ఇస్లాం శాంతి వనం

Originally posted 2014-08-24 01:01:03.

  శాంతి వనం ఏకదైవారాధనా భావాలు పరమళించే అందమైన పూలవనం. ఇహలోకపు స్వర్గధామం. మనుషులను షైతాన్‌ దాడుల నుండి కాపాడే రక్షణ వలయం అది. షైతాన్‌ విసిరే విషవాయువులు అందులో ప్రవేశించలేవు. దాని గోడలను తాకి వెనక్కి వచ్చేస్తాయంతే. కొద్దో గొప్పో దుష్ప్రభావం లోపలికి చొచ్చుకుపోయినా శాంతి వనంలోని సుమంగళ పుష్పాలు ఆ విషాన్ని హరించివేసి, వనంలో మళ్ళీ యధాస్థితిని నెలకొల్పుతాయి.

శాంతి వనం ఏకదైవారాధనా భావాలు పరమళించే అందమైన పూలవనం. ఇహలోకపు స్వర్గధామం. మనుషులను షైతాన్‌ దాడుల నుండి కాపాడే రక్షణ వలయం అది. షైతాన్‌ విసిరే విషవాయువులు అందులో ప్రవేశించలేవు. దాని గోడలను తాకి వెనక్కి వచ్చేస్తాయంతే. కొద్దో గొప్పో దుష్ప్రభావం లోపలికి చొచ్చుకుపోయినా శాంతి వనంలోని సుమంగళ పుష్పాలు ఆ విషాన్ని హరించివేసి, వనంలో మళ్ళీ యధాస్థితిని నెలకొల్పుతాయి.

 

ఆకాశాల్లో అల్లాహ్‌ ఆజ్ఞ ఒకటి అమల్లోకొచ్చింది. రెండు జీవాలు స్వర్గం  నుంచి స్థానభంశం చెందు తాయి. వాటిలో ఒక జీవి నమత్ర, అణకువలకు నిలువెత్తు నిదర్శనం; మరొక జీవి పగ పత్రీకారాలకు పెట్టింది పేరు. ఇరు జీవులూ నిర్ణీత కాలవ్యవధి కోసం కార్యకారక పప్రంచంలోకి పవ్రేశించాయి. ఒక జీవి ‘ఆదం’గా అవతరించింది. మరొక జీవి ‘షైతాన్‌’గా పత్య్రక్షమయింది.
 షైతాన్‌ది మొదటి నుండే మొండి వాదన. ఆదం మూలంగానే తాను దివ్యలోకాల నుంచి దిగి రావలసి వచ్చిందని వాడి మూఢ భావన. అందుకని ఆదంపై అతను అనవసరంగా కక్ష పెంచుకున్నాడు. ఆదం జాతి వినాశనం కళ్ళారా చూస్తేగాని వాడి కడుపు మంట చల్లారేటట్టు లేదు. దైవధిక్కార భావాలతో విశ్వం తగులబడిపోయినా, ఆ బడబాగ్నికి తానూ ఆహుతి అయిపోయినా ఫర్వాలేదు గాని, ఆదంకు, అతని సంతానానికీ మళ్ళీ స్వర్గం గడప తొక్కే భాగ్యం మాత్రం కలుగ రాదన్నది షైతాన్‌ జీవిత లక్ష్యం!
  అందుకనే వాడు ఆదంపై పగ ప్రతీకారాల ప్రచండ నిప్పుల వాన కురిపించాడు. భూమండలం నిండా అసూయా అగ్ని గుండాలు రగిలించాడు. దాంతో విశ్వమంతటా విద్వేషం, వైషమ్యాల విష వాయువులు అలుముకున్నాయి. అవని అంతా అల్లకల్లోలమయింది.
  అల్లాహ్‌ తలచుకొని ఉంటే ఆ రోజే షైతాన్‌కు అంతిమ దినం అయి ఉండేది. భువన భాండవాలను నిర్మించిన ప్రభువుకు షైతాన్‌ పీచమణచటం పెద్ద పని కాదు. ఆ మాటకొస్తే షైతాన్‌ను సృష్టించిందీ ఆయనే! తాను సృష్టించిన జీవిని తిరిగి శూన్యంలోకి పంపించేయటం ఆయనకు ఒక లెక్కా?! అయితే అల్లాహ్‌ వ్యూహం మరోలా ఉంది. షైతానుకు వాడి అశక్తతను, వాడి దౌర్బల్యాన్ని తెలియజేయాలను కున్నాడాయన. అసత్యం ముందు సత్య బలాన్ని నిరూపించాలను కున్నాడు.

బ్రహ్మాండమైన ప్రణాళిక

  షైతాన్‌ ఆట కట్టించటానికి అల్ల్లాహ్‌ బ్రహ్మాండమైన ప్రణాళికను రూపొందించాడు. వాడి ఆగడాల నుంచి రక్షించటానికి ఆయన ఆదంను తిరిగి దివ్యలోకాలకు పిలుచుకోలేదు. మరో లోకానికి తరలించనూలేదు. ఇహలోకాన్ని  పరీక్షా   స్థలంగా   నిర్ధారించాడు.
  దీనిని ఆచరణా నిలయం (దారుల్‌ అమల్‌)గా ఖరారు చేశాడు. ఎవరు చక్కగా రాణిస్తారో పరీక్షించే నిమిత్తం జీవన్మరణాల వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మరి ఇహలోకంలోనే అత్యంత సుందరమైన, సుఖ దాయకమైన ఒక వనాన్ని ఆయన నిర్మించాడు. దానికి ”శాంతి వనం” (సలామ్‌ వనం) అని నామకరణం చేసాడు. ఆదంను అందులో వసింపజేశాడు. ఇహలోకంలో షైతాన్‌ దాడుల నుంచి రక్షించుకునే స్థానం ‘శాంతి వనం’ ఒక్కటేనని స్పష్టంగా ప్రకటించాడు.  షైతాన్‌ నాలుక్కరచుకున్నాడు. తన నక్కజిత్తులన్నీ ఉపయోగించి మరో ఎత్తు వేసే ప్రయత్నంలో పడ్డాడు.

శాంతివనం ఏకదైవారాధనకు ఆలయం

  శాంతి వనం ఏకదైవారాధనా భావాలు పరమళించే అందమైన పూలవనం. ఇహలోకపు స్వర్గధామం. మనుషులను షైతాన్‌ దాడుల నుండి కాపాడే రక్షణ వలయం అది. షైతాన్‌ విసిరే విషవాయువులు అందులో ప్రవేశించలేవు. దాని గోడలను తాకి వెనక్కి వచ్చేస్తాయంతే. కొద్దో గొప్పో దుష్ప్రభావం లోపలికి చొచ్చుకుపోయినా శాంతి వనంలోని సుమంగళ పుష్పాలు ఆ విషాన్ని హరించివేసి, వనంలో మళ్ళీ యధాస్థితిని నెలకొల్పుతాయి. శాంతివనంపై ముప్పేట దాడులు చేసి అందులో శరణుజొచ్చిన అల్ల్లాహ్‌ భక్తులందరినీ అపమార్గాలకు గొనిపోదామని ఆనాటి నుంచీ అలుపెరగకుండా ప్రయత్నిస్తూ ఉన్నాడు షైతాన్‌ మాయావి. కాని షైతాన్‌కు అన్ని సార్లూ నిరాశే ఎదురయ్యింది.

షైతాన్‌ కపట నాటకం!

  అప్పుడు షైతాన్‌ బుర్రలో మెరుపు లాంటి ఒక ఆలోచన మెదలింది. మనుజ జాతిపై తన కసి తీర్చుకోవటానికి వాడు తన పంథా మార్చు కున్నాడు. మనుషులను ఏకదైవారాధన నుంచి ఏమార్చటానికి సరికొత్త దారిని వెతికాడు. వాడు చేసిందేమిటంటే –
  శాంతి వనం (ఇస్లాం వనం) చుట్టూ సర్వాంగ సుందరమైన, ముగ్ధ మనోహరమైన మరో రెండు వనాలను రూపొందింపజేశాడు. ఒకటి: దైవధిక్కార (కుఫ్ర్‌) వనం. రెండోది: బహుదైవత్వపు (షిర్క్‌) వనం. అవి అచ్చం శాంతి వనాన్ని పోలివున్నాయి. కాని వాటిలో అన్నీ దుర్గంధ భరిత విషపు మొక్కలు! విశ్వంలోని అత్యంత హానికర ముళ్ళపొదలను, విషపు గింజలను షైతాను వాటిలో నాటాడు. అయితే ముళ్ళూ ముడులూ కనిపించకుండా పైపైన ఆ చెట్లకు చూడచక్కని రంగులు అద్దాడు. కంపూగింపూ రాకుండా వాటిపై మంచి మంచి వాసనలు వెదజల్లాడు.
    అప్పుడు ప్రకృతిసిద్ధ ఇస్లాం వనానికి – కపటమైన షైతాన్‌ తోటలకూ మధ్య వ్యత్యాసం గుర్తించటం కష్టమయింది మనిషికి. పైగా ఆ మాయలమారి పెంచుతున్న విషవనాల్లోని కొన్ని (గంజాయి) మొక్కలు ఇస్లాం వనపు వృక్షాలకంటే సుందరమైనవిగా, సౌఖ్యమైనవిగా అగుపించసాగాయి.

ఎత్తుకు పైఎత్తు!

మానవుల్ని కష్టాల పాల్జేయటం కారుణ్య ప్రభువు అభిమతం కానేకాదు. అల్లాహ్‌ మనిషిని ఏనాడూ అతని నిస్సహాయతకు వదలి పెట్టలేదు. ఇప్పుడు కూడా అదే దైవ సంప్రదాయం పని చేసింది.
 షైతాన్‌ మాయావి పెంచిన కపట వనాలకు దీటుగా శాంతి వనాన్నీ వికసింపజేశాడు అల్లాహ్‌. ప్రతి కాలంలో, ప్రతి యుగంలో మానవుల్లో నుంచే తన ప్రతినిధులను ఎన్నుకుని వారిని ‘ఇస్లాం వన’ సంరక్షకులుగా, శాంతి సీమలోని పచ్చదనాన్ని కాపాడే ప్రవక్తలుగా నియమించాడు. సాతాను కపట తోటల్లో విచ్చుకుంటున్న ప్రతి ఒక్క విషపు మొక్కకూ ఇస్లాం వనంలో ఒక విరుగుడు వృక్షం వృద్ధి చెందుతూ ఉండేలా అద్భుతమైన ఏర్పాటు చేశాడు. దాంతో ఇస్లాం వనం మూడు పువ్వులు, ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతూ పోయింది. యుగాల తరబడి సాతాను విసరుతూ వచ్చిన విష వాయువులకు ఏ మాత్రం కలుషితం కాకుండా పరమ పునీతంగా, పరిశుద్ధంగా నిలిచింది. మరి ప్రపంచం పుట్టింది మొదలు నేటి వరకు ఇస్లాం వన సంరక్షణా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చిన హేమాహేమీలయిన ఆ వనమాలీలు ఎవరనుకుంటున్నారు?
  నూహ్‌, హూద్‌, సాలిహ్‌, ఇబ్రాహీం, ఇస్మాయీల్‌, ఇస్‌హాఖ్‌, మూసా, ఈసా మొదలగు చరిత్ర రత్నాలే ఆ మహానుభావులు! ప్రజలకు సన్మార్గం చూపటానికి పుట్టిన మానవ నవనీతం!! ప్రపంచం ఎన్నటికీ మరచిపోలేని చరితార్థులు!!! వారి బోధనా సుధతో ఇస్లాం వనంలో ఎప్పటికప్పుడు దివ్యమైన పుష్పాలు వికసిస్తూ ఉన్నాయి.

చిట్టచివరి వనమాలి ముహమ్మద్‌ (స)

  ఆ కోవలోని చిట్టచివరి వనమాలీయే మన ప్రవక్త ముహమ్మద్‌ (స). ఆధునిక యుగంలో షైతాను భావజాలపు కుయుక్తుల్ని ముందుగా పసిగట్టి, ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టే ప్రతి ధర్మ కుసుమమూ ఆయన వనంలో మొగ్గ తొడిగింది. గత ప్రవక్తల కాలంలో భూప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకు, ప్రదేశాలకే పరిమితమైన ఇస్లాం వనం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారి కాలానికి ప్రపంచమంతా వ్యాపించింది. ఈ రోజు అది ప్రతి మనిషి ముంగిట్లో అలరారుతోంది. తనకు చేరువలోనే తారట్లాడుతూ, తనలో ప్రవేశించటానికి ఆలోచిస్తున్న ఆదం పుత్రులను అది ఆర్ద్రంగా పిలుస్తోంది. సాదరంగా లోనికి ఆహ్వానిస్తోంది. తనలోకి ప్రవేశించ టానికి ఆలస్యం చేసి షైతాను చేతికి చిక్కుతున్న అమాయక ప్రజలను చూసి అది అమితంగా ఆందోళన చెందుతోంది.
  శాంతివనం సుగుణాలను అణువణువూ అధ్యయనం చేస్తున్న బుద్ధిశీలురు అబ్బురపోతున్నారు. దాని పసిడి అందాలకు పరవశులై  ఇక ఆగలేమంటూ తండోపతండాలుగా వచ్చి అందులో చేరుతున్నారు.

 పసిడి పూల పరమార్థం

  దైవప్రవక్తల శాంతివనంలో పూసేవి రజిత పుష్పాలు. అవి పసిడి పూలు కావు. పసిడిపూలకు ఇహలోక ప్రతిరూపాలు. పసిడి పూలది పరిపూర్ణ దివ్యరూపం. రజిత పుష్పానికి మూలం, మాతృకం పసిడి పూవే. పసిడి పూల అందాలు ఎన్నటికీ చెరిగిపోవు. వాటి వాసనలు తరిగిపోవు. వాటికి పుట్టట గిట్టుటలు ఉండవు. నేరుగా విశ్వప్రభువు వాణి నుంచి జాలువారిన పరమ పునీత పారిజాతాలవి. పసిడి పూల పరిమళాలతో శాంతి వనం ఎల్లప్పుడూ చిరునవ్వులను చిందిస్తూ ఉంటుంది. ఆ పసిడి పూలు మరేవో కావు, అంతిమ దైవగ్రంథమైన దివ్య ఖుర్‌ఆన్‌లోని భావ సౌరభాలు.
  ‘పసిడి పూలు పరిమళించని నివేశనము శ్మశానమే!’ అన్నారు ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స). అవును మరి! మన ఇండ్లు పైశాచిక దాడుల నుంచి సురక్షితంగా ఉండాలన్నా, మన మనసుల్లో తిష్ఠవేసి ఉన్న షైతానులను తరిమికొట్టాలన్నా, మన జీవితాల్లో పసిడి పూల పరిమళాలు గుబాళించటం ఒక్కటే మార్గం. శాంతి వన ప్రవేశంతోనే అది సాధ్యం!
  పసిడి పూలను పట్టుకుంటే పరలోక అదృష్టం మన చేతికి అందినట్లే. వాటిని తడిమి చూసుకునే తనువు పులకించిపోతుంది. ఆఘ్రాణించిన మస్తిష్కం ఆనందడోలికల్లో తేలియాడుతుంది. ఇక వాటిని ఆకళింపు చేసుకున్న హృదయం ఆచరణకు నాందివాచకం పలుకుతుంది. కలత చెందే మనసులను పసిడి పూల పరిమళాలు కుదుట పరుస్తాయి. కళావిహీన జీవితాల్లో కొత్త కాంతులను నింపుతాయి.
ఇస్లాం వనంలో శరణు తీసుకున్న అల్లాహ్‌ా భక్తులు పసిడి పూల పరిమళాలను మనసారా ఆస్వాదిస్తారు. ఆ పువ్వుల్లో నుంచి జాలువారే జ్ఞాన మకరందాన్ని తనివితీరా గ్రోలుతారు. తరిస్తారు. తన్మయులవు తారు. తాదాత్మ్యం చెందుతారు. షైతాను వేసే కపట వేషాలను వీసం వీసం గుర్తిస్తారు. పరలోకంలో స్వర్గ భాగ్యాలను అనుభవించే అదృష్టవంతులైన ఆదం పుత్రులు వీరే సుమా!

 

 

Related Post