ఆయన సర్వలోకాల పాలిట కారుణ్యంగా పంపబడ్డారు
ఓ ముహమ్మద్ (సఅసo) మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యoగా చేసి పoపాము. సూరె అల్ అంబియా 21:107
మానవులంత అనుసరించదగ్గ గొప్ప ఆదర్శవంతుడు
నిశ్చయంగా దైవప్రవక్త లో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది,. అల్లాహ్ పట్ల అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి, అల్లాహ్ ను అత్యదికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు. ( సూరె అల్ ఆహజాబ్ 33:21)
ఆయన మొత్తం మానవాళి కోసం పంపబడినవారు
ఓ ముహమ్మద్ ! మేము నిన్ను సమస్త జనులకు సుభవార్త అందజేసేవానిగా , హెచ్చరించేవానిగా చేసి పంపాము , అయితే జనులలో అధికులకు ఈ విషయం తెలియదు. ( సూరె సబా 34:28)
మానవాళికంతటికి అల్లాహ్ తరపు నుంచి ప్రవక్తగా పంపబడ్డారు
ఓ ముస్లిములారా ! మీరు అల్లాహ్ ను ,ఆయన ప్రవక్తను విశ్వసిoచటానికి , అతనికి తోడ్పడటానికి ,అతనికి గౌరవిoచటానికి , ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండటానికి గాను (మేము ఈ ఏర్పాటు చేశాము).( సూరె అల్ ఫతహ్ 48:9,29, సూరె అల్ ఆరాఫ్ 7:158)
అంధకారం నుంచి వెలుగు వైపుకు తీసుకువస్తారు
అనగా అల్లాహ్ యొక్క స్పష్టమైన వాక్యాలను (ఆదేశాలను) చదివి వినిపించి, విశ్వసించి సత్కార్యాలు చేసినవారిని ఆయన కారు చీకట్లలో నుండి వెలుగులోనికి తీసుకువచ్చేoదుకు ఒక ప్రవక్తను పంపాడు . మరెవరైతే అల్లాహ్ ను విశ్వసించి సదాచారణ చేస్తారో వారిని అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ)వనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు . నిశ్చయంగా అల్లాహ్ అతనికి అత్యుత్తమ ఉపాధిని వొసగాడు. ( సూరె అత్ తలాఖ్ 65 :11 )
సత్య ధర్మానికి ఇతర ధర్మాలన్నిటిపై విజయం చేకూర్చటానికి ఏతెంచినవారు
ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్యధర్మాన్నిఇచ్చి పంపాడు- దాన్ని మతధర్మాలన్నింటిపై ఆధిక్యం వహించేలా చేయటానికి! ఈ విషయం బహుదైవారాధకులకు ఇష్టంలేకపోయినా సరే. సూరా అస్ సఫ్ 61:9
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం ఏమిటి
విశ్వాసుల కోరకు కారుణ్యం
వివేకంతో , చక్కని హితబోధతో ఉత్తమోత్తమ విధానంలో వాదిస్తూ ధర్మమార్గం వైపు ఆహ్వానిస్తారు
అల్లాహ్ ను అమితంగా కీర్తిoచినవారు
హా మీమ్. సుస్పష్టమైన(ఈ) గ్రంథంసాక్షిగా! మీరు అర్థం చేసుకోవటానికిగాను మేము దీనిని అరబీ ఖురానుగా చేశాము. నిశ్చయంగా ఇది మాతృగ్రంథం (లౌహెమహ్‌ఫూజ్)లో ఉన్నది. మా వద్ద అది ఎంతో ఉన్నతమైన, వివేకంతోనిండిన గ్రంథంగా ఉన్నది. ఏమిటి? మీరు హద్దుమీరిపోయే జనులైనందున మేము ఈ ఉపదేశాన్నిమీ నుంచి మళ్లించాలా? మేము పూర్వీకులలో కూడా ఎంతోమంది ప్రవక్తల్ని పంపించాము. తమ వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు అతన్నిపరిహసించకుండా వదల్లేదు. మేము వీళ్ళ కన్నాఎక్కువ ఘటికులనే పట్టుకొని అంతమొందించాము. పూర్వీకుల దృష్టాంతాలు గడచి ఉన్నాయి. “కరుణామయుడు (అయిన అల్లాహ్) తలచి ఉంటే మేము వాళ్ళను పూజించేవారం కాము” అని (వీళ్లు కబుర్లు) చెబుతున్నారు. దీనికి సంబంధించి వీరికసలు ఏమీ తెలీదు. అవి కేవలం వీళ్ల ఊహాగానాలు మాత్రమే. సూరా అల్ జుఖ్ రుఫ్ 43:1-8,20; నీ ప్రభువు గొప్పతనాన్ని చాటి చెప్పు. సూరా అల్ ముద్దస్సిర్ 74:3
ఆయన్ని విశ్వసించాలని వాగ్దానం తీసుకోబడింది
అల్లాహ్ (తన) ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, ”నేను మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ఒసగిన తరువాత, మీ వద్ద ఉన్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి, అతనికి సహాయపడాలి” అని చెప్పాడు. తరువాత ఆయన, ”ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా?” అని ప్రశ్నించగా, ”మేము ఒప్పుకుంటున్నాము” అని అందరూ అన్నారు. ”మరయితే దీనికి మీరు సాక్షులుగా ఉండండి. మీతో పాటు నేనూ సాక్షిగా ఉంటాను” అని అల్లాహ్ అన్నాడు. సూరా ఆలి ఇమ్రాన్ 3 :81
మృదువుగా వ్యవహరిస్తారు
(ఓప్రవక్తా!) అల్లాహ్ దయవల్లనే నీవు వారి యెడల మృదుమనస్కుడవయ్యావు. ఒకవేళ నువ్వే గనక కర్కశుడవు, కఠిన మనస్కుడవు అయివుంటే వారంతా నీ దగ్గరి నుంచి వెళ్ళిపోయేవారు. కనుక నువ్వు వారి పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించు, వారి క్షమాపణ కోసం (దైవాన్ని) వేడుకో. కార్యనిర్వహణలో వారిని సంప్రదిస్తూ ఉండు. ఏదైనా పని గురించి తుది నిర్ణయానికి వచ్చినప్పుడు, అల్లాహ్‌పై భారం మోపు. నిశ్చయంగా అల్లాహ్ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు. సూరా ఆలి ఇమ్రాన్ 3: 159
విశ్వాసుల పాలిట గొప్ప కారుణ్యమూర్తి
అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే, ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకుని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు. వారిని పరిశుద్ధుల్ని చేస్తాడు. వారికి గ్రంథజ్ఞానాన్నీ, వివేకాన్నీ బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందైతే వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై ఉండేవారు. సూరా ఆలి ఇమ్రాన్ 3:164
విశ్వాసుల కోరకు కారుణ్యం
ప్రవక్తను బాధించేవారు కూడా వారిలో కొందరున్నారు. ”ఈయన చెప్పుడు మాటలు వినేవాడు” అని వారంటున్నారు. వారికి చెప్పు: ”ఆ వినేవాడు మీ మేలును కోరేవాడే. అతడు అల్లాహ్‌ను విశ్వసిస్తాడు. ముస్లింల మాటల్ని నమ్ముతాడు. మీలో విశ్వసించిన వారి యెడల అతడు కారుణ్యమూర్తి. దైవప్రవక్త (సఅసం)ను బాధించే వారికి బాధాకరమైన శిక్ష ఖాయం.”సూరా అత్ తౌబా 9:61
వివేకంతో , చక్కని హితబోధతో ఉత్తమోత్తమ విధానంలో వాదిస్తూ ధర్మమార్గం వైపు ఆహ్వానిస్తారు
నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ, చక్కని ఉపదేశంతోనూ పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు. నిశ్చయంగా తన మార్గం నుంచి తప్పిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. సన్మార్గాన ఉన్నవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు. సూరా అన్ నహ్ల్ 16:125
దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం చేసిన చివరి ప్రసంగం
623 C.E వ సంవత్సరం, మక్కా నగరం దగ్గర ఉన్న అరాఫాత్ మైదానంలో చేసిన ప్రసంగంలోని భాగం
అల్లాహ్ ను ప్రశంసించి, కృతజ్ఞతలు తెలిపిన తర్వాత, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సంబోధించారు (ప్రపంచం నలుమూల నుండి వచ్చిన దాదాపు లక్షన్నర స్త్రీ పురుషుల సమూహానికి చేసిన ఉపదేశం):
“ఓ ప్రజలారా ! శ్రద్ధగా వినే చెవిని నాకు అప్పుగా అప్పగించండి, ఎందుకంటే నేను ఈ సంవత్సరం తర్వాత మీ మధ్యన జీవించి ఉంటానో లేదో నాకు తెలియదు. కాబట్టి, నేను మీకు చెబుతున్న దానిని చాలా జాగ్రత్తగా వినండి మరియు ఈ పదాలను (సందేశాన్ని) నేడు ఇక్కడ హాజరు కాలేకపోయిన వారికి కూడా చేర్చండి
ధన ప్రాణాలు చాలా విలువైనవి
ఓ ప్రజలారా ! మీరు ఈ నెలను, ఈ దినమును పవిత్రమైనదిగా పరిగణించినట్లే, ప్రతి ముస్లిం జీవితాన్ని (ప్రాణాన్ని) మరియు సంపదను(ఆస్తిని) పవిత్రమైన విశ్వాస నిక్షేపంగా (నమ్మికగా) పరిగణించవలెను. మీ వద్ద నమ్మకంతో ఉంచిన వస్తువుల్ని, వాటి అసలైన యజమానులకు తిరిగి వాపసు చెయ్యవలెను. మీరు ఎవ్వరికీ హాని కలిగించ కూడదు, దాని వలన మీకెవ్వరూ హాని కలిగించరు. ‘నిశ్చయంగా మీరు మీ రబ్ (ప్రభువు) ను కలుసుకోబోతున్నారు మరియు ఆయన నిశ్చయంగా మీ కర్మల లెక్క తీసుకోబోతున్నాడు’ అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవలెను.
వడ్డీ నిషేధించబడింది
మీరు వడ్డీ తీసుకోవటాన్ని అల్లాహ్ నిషేధించాడు; కాబట్టి ఇక మీదట వడ్డీ వ్యాపారానికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ, హక్కులన్నీ రద్దు చేయబడినవి. మీ యొక్క అసలు మూలధనం మాత్రం మీరు తీసుకోవచ్చును. మీరు అసమానత్వాన్ని (హెచ్చుతగ్గులను, భేదాలను, వైషమ్యాలను) బలవంతంగా రుద్దకూడదు మరియు సహించకూడదు. వడ్డీ నిషేధించబడినదని అల్లాహ్ తీర్పునిచ్చినాడు మరియు అబ్బాస్ ఇబ్నె అబ్దుల్ ముత్తలిబ్ కు చెల్లించ వలసి ఉన్న మొత్తం వడ్డీ ఇక మీదట రద్దు చేయబడినది.
షైతాన్ మీ శత్రువు
షైతాన్ నుండి మీ ధర్మాన్ని కాపాడుకునేందుకు అప్రమత్తంగా (జాగ్రత్తగా) ఉండవలెను. అతడు పెద్ద పెద్ద విషయాలలో మిమ్ముల్ని తప్పు దారి పట్టించే శక్తి తనకు ఏ మాత్రం లేదని తెలుసుకుని,తన ఆశలన్నీ వదులుకున్నాడు. కాబట్టి చిన్న చిన్న విషయాలలో కూడా అతడిని అనుసరించకుండా అప్రమత్తంగా ఉండవలెను.
స్త్రీల హక్కులు
ఓ ప్రజలారా ! మీ స్త్రీలపై మీకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నమాట వాస్తవమే కాని వారికి కూడా మీ పై హక్కులు ఉన్నాయి. జ్ఞాపకం ఉంచుకోండి, కేవలం అల్లాహ్ పై ఉన్న విశ్వాసం ఆధారంగానే మరియు అల్లాహ్ యొక్క అనుమతి మూలంగానే మీరు వారిని తమ తమ భార్యలుగా చేసుకున్నారు.
మీ స్త్రీలతో మంచిగా ప్రవర్తించండి మరియు దయాదాక్షిణ్యాలతో వ్యవహరించండి ఎందుకంటే వారు మీ జీవిత భాగస్వాములు మరియు శ్రద్ధాభక్తులతో, సేవానిరతితో సహాయ సహకారాలందించే అంకితమైన సహాయకులు. ఒకవేళ వారు స్థిరంగా మీ హక్కులను పూర్తిచేస్తున్నట్లయితే, మీ నుండి దయతో ఆహారం (అన్నపానీయాలు) మరియు దుస్తులు పొందే హక్కు వారి స్వంతమవుతుంది. ఇంకా మీరు అనుమతించని (ఇష్టపడని) వారితో, వారు స్నేహంగా మెలగకూడదనేది మరియు తమ శీలాన్ని అస్సలు కోల్పోకూడదనేది (వ్యభిచరించకూడదు, తుంటరిగా ప్రవర్తించకూడదు) వారిపై మీకున్న హక్కు.
ఇస్లాం మూల స్తంభాలు
ఓ ప్రజలారా ! అత్యావశ్యకంగా నా మాట వినండి. కేవలం అల్లాహ్ నే ఆరాధించండి, ప్రతి దినపు ఐదు తప్పని సరి నమాజులను పూర్తిచేయండి, రమజాన్ నెలలో తప్పనిసరిగా ఉపవాసం ఉండండి మరియు తప్పనిసరి అయిన విధిదానం (జకాత్) పేదలకు పంచిపెట్టండి. ఒకవేళ మీకు తగిన శక్తిసామర్ధ్యాలు ఉన్నట్లయితే, హజ్ యాత్ర పూర్తిచేయండి.
న్యాయం, రుజుమార్గం
మొత్తం మానవజాతి ఆదం (అలైహిస్సలాం) సంతతి యే మరియు అరబ్ వాసులకు ఇతరులపై ఎటువంటి ఆధిక్యం లేదు మరియు ఇతరులకు అరబ్ వాసులపై ఎటువంటి ఆధిక్యం లేదు; అలాగే నల్లవారి పై తెల్లవారికి ఎటువంటి ఆధిక్యం లేదు మరియు తెల్లవారి పై నల్లవారికి ఎటువంటి ఆధిక్యం లేదు, కేవలం దైవభక్తి మరియు మంచి నడవడికలో తప్ప.
సోదరభావం
ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క ఇతర ముస్లింకు సోదరుడని మరియు ముస్లింలు సోదర భావాన్ని తప్పక స్థాపించాలని గ్రహించవలెను. తోటి ముస్లింలకు చెందిన వాటిపై, మీకు ఎటువంటి అధీనం (ఔరసత్వం) లేదు, కాని స్వతంత్రంగా మరియు మనస్పూర్తిగా వారు ఇష్టపడిమీకిస్తే తప్ప. కాబట్టి, ఈ విధంగా మీకు మీరే (ఇతరుల హక్కును గౌరవించకుండా) అన్యాయం చేసుకోవద్దు.
సత్య మార్గాన్ని వీడకూడదు
జ్ఞాపకం ఉంచుకోండి, ఒకరోజు మీరు అల్లాహ్ ముందు హాజరవబోతున్నారు. మీరు చేసిన ప్రతి పనికి, ప్రతి ఆచరణకు ఆ రోజున సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి, జాగ్రత్త ! నేను ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు సత్యమార్గానికి దూరం కావద్దు.
ధర్మం మరియు ప్రవక్తల పరంపర పూర్తిచేయబడింది
ఓ ప్రజలారా ! నా తర్వాత వేరే ప్రవక్త లేక వేరే సందేశహరుడు రాడు, ఏ క్రొత్త ధర్మమూ పుట్టదు. కాబట్టి వివేకంతో, జ్ఞానంతో, బుద్ధితో సరిగ్గా వ్యవహరించండి.
ఖుర్ఆన్ మరియు సున్నత్
ఓ ప్రజలారా ! ఇంకా, నేను మీకు తెలియజేస్తున్న ఈ పదాలను మంచిగా అర్థం చేసుకోవలెను – నేను నా వెనుక (నా తర్వాత) రెండు విషయాలను వదిలి వెళ్ళుతున్నాను, ఒకటి దివ్యఖుర్ఆన్ మరియు రెండోది నా నిదర్శనం (దృష్టాంతం, ఉదాహరణ (సున్నత్)మరియు మీరు ఈ రెండింటినీ గనుక అనుసరిస్తే, ఎట్టి పరిస్థితిలోను నశించిపోరు.
ఇస్లాం సందేశాన్ని ఇతరులకు తెలియజేయండి
నా వాక్కులు వింటున్నమీరందరూ, వీటిని ఇతరులకు చేర్చవలెను, ఇంకా ఆ ఇతరులు వేరే ఇతరులకు చేర్చవలెను. అలా విన్నవారిలో చిట్టచివరి తరం వారు, ఇప్పుడు నా నుండి ప్రత్యక్షంగా వింటున్న మీకంటే ఇంకా మంచిగా అర్థం చేసుకోవటానికి కూడా ఆస్కారం ఉన్నది.
ఓ అల్లాహ్ (ఏకైక దైవారాధకుడు)నేను నా కివ్వబడిన దివ్యసందేశాన్ని నీ ప్రజలకు అందజేసానని దీనికి సాక్ష్యం నీవే.