జీవిత సుఖభోగాలు, మానవీయ సంబంధాలు, బాధ్యతలు పరిత్యజించడం, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అనివార్యమన్న భావం సంలీనమయి ఉంది. ఇది సన్యాసత్వపు ఆరాధనా భావన.

వీటికి భిన్నంగా ఇస్లామ్‌ ప్రతిపాదించే ఆరాధనా భావన విస్తృతమయింది ఇందులో పూజాభావంకన్నా విధేయతా భావానికి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది. స్వామికి స్తోత్రగానంచెయ్యడంతోపాటు ఆయన ఆజ్ఞాపాలన, అప్పగించిన సేవల నిర్వహణ, అప్పజెప్పిన సంబంధాల పరిరక్షణ ఇస్లామీయ ఆరాధనా భావంలో అంతర్భాగమయి వుంటాయి. అంటే సర్వసంగపరిత్యాగం చేసి, ప్రపంచాన్ని దాని మానాన వదలిపెట్టి తపోసాధన చేసి సాధించేదేమీ లేదు. ప్రపంచ కార్యకలాపాల్లో నిమగ్నమయి,  ప్రాపంచిక జీవితపు సమస్త బాధ్యతలను సక్రమంగా, సవ్యంగా నిర్వహించి దైవాజ్ఞా బద్ధంగా, దైవశాసన పాలన చెయ్యడం, దైవసంస్మరణకు దూరం చేసే ప్రపంచంలోనే నిండా మునిగి, దైవాన్ని విస్మరించకుండా అనునిత్యం దైవాన్ని సంస్మరిస్తూ జీవితం గడపడం- అదే ఆరాధన. అదే నిజమయిన పూజాభావం, అదే యదార్ధ ధ్యాన నిమగ్నత అదే వాస్తవ తపస్సు, అదే అసలయిన ఆరాధన!

ఇస్లామీయ ఆరాధానాభావం ఉద్దేశం మానవ జీవితమంతా దైవదాస్య దర్పణం కావాలన్నది. దానికి అది సాధనా రూపాలను ప్రతిపాదిస్తుంది. అలాంటిదే ఒక సాధన, రమజాన్‌ నెలలో ఇస్లామ్‌ అనుయాయులు పాటించే ప్రముఖ ఆరాధనా రూపం, రోజా-ఉపవాస వ్రతం.

ఇస్లామ్‌- దైవవిధేయతా ధర్మం, మానవుని ఆది ధర్మం, సనాతన ధర్మమయినట్లే రోజా వ్రతం కూడా ఆది నుండీ ధర్మంలో అంతర్భాగంగా భాసిల్లుతూ ఉంటూ వచ్చింది. దాని నియమాలు ఆయా కాలాల్లో వేర్వేరుగా ఉన్నప్పటికీ అది సకల దైవ శాసనాంగాల్లోనూ విడదీయరాని అంశంగా అలరారుతూ వచ్చింది. ప్రవక్తలందరూ బోధించిన ధర్మంలో తప్పనిసరి విధిగానే విరాజిల్లింది. దివ్యఖుర్‌ఆన్‌ ఇస్లామీయ సముదాయానికి ఉపవాసవ్రతాన్ని విధిస్తూ ఈ సత్యాన్ని ఇలా ప్రకటించింది:

ఏ విధంగానయితే గతించిన సముదాయాల ప్రజలకు ‘రోజా’ విధిగా నియమించబడిందో అదే విధంగా మీకూ విధిగా ఏర్పరచడం జరిగింది. (అల్‌బఖర: 183)

నమాజ్‌ ప్రతి రోజూ అయిదు పూటలా మనిషిని, నీవు దేవుని దాసుడవు, దైవాజ్ఞాపాలన నీ విధి అని గుర్తు చేస్తూ ఉంటే తాను దైవదాసుడన్న చేతన మనిషిలో సదా పునరుజ్జీవిస్తూ ఉంటుంది. అలా బాధ్యతాభావంతో మెలిగేవానిగా మనిషి రూపొందుతూ ఉంటాడు. అయితే రోజా వ్రతం రమజాన్‌ నెల సాంతం, ప్రతి క్షణం మనిషిలో ఈ చేతనను, ఈ స్పృహను, సక్రియగా, సజీవంగా సముద్ధరిస్తూ ఉంటుంది. పైన పేర్కొన్న ఆయత్‌లో రోజా వ్రతాన్ని విధిగా నిర్ణయించిన చోటనే రోజా వ్రతం ఉద్దేశ్యాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా ప్రస్ఫుటపరుస్తుంది: ”తద్వారా మీరు తఖ్‌వా (ధర్మనిష్ఠ) గుణం గలవారుగా రూపొందాలన్నది ఉద్దేశ్యం.  (అల్‌ బఖర: 183)

అంటే రోజా వ్రతం ఉద్దేశ్యం మనిషిని కేవలం ఆకలిదప్పులకు గురి చేయడం కాదు, మనిషి తన సహజ వాంఛల్ని చంపుకుని సన్యాసిగా రూపొందాలన్నది కూడా కాదు, ప్రపంచానికి దూరంగా అడవుల్లోనో, కొండగుహల్లోనో ధ్యాన నిమగ్నుడవడం అంతకన్నా కాదు; అసలు ఉద్దేశ్యం తఖ్‌వా గుణం పొందడం అన్నమాట. మరి తఖ్‌వా అంటే ఏమిటి? సర్వంగా పరిత్యాగం కాదు గదా,  ఆకస్మాత్తుగా  జ్ఞానోదయమయి, భార్యాపిల్లల్ని శయన మందిరంలో వదలి, సాంసారిక, సామాజిక బాధ్యతలకు చరమగీతం పాడి, భవబంధాలకు కటువుగా విడాకులివ్వడం కాదు గదా, ఆధ్యాత్మిక వికాస సాధనకు భౌతిక వికాసాన్ని కాలదన్ని, శరీరాన్ని బాధలకు, యాతనలకు గురిచెయ్యడం శుష్కింపజేయడం కాదు గదా! అవును, కాదు!!

తఖ్‌వా అన్న అరబీ పదానికి అర్ధం తప్పుకోవడం, తప్పించుకోవడం అన్నది. తఖ్‌వా అన్నదానికి తాత్వికంగా, ధార్మికంగా ఎన్నయినా వివరణలు, మరెన్నయినా భావార్ధాలు కావచ్చు. కాని ఆచరణాత్మకంగా ప్రవక్త సహచరులకన్నా ఉత్తమ రీతిలో దీన్ని బోధపరిచేవారు ఎవరు కాగలరు? మహనీయ ఉమర్‌(ర) ఒకసారి తన మిత్రులు మహనీయ ఉబై బిన్‌ కఅబ్‌ని అడిగారు, ”తఖ్‌వా అని దేనినంటారు?” అని. దానికి ఆయన బదులుగా ”ఎప్పుడయినా మీకు, ఇరువైపులా ముళ్ళ పొదలున్నటువంటి కాలిబాటలో నడిచే అవకాశం కలిగిందా?” అని అడిగారు. మహనీయ ఉమర్‌(రజి) ”ఓ, చాలా సార్లు” అని బదులిచ్చారు. ”అప్పుడు మీరేమి చేస్తారు?” అని తిరిగి అడిగారాయన. దానికి సమాధానంగా ”నేను నా బట్టలను ఒంటికి దగ్గరగా పట్టుకుంటాను, పొదల్ని తప్పించుకుంటూ నడుస్తాను, బట్టలు ముళ్ళల్లో ఇరుక్కోకుండా జాగ్రత్తపడతాను” అని అన్నారు. ”దాన్నే తఖ్‌వా అంటారు” చెప్పారు హజ్రత్‌ ఉబై (రజి).

మనిషి నడుస్తున్న జీవితపు ఈ బాటలో ఇరువైపులా ఎన్నెన్నో అతివాదాలు, కోర్కెలు, ఆకాంకలు, ఆశంకలు, ప్రేరణలు, మార్గవిహీనతలు, అవిధేయతలు, అతిక్రమణల ముళ్ళ పొదలు ముసురుకుని ఉంటాయి. ఈ దారిలో ఈ రకరకాల ముళ్ళ నుండి తప్పించుకుని నడవడం, విధేయతా పథాన ముందుకు సాగడమే తఖ్‌వా, ధర్మనిష్ఠ. ప్రపంచంలోనే జీవిస్తూ దైవం మోపిన బాధ్యతలన్నింటినీ నిర్వహిస్తూ, సాంసారిక కష్టసుఖాలను సమభావంతో అనుభవిస్తూ, సుఖదుఃఖాల మధ్య, ప్రాపంచిక లాలసల మధ్య, ఆశానిరాశల మధ్య, పేరాశ అత్యాశల మధ్య, కలిమిలేముల మధ్య, ఆకర్షణలు వికర్షణల మధ్య, గెలుపూఓటముల మధ్య, జీవితాన్ని ఏ ఒక్క వైపునకూ మొగ్గకుండా కాపాడుకుంటూ, లౌకిక భోగభాగ్యాలను ఆస్వాదిస్తూనే లోకాన్ని అంటీ ముట్టనట్టుగా దైవవిధేయతా మార్గాన నడవడమే ధర్మనిష్ఠ! ఈ ధర్మనిష్ఠను సృజించడానికే పరమ ప్రభువు రోజా వ్రతాన్ని విధిగా నిర్ణయించాడు.

 

 

Related Post