దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”అతి త్వరలో ఓ కాలం రానున్నది. ఆ కాలంలో ఇస్లాం (ధర్మం) నామ మాత్రంగా ఉండి పోతుంది. ఖుర్‌ఆన్ (దైవ గ్రంథ) పఠనం ఒక ఆచారంగా మిగిలి పోతుంది. ప్రజల ప్రార్థనా మందిరాలు (రకరకాల అలంకరణలతో) కళకళ లాడుతుంటాయి. కానీ సన్మార్గం, హితబోధల రీత్యా నిర్మానుష్యంగా, నిర్జీవంగా ఉంటాయి. అప్పటి వారి ధర్మవేత్తలు ఆకాశం క్రింద (లోకంలో) ఉండేవారందరిలోకెల్లా అతి నికృష్టు లవుతారు. వారి వల్ల ఉపద్రవాలు (సంక్షోభాల, సమస్యల సుడిగుండాలు) జనిస్తాయి. తరువాత అవి వారిని సైతం చుట్టుముడుతాయి.” (బైహఖీ)
‘మతం అంటే మత్తు మందు’ మత గురువులంటే ‘వంచకులు’ అనే భావజాలం ప్రబలుతున్న దినాలివి. ఇటువంటి పరిస్థితిలో నిజానిజాలను బైట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజమైన మతధర్మం అంటే మానవత్వమని, దోపిడి చేసేది, ధనార్జన లక్ష్యంతో సాగేది, జన వంచనతో వృద్ధి చెందాలనుకునేది అసలు మతం కాదని, అదో ఉన్మాదం, ఉపద్రవం, పచ్చి మోసమని చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అవును మతధర్మం జనోద్ధరణ కోసమేగానీ ధనార్జన కోసం ఎంతమాత్రం కాదు. దైవ ప్రవక్తలందరూ వచ్చింది మానవ కళ్యాణం, లోక శాంతి కోసమే. ముఖ్యంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స). అనేక విధాల హెచ్చతగ్గులున్న, అసమానతలున్న, అస్పృశ్య తలున్న సమాజాన్ని అన్ని విధాల సంస్కరించి
అందరినీ ఒకటిగా చేసి శాంతి- సౌభ్రాతృత్వాలు-సమానత్వం స్థాపించడానికే మహా ప్రవక్త (స) వచ్చారన్నది ఆయన చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మహా ప్రవక్త (స) వారు మొదట నుండీ పీడిత జనాల పక్షం వహించారు. ఆయన దళిత జనాల కోసమే వచ్చారు. ‘సాటి మనిషి అవసరాన్ని మీరు తీర్చండి. దేవుడి మీ అవసరాలన్నింటినీ తీరుస్తాడు’ అన్నారు. ‘మంచిని బోధించేవాడు స్వయంగా మంచి చేసినవాడితో సమానం’ అన్నారు. ‘ప్రజల సొమ్ముల్ని అన్యాయంగా దోచుకు తినేవారు తమ కడుపుల్ని నరకాగ్నితో నింపుకుంటున్నారు’ అని హెచ్చరించారు.
అయితే నేడు మన సమాజంలో మతం పేరుతో ప్రబలుతున్న వికృత చేష్టలను చూసినవారికి సహజంగానే విసుగు, చిరాకు కలుగుతుంది. సంఘ శ్రేయోభిలాషులు, శాంతి కాముకులు ఆశించిన సమాజం ఇదేనా? అంటే ‘కాదు’ అనేది నిజాయితీతో కూడిన సమాధానం. ఏళ్ళ తరబడి అంతర్మథనం చెందిన ఓ సోదరుడు తన గాధను ఇలా చెప్పుకు వచ్చాడు-
కొందరు మంచి ధార్మిక అవగాహన గల విద్యార్థుల సహచర్యం వల్ల క్రమేణా నిజానిజాలను తెలుసుకోగలిగాను. ఆ మధ్యనే డా.అంబేద్కర్ గారి మాటలు నా కంట పడ్డాయి. ”వేలాది మంది ముస్లింలు పీర్ల దగ్గరకు వెళ్ళి కానుకలు సమర్పించుకుంటారు. వాస్తవానికి కొన్ని చోట్ల ముస్లిం పీరుకు వంశపారంపర్యంగా పౌరోహిత్యం చేస్తూ పీరు దుస్తులు ధరిస్తున్న బ్రహ్మణులున్నారు. ఇక గుజరాత్, పంజాబ్ విషయానికొస్తే – లగకణులు రాజపుత్ర, జాట్, బనియాల సంతతికి చెందినవారు ఒకరినొకరు నమస్కారం చేసుకునేటప్పుడు ‘రాం రాం’ అనే అంటారు. మసీదుకు తరచుగా వెళ్తుంటారు. ‘సుంతీ’ చేయించుకుంటారు. శవాలను ఖననం చేస్తారు. అటువంటిదే మరో వర్గం – ‘మోమన్లు’ సుంతీ పాటిస్తారు. శవాలను ఖననం చేస్తారు. గుజరాతీ భాషలో చదువుతారు. కాని ఇతర అన్ని సందర్భాల్లో భారతీయ విగ్రహారాధకుల్లానే ప్రవర్తిస్తారు”.
ఈ పంక్తులు చదివాక ఇస్లామీయ చరిత్రను, ఖుర్‌ఆన్ మరియు హదీసులను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్న తపన నాలో మొదలయ్యింది. అలా నా సత్యాన్వేషణ ప్రారంభమయింది. తరువాత చరిత్రతో పాటు ఖుర్‌ఆన్, హదీసులను చదివి క్రమంగా మారుతూ, నన్ను నేను ప్రశ్నించుకుంటూ నిజమైన ముస్లింని అయ్యాను.
”పుట్టే బిడ్డ ఎవరి ఇంట్లో పుట్టినా – తను మాత్రం ప్రకృతి ధర్మంపైన్నే పుడుతుంది’ అన్నది జగమెరిగిన సత్యం. జగత్ప్రవక్త చెప్పిన సత్యం. అయితే పిల్లవాడు పుట్టాక వారికిష్టమొచ్చిన మార్గంలోకి మార్చుకుంటారు. ఈ వాస్తవాన్ని చాలా ఆలస్యంగా తెలుకున్న నేను చాలా తొందరగానే వాటన్నింటికీ స్వస్తి పలికాను. అల్‌హమ్దులిల్లాహ్! ఇప్పుడు నాలో ఎలాంటి అపచారాలు, మూఢ విశ్వాసాలు లేవు. భవిష్యత్తులో ఇలా జరుగుతుందన్న భయంతోనే దైవ ప్రవక్త (స) ఇలా హెచ్చరించారు: ”నా సమాధిని జాతర స్థలంగా, సంబరాల కేంద్రంగా చేయకండి”. (అబూ దావూద్)
(సోదరులారా! ప్రవక్తలందరి నాయకులైన అంతిమ ప్రవక్త (స) వారి సమాధినే జాతర స్థలంగా, ఉత్సవ స్థలిగా చేసుకోవడం తప్పయినప్పుడు ధార్మిక వ్యక్తుల సమాధుల్ని ప్రదక్షిణా కేంద్రంగా మార్చుకోవడం ఎంతవరకు సమంజసం? ”ప్రవక్తల సమాధుల్ని సజ్దా నిలయాలుగా చేసుకున్నందుకు దేవుడు వారిని శపించాడు” అని ప్రవక్త (స) అంటుంటే మనం పుణ్యాత్ముల సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం అవివేకం! అర్థ రహితం!! విడ్డూరం!!! ప్రవక్తల్ని పూజించినందుకు వారు నరకవాసులైతే పుణ్యాత్ముల్ని దైవ భాగస్వాములుగా నిలుపుతున్న మనం నేరుగా స్వర్గానికి చేరుకుంటామా? మీరే ఆలోచించండి! మానవ చరిత్రను పరిశీలిస్తే మానవుడు ప్రకృతి వైపరీత్యాలకు భయపడి, అవగాహన లేమి, అజ్ఞానంతో ప్రకృతిలోని అనేకానేక వస్తువులను దైవంగా భావించి పూజించినట్లు గ్రహిస్తాం. ఉదాహరణకు: అగ్ని, వాయువు, వాన, సూర్యచంద్ర నక్షత్రాలు, పాములు…. మొదలైనవాటిని పూర్వం నుండి ప్రపంచపు అన్నీ ప్రాంతాల్లోనూ మనిషి పూజిస్తూ వస్తున్నాడు. వీటిలో ఏ ఒక్కటీ దైవం కాజాలదన్న విషయం ఆలోచనా శక్తిగల ఎవరికైనా ఇట్టే బోధపడుతుంది. కాబట్టి శక్తివంతుడైన మనిషి శక్తిహీనమైన, కదలిక లేని జడపదార్థాల ముందు తలవంచడం స్వయంగా అతనికే అవమానకరం! ఇది అన్ని విధాల మూర్ఖత్వం, అవివేకమే అవుతుంది.
ఒక హైందవ వ్యక్తి బాధతో చెప్పుకున్న ఉదంతం ఇది:
నా బాల్యంలో జరిగిన సంఘటన. ఒక్కసారి నిద్రలేస్తూ పిల్లి ముఖం చూశాను. మా అమ్మ అది అశుభమని చెప్పి, మళ్ళీ ఇంకోసారి పడుకుని లేవమంది. మా అమ్మ దృష్టిలో – ఆదివారం అమావాస్య, కాకి, పిల్లి, తుమ్ము, తలంటుకున్నరోజు ఊరు దాటడం,
వితంతువు ఎదురు రావడం – ఇవన్నీ అపశకునాలు, అశుభాలు. కాకపోతే వితంతువు అయిన నా సొంత చెల్లెలు ముఖం చాలా సార్లు చూడవలసివచ్చేది. ఎదిరించి అడుగుదాం అంటే – అపచారం అని నా నోరు నొక్కేసేది మా అమ్మ. ఆ తర్వాత బాగా పరిశీలించాక తెలిసింది – ఇవన్నీ వట్టి బూటకాలని.
అలాగే నా చిన్నప్పుడు మా ఊరికి ఓ దగాకోరు దేవుడొచ్చాడు. కుతూహలంతో అతనితో కలిసి ఊరంతా తిరిగాను. అతను అర చేతులు చూసి జాతకం చెప్పేవాడు. అతను చెప్పేది నేను చాలా జాగ్రత్తగా వినేవాడిని. అతను అందరికి ఒకేలాగున చెప్పేవాడు. ముందు మంచిగా చెప్పి, తర్వాత ఏదో ఒక దోషం అంటగట్టేవాడు. ఏ దోషమూ తోచనప్పుడు ‘వాస్తు దోషం’ వారి మీద బలవంతాన రుద్దేవాడు. జనం భయపడి ఆ దోషం పోవడానికి అతని దగ్గర విభూది, వేరు ముక్కలు కొనుక్కునేవారు. అప్పట్లో ఆ దగాకోరు దేవుడు బాగానే డబ్బు లాగాడు. ముఖ్యంగా స్త్రీల నుండి. ఆ తర్వాత నేను ఎదిగినకొద్దీ ఇవన్నీ కూటి కొరకు నేర్చుకున్న విద్యల్లో ఒకటని గ్రహించాను.
అప్పటి నుండి ఈ దగాకోరు దేవుళ్ళ మీద పూర్తిగా నమ్మకం పోయింది. ‘స్వామి ధర్మ తీర్థ’ మాటల్లో చెప్పాలంటే – దేవాలయాలు మనం
ఎట్లా రూపొందిస్తే అట్లా తయారవుతాయి. అవిగాని, వాటిలోని శిలాప్రతిమలుగాని వాటంతట అవి మంచీ చేయలేవు. చెడూ చేయలేవు. మనం బుద్ధీహీనులమైతే పూజారులు దేవాలయాల్ని ఉపయోగించుకుని విగ్రహా రాధనని ప్రోత్సహించి మూడ విశ్వాసాలని పెంచి పోషిస్తారు. అమాయక జనాన్ని దోపిడీ చేస్తారు. మనం తెలివైన వారిమైతే దేవాలయాలను ఉపయోగించి ప్రజల జీవితాలను తీర్చిదిద్దవచ్చు. కులం విభేదాలను రూపుమాపవచ్చు. వాళ్ళను సమైక్యపర్చవచ్చు.అందుకు దేవాలయాలను ప్రజల విద్యను బోధించే ఆరామాలుగా మార్చి ప్రజల పురోభివృద్ధి, పౌరోభివృద్ధి కోసం ఉపయో గించాలి.
భారత దేశానికి కులం, అస్పృశ్యతల బదులు సహోదరత్వం అపూర్వ సమానత్వం కావాలి. ప్రజలందరి మధ్య ఐక్యత కావాలి. 33 కోట్ల మంది దేవుళ్ళు, 54 కోట్ల మంది భగవానులు, దెయ్యాలు వారి భార్యలు, వారికి పెట్టే విభిన్న నైవేద్యాల సమాజం పోయి ఒకే శాస్త్రీయమైన (అందరికీ ఆమోదయోగ్యమైన, అందరూ సులభంగా ఆచరించదగిన) ఆలోచన కావాలి.
(హిందూ సామ్రాజ్యవాద చరిత్ర)
ఇంకో వ్యక్తి ఇలా అంటారు- నేను క్రైస్తవ సమాజంలో పెరిగిన వాడిని. బాల్యంలో మా చిట్టి బుర్రలకు అర్థం కానీ అనేకానేక ప్రశ్నలుండేవి. ప్రశ్నించేందుకు ప్రయత్నించి నప్పుడల్లా ‘బైబిల్‌ని ప్రశ్నించినవాడు సాతాను శోధకుడు’ అని మా నోర్లు మూసేసేవారు.
అలాగే ‘ఇది ఏసు రక్తం, ఇది ఏసు మాంసం’
అంటూ తినిపించే సజ్జ రొట్టెలు త్రాగించే పానకం మాకు మింగుడు పడేవి కావు. రక్తం…! మాంసం….!! అందులోనూ ఆ ప్రేమమూర్తి రక్తం…! ఆ దయాస్వరూపుడి మాంసం…!! మనం తినడమేమిటి అనే ప్రశ్న మమ్మల్ని నిద్రపోనిచ్చేది కాదు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉబికివచ్చినా ‘ఫాదర్’ ఎక్కడ
‘సాతాను శోధకుడు’ అని నామకరణం చేస్తాడోనని అడిగే ధైర్యం, తెగింపు లేకపోయేవి. చివరికి నా దృష్టి యేసువారి ఈ వాక్యాలపై పడింది. ఆయన ఇలా అన్నారు:
శాస్త్రుల గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువటంగీలు ”ధరించుకొని తిరుగగోరుచు సంత వీధుల్లో వందనములను, సమాజ మందిరములలో అగ్ర పీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగుచు, మాయవేషముగా ధీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి మరి విశేషముగా శిక్ష
పొందుదురు”. (లూకా-25:45-47)
ఇలా ధర్మాన్ని ధనార్జన మార్గంగా మార్చుకున్నవారు ఏ వర్గానికి చెందిన వారైనా వారు చట్టం రీత్యా శిక్షార్హులు. ‘చట్ట తన పని తాను చేసుకుపోతుంది’ అన్నది ఎంత వరకు నిజమో గానీ మనం మాత్రం సభ్య సమాజ పౌరులుగా చేయగలిగింది చెయ్యాలి. లేకపోతే ఆ పరమ దాత రేపు మనల్ని నిలదీ స్తాడు.
మహా ప్రవక్త (స) వారు ప్రభవింపజేయడానికి కారణం కూడా ఇదే. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఉమ్మీ ప్రవక్త ప్రస్తావన వారి దగ్గరున్న తౌరాత్ సువార్త గ్రంథాలలో కూడా ఉంది. అతను మంచి పనులు చేయమని (ప్రజలను) ఆదేశిస్తాడు. (వారిని) చెడుల నుండి వారిస్తాడు. వారి కోసం పరిశుద్ధ వస్తువుల్ని ధర్మసమ్మతం చేస్తాడు. అశుద్ధ వస్తువుల్ని నిషేధిస్తాడు. వారి మీద పడిన (లేనిపోని ఆంక్షల) భారాన్ని తొలగిస్తాడు. వారు చిక్కుకున్న (దురాచార) బంధనాల నుండి వారికి విముక్తి కలిగిస్తాడు. కనుక ఎవరైతే అతడ్ని విశ్వసించి సమర్ధించి అతనితో సహకరిస్తూ, అతనిపై అవతరించిన (ఖుర్‌ఆన్) జ్యోతిని అనుసరిస్తారో వారే సార్ధక జీవులు. వారినే విజయం వరిస్తుంది”. (ఆరాఫ్; 157)