Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

దయా సాగరుడు

 

అపార కృపాశీలుడు అల్లాహ్‌

అల్లాహ్‌ జాలి, కరుణ, ప్రేమ, దయ, దీర్ఘ శాంతము, విస్తారమైన కృపా గుణములు గల దేవుడు. ఆయన సమస్త ప్రాణుల పట్ల కృప చూపువాడు. దోషమును, పాపాన్ని, అపరాధాన్ని క్షమించువాడు. అయితే ఆయన దోషులను నిర్దోషులుగా, విశ్వాసులను అవిశ్వాసులుగా, సత్యవంతులను అసత్య వాదులుగా, శాంతి కాముకులను శాంతి విఘాతకులుగా, సాత్వికులను మౌఢ్యులు, తామసికులుగా ఏ మాత్రం ఎంచడు. అల్లాహ్‌ా అధిక స్తోత్రాలకు అర్హుడు. అన్ని విధాలా పొగడ్తలు సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్‌ాకే శోభిస్తాయి. ఆయన మహత్య్మము గ్రహింపశక్యము కానిది. రాజాధిరాజు అయిన అల్లాహ్‌ దయా దాక్షిణ్యాలు గలవాడు. ఆయన దీర్ఘ శాంతుడు. కృపాగుణము గలవాడు. ఆయన అందరికీ ప్రభువు, మహోపకారి. ఆయన కారుణ్య వాత్సల్యాలు, కనికరములు సమస్త సృష్టి మీద ఉన్నాయి. కనుకనే ఆయన ఖుర్‌ఆన్‌ వంటి మహత్తర, మహిమాన్విత, మహోన్నత, మహోజ్వల గ్రంథాన్ని మానవాళికి అందజేశాడు.

”మానవులారా! మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి హితోపదేశం వచ్చేసింది. అది హృదయ రుగ్మతలకు స్వస్థత, నివారిణి. గ్రహీతల పాలిట మార్గ దర్శకత్వం, కారుణ్యం. (ప్రవక్తా! వారికి) చెప్పు: అల్లాహ్‌ా తన ప్రత్యేక అనుగ్రహం వల్ల, తన విశేష కారుణ్యం వల్ల దానిని పంపాడు. అందుగ్గాను ప్రజలు సంబర పడాలి. జనులు కూడబెట్టే వాటన్నింటి కంటే అది ఎంతో మేలైనది”. (దివ్యఖుర్‌ఆన్‌- 10: 57,58)
-‘అల్లాహ్‌ 70 తల్లుల కన్నా ఎక్కువ ప్రేమ గలవాడు’ అన్నారు ప్రవక్త (స). అల్లాహ్‌కు క్షమించడం ప్రియం.శిక్షించడం అప్రియం. అయితే బహు దైవారాధన (షిర్క్‌)ను మాత్రం ఆయన ఎన్నటికీ క్షమించడు.

మొరలనాలకించు మహోన్నత ప్రభువు అల్లాహ్‌

సార్వభౌమాధికారి అయిన అల్లాహ్‌. పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు. క్రుంగిపోయిన వారందరినీ చేయూత నిచ్చేవాడు. సమస్త ప్రాణులు ఆయన మీదే ఆధారపడి ఉన్నాయి. సమస్త జీవుల నేత్రాలు ఆయన వైపే ఆశతో చూస్తున్నాయి. సకాలంలో వాటన్నిటికి ఆహారం అందేలా చేసేవాడు అల్లాహ్‌ాయే. ఆయన తన కృపతో ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడు. తన దాసులతో కృపతో వ్యవహరించేవాడు. తనను మొర పెట్టుకునే వారందరికీ అత్యంత సమీపముగా ఉండేవాడు. తనయందు భయభక్తులు కలవారి మనోరథాన్ని ఆయన ఈడేరుస్తాడు. వారి మొరలను ఆలకించి వారిని కాపాడుతాడు. తన్ను ప్రేమించే వారందరినీ కీడు నుంచి

రక్షిస్తాడు. అయితే దుర్మార్గులను ఆయన శిక్షిస్తాడు.
మనం కూర్చోడం, లేవడం ఆయనకు తెలుసు. మనలో తలంపు పుట్టుక ముందే ఆయన మన అంతరంగాన్ని గ్రహిస్తున్నాడు. మన నడకను, నడ వడికను, ప్రవర్తనను, పరివర్తనను ఆయన పరిశీలిస్తున్నాడు. మన బాధల గురించి బహు బాగా తెలిసినవాడు. మన నోట మాట రాక పూర్వమే మన ఉద్దేశాలను ఆయన పసిగడతాడు. ఆయన మనల్ని అన్ని దిశల నుండి ఆవరించి ఉన్నాడు. ఆయన దూతలు మనల్ని నిరంతరం కనిపెట్టుకొని ఉన్నారు. మన చర్య ప్రతి చర్యలను కిరామన్‌ కాతిబీన్‌, రఖీబ్‌ – అతీద్‌లు లిఖిస్తున్నారు. ఆయన దీవెనలు సదా సత్యవంతులకు ఉంటాయి. ఆయన సన్నిధి, ఆజ్ఞాపరిధి నుండి మనం ఎక్కడికి పారిపోగలము? మనం పక్షుల్లా ఆకాశ వీధిలో విహరించిననూ ఆయన అక్కడ ఉన్నాడు. మనం మరో జీవిగా మారి పాతాళంలో నిద్రిస్తున్నా ఆయన అక్కడ
ఉన్నాడు. మనకు చీకటి అన్పించేది ఆయనకు పగటి వెలుగుగా ఉంటుంది. ఆయనకు వెలుగు చీకట్లు రెండూ ఏకరీతిగా ఉంటాయి. మన తల్లి గర్భమున మనల్ని నిర్మించినవాడు, అందంగా మన ఆకారాల్ని మలచినవాడు ఆయనే. ఆయన కార్యాలన్నీ బహు విచిత్రమైనవి. ఆశ్చర్యానికి గురి చేసేవి. ఆయనే మనల్ని మూడేసి చీకటి పొరల లోపల – మాతృగర్భాల్లో ప్రాణం పోసింది. మనకు చెవులిచ్చినవాడు, కళ్ళిచ్చినవాడు, హృద యాలిచ్చినవాడు ఆయనే. రేపు ప్రళయ దినాన మానవుని కుళ్ళిపోయిన ఎముకల్ని జత చేయువాడు, అతని వ్రేళ్ళ కొనలను సైతం సముచితమైన రీతిలో రూపొందించగల సమర్ధుడు అల్లాహ్‌ా. మన జీవిత క్షణాలన్నీ ఆయన గ్రంథంలో నమోదయి ఉన్నాయి. మన దేహ నిర్మాణం గురించి ఆయన అందజేసిన సమాచారం బహు వైజ్ఞానికంగా తోస్తుంది. చూడండి:

”మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము. తర్వాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా మార్చాము.. ఆ తర్వాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము. ఆపైన ముద్దను కండగా చేశాము. ఆ తర్వాత మాంసపు కండను ఎముకలుగా చేశాము. ఆ తర్వాత ఎముకలకు మాంసాన్ని తొడిగించాము. ఆపైన దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము. కనుక అల్లాహ్‌ా ఎంతో పరిశుద్ధుడు. సృజనకారులందరిలోకెల్లా ఉత్తమ సృజన కారుడు”. (దివ్య ఖుర్‌ఆన్‌- 23: 12-14)

కాబట్టి, మనం అల్లాహ్‌ వాక్కును శ్రద్ధగా విని, శ్రవణానందంతో దాని మృదు మాధుర్యాన్ని ఆస్వాదించి, ఆయన కిష్టమైనది, ఆయన దృష్టిలో న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడులన్నింటినీ శిరసావహించిన యెడల ఆయన మనల్ని అన్ని విధాలా కాపాడి సంరక్షిస్త్తాడు. మన మొరలను ఆలకిస్తాడు. ఒకవేళ మనం అధర్మమైనది తింటూ, తొడుగుతూ, త్రాగుతూ, త్రుళ్ళుతూ దైవాన్ని వేడుకుంటే ఆయన మన మొరల్ని ఆలకించకపోగా, మనపై శిక్షాగ్నిని కురిపిస్తాడు. కనుక వీలైనంత త్వరగా మనం ఆయన వైపునకు మరలాలి. ఆయన్ను క్షమించమని ప్రాధేయపడాలి. ఆయన మనకు ఇలా పిలుపునిస్తున్నాడు:

(ఓ ప్రవక్తా! నా తరఫున వారికి ఇలా) చెప్పు: ”తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లా కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ పాపాలన్నింటినీ క్షమిస్త్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు. అపారంగా కరుణించే వాడు”. (జుమర్‌: 53)

”(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని మొరను ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు నా ఆదేశాల్ని శిరసావహించాలి. నన్ను విశ్వసించాలి. తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలరు”.
(అల్‌ బఖరా: 186)

నీతిని ప్రేమించే నిజ దేవుడు అల్లాహ్‌
సర్వోన్నతుడైన అల్లాహ్‌ నీతిమంతులను పరికిస్తాడు, ప్రేమిస్తాడు. దుష్టులును, బాలాత్కారాసక్తులును ఆయనకు అప్రియము, అసహ్యము. దుష్ట జనుల మీద ఆయన శిక్షాగ్ని కురిపిస్తాడు. అగ్ని గంథకములును వడగాలియు వారికి పానీయ భాగమవుతాయి. సార్వ భౌమాధికారి అయిన అల్లాహ్‌ా నీతి మంతుడు. ఆయన నీతిని, న్యాయాన్ని ప్రేమిస్తాడు. యదార్థవంతులు, సత్య ప్రియులు రేపు ప్రళయ దినాన స్వర్గంలో ఆయన ముఖ దర్శనము చేస్తారు.

Related Post