Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

హిరా గుహలో నెరవేరిన బైబిల్‌ ప్రవచనం

విగ్రహారాధనలో నిండా మునిగిపోయిన 'వాదులు' దానిని విడచి ఏక దైవం వైపుకి రమ్మని పిలుపునిస్తున్న ప్రవక్త (స)ను ప్రతివాదిగా భావించి, మట్టుపెట్టు (సంహరించు)ట ద్వారా కీడు చేయాలనే వారి ప్రయత్నం నెరవేరలేదు.

విగ్రహారాధనలో నిండా మునిగిపోయిన ‘వాదులు’ దానిని విడచి ఏక దైవం వైపుకి రమ్మని పిలుపునిస్తున్న ప్రవక్త (స)ను ప్రతివాదిగా భావించి, మట్టుపెట్టు (సంహరించు)ట ద్వారా కీడు చేయాలనే వారి ప్రయత్నం నెరవేరలేదు.

(వ్యాస రచయిత సత్య ప్రేమికులు. సత్యామృతాన్ని ఆస్వాదించిన ధన్యులు. పూర్వాశ్రమంలో ఉండవల్లి నరసింహారావుగా పరిచితులు. దరిమిలా క్రైస్తవ మతం గ్రహించి పాస్టర్‌ యోసేపుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. 1990 – 93లో క్రైస్తవ మత శాఖ తెలుగు బాప్టిస్టు సంఘాలలోను, 2002 – 2005 మధ్యకాలంలో మార్టిన్‌ లూథర్‌ స్థాపించిన ఆంధ్ర ఇవాంజికల్‌ లూథరన్‌ సంఘాలలోనూ పరిచర్యగా ఉన్నారు. ఆ తర్వాత 2005 డిశంబరులో ‘సాక్ష్య వచనం’ పలికి ఇస్లాం ధర్మం స్వీకరించారు. ప్రస్తుత నామధేయం . 40 ఏండ్ల అబ్దుర్రజాక్‌ గారు విద్యావంతులు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలోని ఒక గ్రామంలో ఉపాధ్యాయునిగా పనిచేస్త్తున్నారు. మంచి రచయిత, కవి కూడా. వీటన్నింటికీతోడు మనసున్న మంచి మనిషి. వినమ్రులు. కారుణ్య ప్రభువైన అల్లాహ్‌ ఈయనగారికి సన్మార్గంలో సహనస్థయిర్యాలను ప్రసాదించాలని, ఈయన కలము నుండి మరిన్ని గొప్ప రచనలు జాలు వారాలని ప్రార్థన! – ఎడిటర్‌)

మసీహు (ఏసు క్రీస్తు) (అ) ప్రభవించడానికి పూర్వం సుమారు 740 వ సంవత్సరం నుండి 701 వ సంవత్సరం వరకు రమారమి 39 ఏండ్లపాటు అల్లాహ్‌ా తన దాసుడు మరియు ప్రవక్తయైన యెషయా (అ) ద్వారా పలికిన వాక్కు ”నీవు దీనిని చదువమని చెప్పి అక్షరములు తెలియనివానికి దానిని అప్పగించును. అతడు – అక్షరములు నాకు తెలియవనును. బైబిల్‌గా పిలువబడుచున్న గ్రంథములో పాత నిబంధనల గ్రంథమున గల యెషయా 29వ అధ్యాయము: 12వ వచనం).
మహోన్నతుడు, మహిమాన్వితుడు, కేవలం తన సత్యము చేతనే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తయైన అల్లాహ్‌ాకే సకల ప్రశంసలు, పొగడ్తలు శోభిస్తాయి. ఆయన తన దాసుని ద్వారా పలికిన వాక్కును సుమారు 1300 ఏండ్ల తర్వాత ఒక శుభప్రదమైన రమజాను మాసంలో శుక్రవారము (క్రీ.శ. 12 రోజు ఫిబ్రవరి నెల 610వ సంవత్సరము) నాడు తన దూతయైన జిబ్రయీల్‌ (గాబ్రియేల్‌) (అ) ద్వారా హిరా గుహలో నెరవేర్చిన అద్భుతశాలి, మహా వివేకి, సర్వ జ్ఞాన సంపన్నుడైన అల్లాహ్‌ తన దాసుడు మరియు ప్రవక్త, విశ్వ కారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స) యెడల జరిగించిన మహిమ, వహీ అవతరణను గూర్చి అవగాహన గలవారందరికీ సుపరిచితమే.
మనిషికి తాను ఎరుగని జ్ఞానాన్ని కలం ద్వారా నేర్పిన ఎంతో ఉదారుడు, సర్వ సృష్టికి ప్రభువైన అల్లాహ్‌ా వాక్కు: ”కీడు చే యత్నించుచూ గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకోవలెనని ఉరినొడ్డుచు, మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయు వారు నరకబడుదురు. (యెషయా-29:21)

అంతిమ దైవప్రవక్త (స)కి నాటి అరబ్‌ సమాజానికి ఏదైనా వ్యాజ్యము ఉన్నది అంటే మనో కాంక్షల దాస్యం, తమ పూర్వీకుల ఆచారాల దాస్యం, అల్లాహ్‌ాని తప్ప ఇతరుల దాస్యం అనే షిర్క్‌లో కూరుకుపోయిన వారిని ‘తౌహీద్‌’ వైపునకు ఆహ్వానించడమేగా!
విగ్రహారాధనలో నిండా మునిగిపోయిన ‘వాదులు’ దానిని విడచి ఏక దైవం వైపుకి రమ్మని పిలుపునిస్తున్న ప్రవక్త (లి)ను ప్రతివాదిగా భావించి, మట్టుపెట్టు (సంహరించు)ట ద్వారా కీడు చేయాలనే వారి ప్రయత్నం నెరవేరలేదు. తమ మనో కాంక్షలు, తమ పూర్వీకుల ఆచారాల పాటింపు విషయంలో తమను గద్దించుచున్న ప్రవక్త (స) ను ఏలాగైనా దేవుని గుమ్మము కాబా మస్జిదులో పట్టుకోవలెనని కుట్ర పన్నిన సంగతి, వారి కోసం నరక దూతలను పిలిచే విషయం దేవుడు బయల్పరచాడు. ఈ సంఘటన తర్వాత ”చంచల బుద్ధిగలవారు వివేకులవుదురు. సణుగు వారు ఉపదేశమునకు లోబడుదురు”(యెషయా- 29: 24)
అను ప్రవచన నెరవేర్పుగా జరిగిన వృత్త్తాంతములను పరిశీలించినచో నాటి అరబ్‌ సమాజము ప్రవక్త (స) బోధనల ద్వారా వివేకియైనవారుగా, దేవుని ఉపదేశములకు లోబడినట్లుగా గమనించ గలము.
ఒకే దేవుడు, ఒకే వహీ – వివిధ జాతులు – వివిధ కాలాలు, వివిధ ప్రవక్తలు ఆదం (అ) మొదలుకొని ముహమ్మద్‌ (స) వరకు తెచ్చిన సందేశ సారాంశము ఒక్కటే; అదే ‘తౌహీద్‌’. అందువలన భవిష్యత్‌ కాలములో ఉద్భవింపజేయబోవు ప్రవక్తలను గురించి ముందుగానే ప్రకటించటం దేవుడు ఎన్నుకొన్న విధానం. కనుక అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (లి) గురించి అల్లాహ్‌ా ప్రకటించిన లక్షణాలను పరిశీలించండి.

1) ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు.
2) అతని యందు నా ఆత్మను ఉంచి యున్నాను.
3) అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును.
4) అతడు కేకలు వేయడు, అరువడు. తన కంఠ స్వరమును వీధిలో వినబడనియ్యడు.
5) నలిగిన రెల్లును అతడు విరువడు.
6) మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు.
7) అతను సత్యముననుసరించి న్యాయమును కనబరుచును.
8) భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు.
9) ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును.
”ఆకాశములను సృజించి, వాటిని విశాల పరచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనములకు ప్రాణమును, దానిలో నడుచువారికి జీవితాత్మను ఇచ్చుచున్న దేవుడైన అల్లాహ్‌ా ఈలాగు సెలవిచ్చుచున్నాడు”-
10) గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకు,
11) బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించువారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు అల్లాహ్‌ానైన నేనే –
12) నీతి విషయములో నిన్ను పిలిచి, నీ చేయి పట్టుకొనియున్నాను.
13) నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను,
14) అన్య జనులకు వెలుగుగాను నియమించియున్నాను. (యెషయా-42: 1-7)

అంశముల వారిగా వివరణ:
1) అల్లాహ్‌ాచే ఏర్పచబడినవాడు ఆయనకు ఇష్టమైన ప్రవక్త ముహమ్మద్‌ (స) పుట్టిన రోజు ఏనుగుల సంవత్సరం రబీవుల్‌ అవ్వల్‌ 12వ తేది (క్రీ.శ. 29-08-570) మొదలుకుని వారు మరణించిన రోజు హిజ్రీ శకం 11వ సంవత్సరం రబీవుల్‌ అవ్వల్‌ మాసం 12వ తేది సోమవారం వరకు (ఈ భూలోక
జీవిత పర్యంతము) అల్లాహ్‌ా ప్రవక్త (స)ను ఆదుకొన్నట్లు, తమ కన్నులారా చూసిన సహాబీలు వారి అనుచరులు, నాటి సమాజం, వారి (స) జీవిత చరిత్రను చదివిన ప్రతి ఒక్కరు తెలిసికొనగలరు.
2) వహీ అవతరణ ద్వారా అల్లాహ్‌ా తన ఆత్మను తన దాసునిలో ఉంచాడు.
3) 5 మూల సూత్రములతో కూడిన ఇస్లాం ద్వారా తౌహీద్‌ వైపునకు వచ్చే అన్యజనులు (ప్రవక్త (స) ప్రభవించిన జాతి కానివారు) సహితం స్వర్గ సాఫల్యం పొందవచ్చునను న్యాయమును కనపరచారు.
4) నేటి మత బోధకులవలే దైవ విషయాలను బోధించడంలోగానీ, వివరించడంలోగానీ, తెలియజెప్పడంలోగాని ప్రవక్త (స) కేకలు వేయలేదు, అరవ లేదు, తన కంఠ స్వరమును పెంచలేదు. ఖుర్‌ఆన్‌ ఆయతుల పారాయణంలో శ్రావ్యంగా, మధురంగా, ప్రవచనాలు చెప్పుటలో సున్నితంగా వ్యవహరించేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే మాటలకే పరిమితము కాక ప్రతి దానినీ క్రియాత్మకంగా ఆచరించి చూపేవారు.

5) నలిగిన రెల్లు: సర్వ సృష్టికర్తయైన అల్లాహ్‌ను విడచి పెట్టి, తమ కొరకు ఒక్కొక్క అంశమునకు ఒక్కొక్క దేవుడను/దేవతను సృష్టించుకొన్న నూహ్‌ (అ) కుమారుడు షేము సంతతివారు నివసించుచున్న మధ్యధరా సముద్రము నుండి నైలు నదీ తీరమున దక్షిణముగా 600 మైళ్ళ వరకు వ్యాపించి, నేడు ఈజిప్టుగా పిలువ బడుచున్న ఐగుప్తు దేశము (నైలు నదిలో రెల్లు గడ్డి బాగా పెరుగుట వలన అలా పిలుచుట జరిగినది). ఈ దేశ ప్రజలు – పాలకులు నిజ దేవుని విడిచి తమ కొరకు మిథ్యా దైవాలను పూజించుచూ, తమ మృతుల కళేబరములను అత్యంత అభిమానంతో, శ్రద్ధతో, భద్రపరచుచూ, వారి కొరకు ప్రత్యేక దినములను ఏర్పరచి విందులు, వినోదముల ద్వారా బహుదైవారాధనలో మునిగిపోయిన వారి కోసం ‘తౌహీద్‌’ వైపు ఆహ్వానించు మూసా (అ)ను లక్ష్యపెట్టక తమ నాశనమును, స్వయంగా తామే కొనితెచ్చుకొన్న ఆ జాతి ప్రజలు ‘నలిగిన రెల్లు’ వలే అయిపోయారు. అలాంటి స్థితిలో ప్రవక్త (స) వారిని మరింత విరువక నిజ దేవుని వైపుకు ఆహ్వానిస్తారనేది ఈ వచన సారాంశము. మూసా (అ) సోదర జనాంగము నుండి ప్రభవించిన ప్రవక్త (స) నలిగిన రెల్లుగానున్న ఐగుప్తు జనులకు ఏ మాత్రం హాని కలిగించరని కూడా దీని భావం.

6) మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పకపోవడం:
భూలోకంలో దైవ ధర్మాన్ని స్థాపించి, దైవ దాస్యం ద్వారా ఆ ధర్మాన్ని భూలోకంలో వ్యాపింపజేయుటకు ప్రత్యేకంగా ఏర్పరచుకొన్న ఇస్రాయీల్‌ సంతతి (బనీ ఇస్రాయీల్‌) వారు ఆధ్యాత్మికంగానూ, ఈ లోక పరంగానూ దేవుని యొద్దనుండి అనేక మేళ్ళు పొందియుండి, ఆ మేళ్ళతో కూడిన సుఖభోగాల ప్రపంచ వ్యామోహంలో పడి ధర్మ భ్రష్టులయ్యారు. వారికి సన్మార్గము చూపుటకు దేవుడు తన వాక్కులతో వివిధ కాలాలలో వివిధ ప్రవక్తలను ప్రభవింపజేయటం జరిగినది. అయితే వారు ప్రవక్తలను నిర్లక్యము చేయుట ద్వారా దైవ ధిక్కారానికి పాల్పడ్డారు. ఆ ధిక్కార లక్షణమే ప్రవక్తలను విసిగించి, వేధించి, హింసించుట మాత్రమే గాక ఈసా (అ) విషయంలో చంపామనే భ్రమకు గురయ్యేవరకూ దారి తసింది. అప్పటి వరకు ఆధ్యాత్మి జగత్తులో సాటి లేని మేటి రారాజులుగా చెలామణియైనవారు దైవ ప్రవక్త ఈసా (అ) విషయంలో ప్రవక్తగా అంగీకరించక తిరుగుబాటు చేసి సున్నతి లేని జనాంగమైన రోమా పాలకుల వద్దకు వ్యాజ్యమును తెచ్చుట వలన తమ స్థాయిని దిగజార్చుకొనిరి.
”దేవుని గూర్చిన బోధనొందుదము అని తమ పొరుగువారికిగానీ, తమ సహోదరులకుగానీ (దేవుడు తమ మనస్సులలో, హృదయముల మీద వ్రాసిన ధర్మ విధిని) ఉపదేశింపవలెనను నియమమును ఉల్లంఘించి తన సన్నధిన ఉండకుండ పోయిన బనీ ఇస్రాయీల్‌ మరి ఎన్నటికి దేవుని జనముగా ఉండక పోవుదురు”. (ఇర్మియా-31: 34-36)
ఈసా (అ) బనీ ఇస్రాయీల్‌లో వారి కొరకు ఆ కాలంలో ప్రభవించిన దైవప్రవక్త. ప్రవక్తగా అంగీకరించక, అభ్యంతరపడి తిరస్కరించుట వలన ”కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలిగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను”. (మత్తయి-21: 43)
ఈసా (అ) ప్రవచనం నెరవేరులాగున, ఈ లోకంలోనూ, పరలోకంలోనూ ఉభయ భ్రష్టులై, దైవ వాక్కు అనే నూనె లేక ఆరిపోయే ముందు దీపం టపటప కొట్టుకొనుచున్నట్లుగా, మకమకలాడుచూ, ఆరిపోయే స్థితిలోనున్న బనీ ఇస్రాయీల్‌ను ముహమ్మద్‌ (స) పూర్తిగా ఆర్పక వారికి తిరిగి దేవుని వైపునకు ఏ మాత్రం హెచ్చుతగ్గులు, తేడాలు చూపక తన సదాచరణలు, సత్క్రియల ద్వారా వారి ధర్మ శాస్త్రానికి (తౌరాత్‌కి) అనుగుణంగా ఇస్లాంలోనికి (శాంతి మార్గంలోనికి) ఆహ్వానించారు. అయితే ధర్మం విషయంలో బలవంతము లేదు గనుక, వారిలో విశ్వసించిన బహు కొద్దిమంది ముస్లింలయ్యారు. మిగిలినవారు తమ సొంత లక్షణములు (దుర్మార్గము) నెంచుకొని జీవించుచున్నారు.

7) ప్రవక్త (స) దైవం వద్ద నుండి వచ్చిన సత్యముననుసరించి, న్యాయమును కనబరచెను. ఉదా: దొంగలించిన కారణముగా ఒక గొప్పింటి స్త్రీ (ఎన్ని సిఫారసులు వచ్చినను లక్ష్య పెట్టక) చేతులను నరికే శిక్ష అమలు చేసిన సంఘటన.
8) భూలోకమున దైవ న్యాయము (దైవ దాస్యం ద్వారా తౌహీద్‌)ను స్థాపించువరకు ప్రవక్త (స) మందగిల్లలేదు, నలుగుడు పడలేదు.
9) భూమార్గమున సంబంధమున్న దేశములు అందు నివసించుచున్న జాతులలోనే కాదు, ఏ మాత్రము భూమార్గము ద్వారా సంబంధంలేని, చుట్టూ ఆవరించివున్న జలముల మధ్యనున్న ద్వీపములు, అందలి ప్రజలు ఆయన (స) బోధ స్వీకరించి ‘ఇస్లాం’ను ఆచరిస్తున్న విషయము చారిత్రక, భౌగోళిక సత్యము.
10) నాటి సమాజము విగ్రహారాధన జరిపించుట ద్వారా సృష్టికర్తను గుర్తించలేని గ్రుడ్డితనములోనున్నప్పుడు, వారి కన్నులను తెరిపించి, ఏక దైవారాధన వైపునకు పిలిచారు.
11) మద్యపాన సేవనము, వ్యభిచారము జూదము మొదలైన పాప క్రియల ద్వారా ఇబ్లీసు రాజ్యంలో బంధించబడిన చెరసాలలో నుండి, ఆ పాప క్రియల నుండి వారిని, తన దైవ వాక్కులతో దూర పరచుట ద్వారా ఆ చీకటి సామ్రాజ్యము నుండి దేవుని వెలుగు (జ్ఞానము) వైపునకు తీసికొని వచ్చారు.
12) బురదలో కూరుకుపోయిన వ్యక్తి మరొకరి బురదను కడుగజాలడు. అలాగే చీకటిలోనున్న వ్యక్తిని వెలుగు వైపునకు నడిపించేవాడు తప్పక వెలుగులో ఉండాలి. పుట్టుక నుండి నీతిగా మెలిగిన ప్రవక్త (స)ను, ప్రజలను దేవుని వైపునకు ఆహ్వానించే వానిగా దేవుడు ఎన్నుకున్నాడు.
13) ప్రవక్త (స)ను అనేక ఈతి బాధల నుండి అల్లాహ్‌ా కాపాడి, ఆయన జాతి ప్రజలకు ఒక నిబంధనగా నియమించాడు. అంటే ప్రవక్త

(స)ను విశ్వసించి ఆయన చూపిన మార్గం ద్వారా సృష్టికర్తను ఆరాధించి స్వర్గ సాఫల్యం పొందడం – ఈ నిబంధనను పాటించడం అవుతుంది. అలా కాక ప్రవక్త (స)ను విశ్వసింపక – ఆయన (స) మార్గం అనుసరింపక నరక శిక్షకు గురికావడం – నిబంధనను అతిక్రమించడం. సూక్ష్మంగా చెప్పాలంటే దేవునికి – ప్రజలకు మధ్య నిబంధన ప్రవక్త (స).
14) ప్రవక్త (స)ను విశ్వసించి ఆయన (స) చూపిన మార్గము ద్వారా తౌహీద్‌ పాటించినట్లయితే, అరబ్బేతరులు సహితం అనగా విశ్వసించిన మానవులందరూ స్వర్గ సాఫల్యం పొందవచ్చుననే సమ న్యాయం కోసం వెలుగుగా నియమించబడ్డారు.

”యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును. దాని ఏరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మజ్ఞాన వివేకములకు అధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని, యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నివసించును. యెహోవా భయము అతని ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూవాసులలో దీనులైన వారికి యదార్ధముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. (యెషయా-11: 1-5)

పాఠకులారా! పరిశీలించండి!!
దావూద్‌ (అ) తండ్రి పేరు యెష్షయి ఈయన ఇబ్రాహీమ్‌ (అ) సంతతికి చెందినవారు. వీరి సంతతి ఓ పెద్ద మహా వృక్షం. దైవ దౌత్యం బనీ ఇస్రాయీల్‌ జాతిలో ఈసా (అ)తో ముగియుట వలన, కొమ్మలు నరకబడి మొద్దు మాత్రం మిగిలింది. ఆ మొద్దుకి గల వేర్లలో ఒక బలిష్టమైన వేరు జేష్ఠ కుమారుడైన ఇస్మాయీల్‌ (తి). వారి అంకురము ముహమ్మద్‌ (స) ఎదిగి దైవ దౌత్యంలో ఫలించారు. అల్లాహ్‌ా యెడల భయము ప్రవక్త (స)కి ఇంపైన సువాసన. అందుకే వారు (స) నిద్ర సహితం మానుకొని, కాళ్లు వాచిపోయేలా ‘తహజ్జుద్‌’ నమాజు ఆచరించేవారు. కంటి చూపును బట్టి, అనగా ఈ లోక పోకడ దృష్ట్యా తీర్పు తీర్చక పై (దేవుని వద్ద) నుండి దైవదూత జిబ్రయీల్‌ (అ) ద్వారా విను దానిని బట్టి వ్యాజ్యములను విమర్శ చేసేవారు, తీర్పునిచ్చేవారు. కేవలం దేవుని నీతిని బట్టి మాత్రమే బీదలకు తీర్పు తీర్చేవారు. కాని తద్విరుద్ధంగా ఎంత గొప్పవారి సిఫారసును కూడా వినేవారు కాదు. భూలోకమున దీనుల పక్షమున యదార్ధముగా తీర్పు తీర్చేవారు. తన వాగ్దండము చేత – అనగా ప్రవచనములచే లోకమును దేవునికి లోబర్చారు. తన పెదవుల ఊపిరి చేత – ఖుర్‌ఆన్‌ ఆయతుల పారాయణం ద్వారా దుర్మార్గులకు వారి దుష్టత్వమును జ్ఞాపకము చేసి ఈ లోక కార్య కలాపాల విషయమై (చచ్చినవారి వలే) పశ్చాత్తాప పడేలా చేసేవారు. కేవలం సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్‌నే ఆరాధించాలనే నీతి మరియు ఆయన (స) చూపిన మార్గం ద్వారానే (సత్య మార్గం) స్వర్గ సాఫల్యం పొందగలరనే విషయాలతో ధర్మ సంస్థాపన కోసం ధర్మ పథంలో కత్తి డాలు పట్టి యుద్ధం చేస్తారనే ప్రవచనాలు నెరవేరాయి.

Related Post