శ్రమైక జీవనం

Originally posted 2016-12-20 11:17:54.

ధర్మసమ్మత మయిన జీవనోపాధి కోసం మనం చేపట్టే ఏ వృత్తయినా ఉత్తమమ యినదే. అధర్మ సంపాదన ఉద్దేశ్యంతో చేసే ఏ పని అయిన నీచమ యినదే.

ధర్మసమ్మత మయిన జీవనోపాధి కోసం మనం చేపట్టే ఏ వృత్తయినా ఉత్తమమ యినదే. అధర్మ సంపాదన ఉద్దేశ్యంతో చేసే ఏ పని అయిన నీచమ యినదే.

చిన్న చీమల నోట మన్నును గని తెచ్చి కట్టిన అందాల పుట్టను చూడండి! మిలమిల మెరిసెడు జిలుగు దారాలతో అల్లిన సాలీని ఇల్లు చూడండి! గరిక పోచలు తెచ్చి తరు శాఖకు తగిల్చి గిజిగాడు కట్టిన గృహము చూడండి! తేనెటీగలు రూపుదిద్ది పెట్టిన తేనియ పట్టును చూడండి! శ్రమైక జీవన సౌందర్యానికి సమానమయినది లేనే లేదని తెలుస్తుంది. అందుకే ”మనిషి చేెతి సంపాదనకంటే గొప్ప సంపాదన మరొకటి లేదు. దైవప్రవక్త దావూద్‌ (అ) తన చేతి సంపాద నతోనే కడుపు నింపుకునేవారు” అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స). (బుఖారీ)  ఇస్లాం మనిషిని శ్రమకై పురి గొల్పుతుంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఏ మనిషికి ఆ మనిషి చేసుకున్నదే దక్కుతుంది. అతని శ్రమను అతను త్వరలోనే చూసుకుంటాడు”. (అన్నజ్మ్‌:39)

ఇస్లాం ధర్మసమ్మతమయిన ఉపాధిని అన్వేషించాలని ప్రోత్సహిస్తుంది:

”సో, మీరు నమాజు పూర్తవగానే భూమిలో సంచరించండి. అల్లాహ్‌ా అనుగ్రహాన్ని అర్జించండి”. (జుమా:10) అలాగే అల్లాహ్‌ా రాత్రిని విశ్రాంతి సమయంగా పేర్కొంటే, పగటిని పని వేళగా అభివర్ణించాడు.
ద్వితీయ ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ (ర) గారు తరచూ ఇలా అంటుండే వారు: ”అల్లాహ్‌ా మార్గంలో ప్రాణాలొడ్డి పోరాడటం వంటి బృహత్తర కార్యమయిన జిహాద్‌ తర్వాత ఏదయినా మార్గంలో ప్రాణాలు వదలడం నాకిష్టమయినది ఉంటే, నేను ధర్మసమ్మతమయిన జీవనోఫాధిని అర్జిస్తూ ఓ కనుమ గుండా వెళుతుండగా ఆ మార్గంలో నాకు మరణం సంభవించడం”. (తఫ్సీర్‌ ఇబ్ను కసీర్‌)
ఈ పుడమిపై నివసించే ప్రాణుల్లో మానవులు ఉత్కృష్ట జీవులయితే, మానవులందరిలో మహోత్కృష్ట జీవులు ప్రవక్తలు. అట్టి మహితాత్ములు కూడా చేతి పని చేసి బ్రతికేవారు. ఒకరు టైలర్‌ అయితే, ఒకరు కార్పెంటర్‌. ఒకరు కొలిమి పని చేసేవారయితే, ఒకరు గొర్రెల్ని మేపే వారు, ఇంకొరు బట్టలు అల్లేవారు. స్వయంగా దైవప్రవక్త (స) ఇలా అభిప్రాయ పడ్డారు: ”ప్రవక్తలందరూ గొర్రెలు మేపినవారే” అని ‘తమరు కూడా ఓ దైవప్రవక్తా!’ అని సహచరులు ఆరా తీశారు. అందుకాయన ”అవును నేను కూడా మక్కా వాసులు గొర్రెల్ని కొన్ని ఖీరాత్‌లకి బదులు మేపె వాడిని”. (బుఖారీ) అలాగే ఆయన పెద్ద య్యాక వ్యాపారం చేశారు. ఆయన (స) సహచరుల్లో కొందరు రైతుల యితే, కొందరు గొప్ప వ్యాపారవేత్తలు. కొందరు రోజు కూలీలయితే, కొందరు కొలిమి పని చేసేవారు. ఓ సారి ప్రవక్త (స) వారి పవిత్ర సన్ని ధికి కార్మిక సోదరుడొకడు వచ్చాడు. తన కుటుంబ పోషణ కోసం రాళ్ళు పగులగొట్టే కఠినమయిన పని చేయడం వల్ల అతని చేతులు కాయలు కాసి ఉన్నాయి. అది గమనించిన ప్రవక్త ఆ కార్మిక సోదరుని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడి శ్రామిక వర్గానికే గొప్ప కీర్తి ప్రసాదించారు శ్రమజీవుల శ్రేయం కోరిన శ్రేయోభిలాషి ముహమ్మద్‌ (స).
కువైట్‌లో ప్రవాసాంధ్రులుగా బతుకు బండి లాగుతున్న మనం జీవనో పాధిని వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చాము. కష్ట పడుతున్నాము, ఓ’ నాలుగు పైసలు వెనకేసుకుంటున్నాము. మనం చేపట్టిన వృత్తి ఏద యినా సరే అది నీచమయినది ఎంత మాత్రం కాదు. ధర్మసమ్మత మయిన జీవనోపాధి కోసం మనం చేపట్టే ఏ వృత్తయినా ఉత్తమమ యినదే. అధర్మ సంపాదన ఉద్దేశ్యంతో చేసే ఏ పని అయిన నీచమ యినదే. కాబట్టి మనం చేపట్టే పని ఏదయినా సరే అది ధర్మసమ్మతమ యినదై ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే, మనం చేసే కర్మలన్నీ మన సంకల్పాలపైనే ఆధార పడి ఉంటాయి.
ఓ సారి ప్రవక్త (స) మరియు ఆయన సహచరులు దారిన నడిచి వెళుతుంటే, ఓ వ్యక్తి తారస పడ్డాడు. అతనెంతగానో కష్ట పడి పని చేస్తున్నాడు. అది గమనించిన సహచరులు – ‘ఈ వ్యక్తి పడే శ్రమ అల్లాహ్‌ా మార్గంలో అయి ఉంటే ఎంత బావుండేది?’ అని పెదవి విరి చారు. అది విన్న కారుణ్యమూర్తి (స) ”ఒకవేళ అతను తన ఆలుబ్డిల్ని పోషించే నిమిత్తం కష్ట పడుతున్నట్లయితే అతను అల్లాహ్‌ా మార్గంలోనే కష్ట పడుతున్నాడు. ఒకవేళ అతను తన తల్లిదండ్రుల కోసం శ్రమిస్తు న్నట్లయితే అల్లాహ్‌ా మార్గంలో శ్రమిస్తున్నట్లే. ఒకవేళ అతను తన స్వయం పోషణ కోసం రెక్కలుముక్కలు చేస్తున్నాడంటే అతను అల్లాహ్‌ా మార్గంలో పరిశ్రమిస్తున్నట్లే. హాఁ ఒకవేళ అతను పేరుప్రఖ్యాతల కోసం ప్రదర్శనాబుద్ధితో, అహంతో కష్ట పడుతున్నట్లయితే అతను షైతాన్‌ మార్గంలో కష్ట పడుతున్నట్లు” అన్నారు. (తబ్రానీ)
కాబట్టి మనం మన మనో సంకల్పాన్ని సరి చేసుకోవాలి. మన జీవనోపాధి ధర్మసమ్మతమయినదయి ఉండేటట్లు కట్టుదిట్టమయిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, ”అధర్మ సంపాదనతో పోషించబడిన శరీరం నరకాగ్నికి ఆహుతవుతుంది” అని హెచ్చరించారు. అలాగే ”అధర్మ సంపాదను ఆరగించే వ్యక్తి మొరను అల్లాహ ఆలకించడు” అని కూడా వేరొక సందర్భంలో ప్రవక్త (స) సెలవిచ్చి ఉన్నారు.
”కృషి ఉంటే మనుషులు రుషులౌతారు, మహా పురుషులవుతారు, తరాతరాలకే తరగని వెలుగవుతారు” అన్నారు వెనుకటికి మన పెద్దలు. కసి కూడిన కృషి విజయాన్ని సాధించి పెడుతుంది. ”కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించండి” అన్నారు అబ్దుల్‌ కలామ్‌ గారు. కాబట్టి మన కృషి, మన శ్రమ మొత్తం ధర్మబద్ధమయినదయి ఉండేటట్లు చూసుకుంటే ఇటు ఇహమూ బాగు పడుతుంది. అటు పరమూ బాగు పడుతుంది.

Related Post