ప్రేమ – ఎన్నో హృదయాల, ఎన్నో జీవితాల కలయిక ప్రేమ. ప్రేమ ఎప్పుడూ స్వార్థాన్ని కాదు, త్యాగాన్ని నేర్పుతుంది. తల్లీ బిడ్డల బంధంలో, అన్నా చెల్లెళ్ల అనురాగంలో, అవ్వా మనవళ్ళ వాత్సల్యభరిత బంధంలో, ఆలుమగల అన్యోన్నతలో, దేవుడూ దాసుడి సంబంధంలో ఒకరిపై ఒకరికున్నది కూడా అవిభాజ్యమైన ప్రేమే! అయితే, ఆకర్షణనే ప్రేమని భ్రమించేవారు కొందరైతే, కాలక్షేపాన్ని ప్రేమగా అభివర్ణించేవారు మరి కొందరు. ఉన్మాదాన్ని, పైశాచికాన్ని ప్రేమగా చెప్పుకునేవారు కొందరైతే, క్రూరమైన ఆలోచనల్నిపుట్టించేది, హద్దులు మీరేలా ప్రేరేపించేది ప్రేమ అని భాష్యం చెప్పుకునేవారు కొందరు.
అలా ఎవరికి వారు తమకు నచ్చిన తాత్పర్యాలు చెప్పుకుంటూ భ్రమల వలయంలో చిక్కుకొని ఎటూ పాలుపోక, ఏం చేయాలో తోచక ఘోరమైన నేరాలకు, అఘాయిత్యాలకు, అన్యాయాలకు పాల్పడుతున్నారు. తాము నష్టపోవడమే కాక ఎన్నో కుటుంబాలను శోక సముద్రంలో ముంచేస్తున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ విధంగా తెలిసీ తెలియని వయసులో మాయలోకానికి మోసపోయి, నిండు ప్రాణాల్ని వదిలిన ఓ అమ్మాయి వాస్తవ గాథను ఆధారంగా చేసుకుని ఈ వ్యాసం వ్రాయబడుతోంది. ఒకవేళ మరణించిన ఆ అమ్మాయి మౌనం వీడి, మ్లాడి ఉంటే ఎలా ఉండేదో… అన్న ఊహకు ప్రతిరూపమే ఈ వ్యాసం. ఈ వ్యాసం వల్ల ప్రతి హృదయంలో కొద్దో గొప్పో మార్పు వచ్చి తీరుతుందని, ప్రజలు ముఖ్యంగా తల్లీదండ్రులు కొత్త కాంతికి కళ్ళు తెరవగలరని విశ్వాసం.
సారీ అమ్మా…! నా బాధ నీతో కాకపోతే ఇంకెవరితో చెప్పకోను చెప్పు….అమ్మా….! నిజంగా నాకు ఆ క్షణంలో ఏమీ తోచలేదు… ఎవరైనా నా తరఫున మాట్లాడే వ్యక్తి ఒక్కరుంటే చాలు అన్పించింది… మనసున ఉన్నదంతా చెప్పాలన్పించింది… లిఖిత పూర్వకంగా నా మనోవేదనను భద్రపర్చాలన్పించింది…. అమ్మమ్మ ఒడిలో కాసేపు నిద్రపోవాలన్పించింది…. నీ కౌగిట్లో చేరి కళ్ళు కాయలు కాసేదాక ఏడ్వాల న్పించింది…. నా ప్రేమ గురించి, నాకు జరిగిన అన్యాయం గురించి నాన్నతో మనసు విప్పి మ్టాడాలన్పించింది…. నా మనోగతాన్ని చెల్లితో చెప్పుకోవా లన్పించింది… ఇన్ని ఆలోచనలు నన్నెంత ఒత్తిడికి గురి చేస్తున్నాయో…. ఎంత పిచ్చెక్కిస్తున్నాయో చెప్పుకోవాలన్పించింది…. కానీ నేను ధైర్యం చేయలేక పోయాను…. ఏ ముఖంతో మీ ముందుకు రావాలని లోలోన కుమిలిపోయాను… నాలుగు గోడల మధ్య నన్ను నేను బంధించుకున్నాను… నా మెదడును, హృదయాన్ని పిండేసే పిచ్చి ఆలోచనలు… వాటిని ఎలా అధిగమించాలో తెలియక నేననుభవించిన నరకం వర్ణనాతీతం అమ్మా!
ఎన్నో రాత్రులు నిశిరాత్రి పశ్చాత్తాపంతో గడిపాను… దైవ సమక్షంలో నా తప్పుల్ని ఒప్పుకున్నాను… కానీ మీతో అనలేక పోయాను… వాటి నుండి పారిపోవాలను కున్నాను… జీవితం నుంచే పారి పోతానని ఆ క్షణం నేను ఊహించనన్నా ఊహించ లేదు.
ఆ క్షణం… నేను తుది శ్వాస వీడిన భయంకర క్షణం… ఆ క్షణం నాన్న నా దగ్గరకొచ్చి నన్ను ఒళ్ళో తీసుకును అభయమిస్తూ నాలుగు మాటలు మ్లాడితే బాగుండు అన్పించిందమ్మా… నిజంగా నాన్న గారి మాటలకు అంత శక్తి ఉందని నాకు బాగా తెలుసు… ఆయన ప్రసంగాలు శ్రోతల్ని ఎలా ఉర్రూతలూగిస్తాయో, ఎలా కన్నీళ్ళు ప్టిెస్తాయో అనుభవపూర్వకంగా నాకు తెలుసు… కాని నిజం నాన్న గారికి తెలీదు… ఆ నిజం ఆయన్ను నిప్పులా ఎక్కడ దహించి వేస్తుందోనన్న భయంతో నేనే చెప్పలేదు… అసలు ఆ నాలుగు రోజులూ నాన్నగారి ముఖం కూడా నేను చూడలేక పోయాను… ఆయనతో మ్లాడలేక పోయాను… నాకిష్టమైన కోడి కూర చేసి ప్లేటు నిండా అన్నం ప్టిె ‘అబ్బా జాన్! భోజనానికి రండీ’ అని పిలువలేక పోయాను… అమ్మా! ఇవన్నీ నన్ను రోజుకి వేల సార్లు బాధించాయి… నా కిం మీద కునుకు లేకుండా చేశాయి… అమ్మా…! నీకు తెలిసో తెలియదో… ఎన్ని సార్లు నీ ఒడిలో వాలిపోయానో… నీ చీర కొంగు అప్పుడప్పుడూ తడిసిపోతూ ఉండేదే…! అవన్నీ నా కన్నీళ్ళేనమ్మా! ఏం చేయను… మరీ దుఃఖం ఆగనప్పుడు…!!
అమ్మా…! నేను అలా చేయడానికి కారణాలు లేకపోలేదు… కన్ను గీటడాలు, సైగ చేయడాలు, ఏకాంత కలయికలు తప్పని తెలిసి కూడా… ఒక పరాయి స్త్రీ మరో పరాయి పురుషుడితో ఏకాంతంలో ఉంటే మూడోవాడుగా షైతాన్ వారికి తోడవుతాడు అని విని కూడా… చెట్టా పట్టాలేసుకుని, సిగ్గు విడిచి మరీ షికార్లు తిరిగాను… ఇది నిజమైన స్త్రీ స్వేచ్ఛకు ప్రతిబింబం అని లోలోన మురిసి పోయాను… మానవ రూపంలో తోడేళ్ళుంటాయని… ఆ క్షణం.. నేను తెలుసుకోలేక పోయాను…, తుమ్మెద లాంటి స్త్రీ స్వర్గపు సువాసనకు సైతం నోచుకోదు’ అన్న మాట నాకు తట్టలేదు… ‘శీలమే స్త్రీ అసలు సంపద’ అని నాకన్పించలేదు… కోరికల మజాలు జుర్రుకోవడమే నా పరమావధి… షైతాన్ నన్ను అలా ఇరికించాడు… రేయింబవళ్ళు నిర్విఘ్నంగా సాగే ఫోన్ కాల్స్… చాటుమాటు కలయికలు… ఇంటర్న్‌చాటింగులు… నన్ను ఈ పాపం చేసేలా ఉసిగొల్పాయి… నన్ను నిలువునా ముంచేశాయి… అమ్మా..! నీకు గుర్తుండే ఉంటుంది… నాన్నంటుండేవారు ‘నా బిడ్డ నిప్పు’ అని. ఆ నిప్పే ఆయన కీర్తి ప్రతిష్టల్ని, మాన మర్యాదల్ని మంట గలుపుతుంది అని ఆ క్షణం ఆయన సైతం ఊహించి ఉండరు… ఆయనకు నా మీదున్న మమకారం, నమ్మకం అటువింది… నా బిడ్డ ఏది చేసినా మంచే చేస్తుందన్నది ఆయన విశ్వాసం…
అమ్మా! నేను విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డానమ్మా… ఎంతో మంది నమ్మకాలతో నేనాడుకున్నానమ్మా… ఇప్పుడు నాకన్పిస్తుందమ్మా… నేనెవర్నీ మోసం చేయలేదు… నన్ను నేను మోసం చేసుకున్నాను… ఎవర్నీ గెలిచి రాలేదు.. నాపై నేనే ఓడిపోయాను… నన్ను నేనే కోల్పోయాను… ఇవన్నీ ఇప్పుడర్థమవుతున్నాయమ్మా!!
ఇవన్నీ చెప్పి నేను చేసిన నిర్వాకాన్ని సమర్ధించుకుంటున్నానని అనుకోకు… ఆ ఉద్దేశం నాకు లేదు కూడా… నిజంగానే నేను తప్పు చేశాను… తప్పంతా నాదే… ఇందులో మీ ప్రమేయంగానీ, శిక్షణాలేమి గాని లేదు… మీ తర్ఫీదు మంచిదే. నా యౌవనమే నాతో ఈ పని చేయించింది… నేను అలా చేసి ఉండకూడదు. నీకు తెలుసా అమ్మా… నేను ఈ పని ఎంతో ఒత్తిడి మీద ఇష్టం లేకుండా చేశానని… ఒక తప్పు జరిగిపోయిన తర్వాత ‘ఆత్మహత్య చేసుకునేవారు నరకంలో శాశ్వతంగా ఉంటారని’ తెలిసి కూడా నేను మరో నేరానికి పాల్పడుతున్నాను… దేవుడు క్షమిస్తాడన్న ఆశ ఈ క్షణం కూడా నాలో బలంగానే ఉంది… ప్రతి స్లీపింగ్ పిల్ మింగేటప్పుడు పుట్టెడు దుఃఖాన్ని అనుభవించాను తెలుసా అమ్మా! అలా నేను మింగే ఒక్కొక్క నిద్ర మాత్ర నీ తరపున, నాన్న తరపున నన్ను కొన్ని వేల ప్రశ్నలు అడిగాయి తెలుసా! వాటికి సమాధానం చెప్పుకోలేక… నాలో నేను ధైర్యాన్ని పెంచుకోలేక మరో మాత్ర వేసుకునేదాన్ని… అమ్మా..? నీకో నిజం చెప్పనా… అలా నేను చేసేటప్పుడు కూడా ఎందుకో మీతోనే ఉంటానని పించింది తప్ప, దూరంగా… మరీ చేరుకో లేనంత దూరంగా వచ్చేస్తానని ఊహించనే లేదు. మీ ఆశలపై నీళ్ళు చల్లిన నా నిర్ణయాన్ని గుర్తు చేసుకుని… రెప్పలు అలసిపోయేలా ఏడుస్తున్నాను…!
నాకిప్పుడనిపిస్తుంది… తెలియనితనంతో చేసిన తప్పుకి నాకు నేనిచ్చుకున్న శిక్ష సరైనదేనా? అని. నా స్వార్థం కోసం మిమ్మల్నందర్నీ బాధించడం సహేతుకమా? అని… ఆ మాత్రం దానికి జీవితాన్ని, అంతకంటే విలువైన మిమ్మల్ని, మీ ప్రేమను వదులుకుని ఇలా అర్ధాంతరంగా నిర్ణయం తీసుకోవాలా అని. అంతెందుకు… జీవితాంతం నిన్ను నాన్నను ప్రేమిస్తూ ఉండిపోతే ఏం నష్టం… నా లక్ష్యాలకు మీరు అడ్డు కారు… నా అభివృద్ధికి మీరు ఆటంకం కాదు… నా రక్షణకు మీరు ముందుంటారు.. నా అవసరాలు గుర్తిస్తారు… నా శ్రేయస్సు కోరుకుాంరు… అన్నింకీ మించి నా కంటిలో నలుసు పడితే మీ గుండెల్లో ముల్లు గుచ్చుకున్నంత బాధ పడతారు… అంతగా ప్రేమిస్తారు మీరు నన్ను… ఈ ప్రేమ చాలదా అన్పిస్తుంది అమ్మా..!
అమ్మా…! ‘ఫలానా ప్రేమ లేకపోతే జీవితం లేదు’ అని నాకిప్పుడనిపించడం లేదు… ‘కామం అనేది జ్ఞానాన్ని పోగొట్టును’…, ‘కామా తురాణాం న భయం న లజ్జ’ అన్నట్టు మూర్ఖంగా ప్రవర్తించాను… యదార్థం ఇప్పుడర్థమయింది… ప్రేమ అందరి మధ్యనా అన్ని బంధాల్లోనూ ఉంది. చిన్న వ్యత్యాసం అంతే… ఆ మాత్రం దానికే… అందులో ఏదో ఒక ప్రేమ కోసం… అది కూడా ఎన్నాళ్ళు అదే స్థాయిలో ఉంటుందో తెలియని ఆకర్షణ కోసం నేను నా జీవితాన్ని, శీలాన్ని పోగొట్టుకోవడం తప్పనే అన్పిస్తుంది… అసలీ జీవితంలో మీలాంటి అమ్మ …నాన్న.. అన్నా.. చెల్లెలు లేదా స్నేహితులలో… శ్రేయోభిలాషులలో… ఆత్మ బంధువులలో ఇంత మంది రూపంలో ప్రేమను పొందవచ్చు అని తెలిస్తే ఇకపై ఎవరూ నాలాంటి పిచ్చి పని చేయరని అన్పిస్తుంది. ప్రేమ పేరుతో మోసపోయి ప్రాణాలు తీసుకునే వారికి, ప్రేమ కోసం అంటూ ప్రాణాలు తీసేవారికి కూడా నీ లాంటి తల్లి కంట ఒలికే ఒక్కకన్నీటి చుక్క వెనుక ఉన్న ప్రేమ సాగరాన్ని చూసినా అసలు అలాంటి తప్పుడు ఆలోచనలు రావు. ఆత్మహత్యలూ… హత్యలూ…యాసిడ్ దాడులు…ఏవీ ఉండవనిపిస్తుందమ్మా!
అలాగే ఈ సామాజిక రుగ్మతల్ని అరికట్టే ఓ కట్టుదిట్టమైన చట్టం ఖచ్చితంగా అమలు పరిస్తే నాలాంటి ఎందరినో కాపాడవచ్చనిపిస్తుందమ్మా…! అమ్మా..! నాకు దుఃఖం ఆగటం లేదు… చివరి సారిగా నాదో మనవి… క్రమం తప్పకుండా నా చెల్లెళ్లకు ఖుర్‌ఆన్‌లోని ‘నూర్’ సూరాను చదివి విన్పిస్తూ ఉండు… వారు ఇంటికి ఆలస్యంగా వచ్చినా… ఇంట బైట ఎక్కువ సేపు గడిపినా… ఇంటర్న్‌ట్ ముందు గంటల తరబడి కూర్చున్నా… వారి ప్రతి కదలికను గమనిస్తూ ఉండు… అమ్మా… నీ చీర కొంగు ఇప్పిటికే తడిసి ముద్దయింది… నా కోసం దుఆ చెయ్యి… నన్ను క్షమించమని అల్లాహ్‌ను వేడుకో… సారీ అమ్మా… నాన్నకు… చెల్లెళ్లకు… అన్నయ్యకు కూడా సారీ… మీరందరూ పెద్ద మనసుతో నన్ను క్షమిస్తారన్న ఆశతో…! ఇట్లు – మీ కూతురు