కలం అనే ఈ అమానతు – రచయితలకు, జర్నలిస్టులకు, మేధాసంపన్నులకు, విజ్ఞులకు, వివేచనాపరులకు దేవుడు
ప్రసాదించిన గొప్ప వరం. కనుక ఈ కలాన్ని ఆయుధంగా చేసుకుని జీవన పోరాటం సాగించేవారు ఎట్టి పరిస్థితిలోనూ అల్లకల్లోలాన్ని, అరాచకాన్ని, అధర్మాన్ని పెంచిపపోషించే పదాలు వెలువడకుండా జాగ్రత్త వహించాలి. మనం చెప్పే ప్రతి మాట, వ్రాసే ప్రతి అక్షరం మానవ సంబంధాలను వృద్ధి పర్చే విధంగా ఉండాలి.
కలం, భాష మూలంగా సత్సాంగత్యం సాధ్యమవుతోంది. స్నేహాన్ని, అనుబంధాన్ని, ఆప్యాయతను, దయను, జాలిని, ఉదార స్వభావాన్ని, సహిష్ణుతాభావాన్ని, త్యాగశీలతను, అంకిత భావాన్ని, నిర్ధిష్ట ప్రణాళికను, క్షమా గుణాన్ని, వ్యక్త పర్చడానికి కలం తోడ్పడుతోంది. అలాగే అపోహలు, అనుమానాలు, అప్రతిష్టలు, బాధలు, పగ, ద్వేషం, గర్వం, అవిధేయత, క్రోధం, కామం, లోభం, మోహం వంటి నకారాత్మక భావాలను కూడా కలం ద్వారా అభివ్యక్తం చెసే సావాకాశం ఉంది. కనుక మనం వ్రాసిన ప్రతి రాత, మాట్లాడిన ప్రతి మాటను గురించి దేవుడు లెక్క తీసుకుంటాడని గుర్తుంచుకోవాలి.
నేడు మానవీయత కనుమరుగవుతోంది. మనిషి వస్తువైపోతున్నాడు. జీవితాన్ని యాంత్రికంగా గడుపుతున్నాడు. సమాజ సంస్కృతిలో ప్రేమ పాలు తగ్గి భీతిపాలు ఎక్కువవుతోంది. మానవీయ లక్షణాలయిన జాలి, కరుణ, ప్రేమ, శాంతి, ఓర్పు, ఆత్మ నిగ్రహం, క్రమశిక్షణ, బాధ్యతాయుతా ప్రవర్తన, కష్టపడి పని చేసే స్వభావం, నమ్రత, సహనం, ఆత్మ విశ్వాసం, ఆత్మాభిమానం, చిరునవ్వు, సౌహార్థ్రత, నిరాడంబరత, విశ్వసనీయత, ప్రశాంతత, అణుకువ, మర్యాద, సమత్వం, సజ్జన సాంగత్యం, వివేకం, నిర్దిష్ట లక్ష్యం, సేవాభావం, విచక్షణ, స్వేచ్ఛ, నిజాయితీ, సానుభూతి, న్యాయప్రవర్తన, సమగ్రత తగ్గిపోతున్నాయి. వాటి స్థానంలో మానవత్వాన్ని మంట కలిపే – మూర్ఖత్వం, మూఢ నమ్మకాలు, అహంభావం, అసహనం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, బద్ధకం, లాలస, కక్ష, విరోధత్వం, దౌర్జన్యం, దౌష్ట్యం, మోసం, అపనమ్మకం, అనుమానం, అరాచకం, అక్రమం, అత్యాచారం, అన్యాయం, లంచగొండితనం, దోపిడి, దొంగతనం, మానసిక ఒత్తిడి, హింసా ప్రవృత్తి వంటి లక్షణాలు పెచ్చు పెరిగిపోతున్నాయి. వీటి కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సమాజం సమిష్టి స్వభావాన్ని కోల్పోతోంది. స్వీయ వినాశకర కార్యక్రమాల వల్ల వల్లకాడవుతోంది లోకం. నైతిక విలువలు పతనమైపోతున్నాయి. అభివృద్ధిని అడ్డుకునే అనేక వ్యతిరేక ధోరణులు (పత్రికలు, మీడియా, ఇతర పైశాచిక శక్తులు) సమాజాన్ని పట్టి పల్లారుస్తున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా మనుషుల ప్రవర్తనను మార్చలేకపోతున్నాం.
అందువల్ల ధార్మిక చింతనను వృద్ధి చేసుకొని ప్రతి ఒక్కరు, ముఖ్యంగా రచయితలు, జర్నలిస్టులు, ఆలోచనాపరులు, సాహితీవేత్తలు తమ బాధ్యతలను గుర్తించి మానవీయ లక్షణాలను పెంపొందించుకోవాలి. మానవత్వం లేని జ్ఞానం మారణహోమానికి దారి తీస్తుంది. విచక్షణారహిత నైపుణ్యం వినాశానికి దోహదపడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను తర్కించి, విశ్లేషించి, విచక్షణతో, విజ్ఞతో మనోమాలిన్యాన్ని, భావకాలుష్యాన్ని బయటకు నెట్టి, స్నేహపూరిత వాతావరణాన్ని, సజ్జన సాంగత్యాన్ని, సాత్విక స్వభావాన్ని వృద్ధి చేసుకోవాలి. మన ఆలోచనలు మారితే పరిస్థితులు, పరిసరాలు మారిన అనుభూతి కలుగుతుంది. మన సుఖ సంతోషాలు మానవ సంబంధాలపై ఆధారపడి ఉంటాయి గనక మనల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అని బాధపడేకంటే మనం ఇతరులను అర్థం చేసుకోవడానికి కృషి చేయాలి. మన ఉత్థానానికిగానీ, మన పతానానికిగానీ మనమే కారకులం. మనకు మనమే మిత్రులం. మనకు మనమే శత్రువులం. మన పురోగతికి, తిరోగతికి మనమే బాధ్యులం. అందువల్లే ”మన మతి ఎట్ల్లా ఉంటే మన గతి అట్లా ఉంటుంద”నే నానుడి వ్యాప్తిలో ఉంది.
ప్రతీ కార్యం సొంత ప్రేరణతోనే జరుగుతుంది. గతమేమయినా వర్తమానం మన చేతిలోనే ఉంది. వర్తమానానన్ని చక్కబెట్టుకునే శక్తి మనకుంది. వర్తమానంలో క్రమారాహిత్యం మన ప్రేరణకు అనుగుణంగానే జరుగుతుందితోంది. వర్తమానాన్ని చక్కబెట్టుకోకపోతే నష్ట్టపోయేది మనమే. కనుక స్వార్థపేక్ష కలిగిన ప్రతి వ్యక్తి తనను తాను ఆత్మ విమర్శ చేసుకోవలసిన సందర్భం మననుండే మొదలు కావాలి.
”స్వంత లాభం కొంత మానకుని పొరుగువాడికి తోడుపడవోయ్! దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్!!” అన్న గురజాడ వారి మాటలు అందరికీ ఆదర్శప్రాయం కావాలి. స్వయంగా ఆ పరమ ప్రభువే కలంను సాక్షిగా తీసుకున్నాడు. కనుక మనం ”కలం” ప్రాధాన్యతను గుర్తించాలి.