ఇన్ షాఅల్లాహ్

మనిషి ఆశా జీవి. ఆశల వీధుల్లో విహరించడం, కొత్త కొత్త తోటలు పెంచుకోవడం అతని అభిరుచి. ఏమేమో చేయాలని, ఎన్నెన్నో సాధించాలని అనుకుంటాడు, సాధించే పథకాలు పకడ్బందీగానే నిర్మించుకుంటాడు కూడా. అంతే కాదు తన కృషికి, ప్రయత్నాలకు తగినట్లు ప్రకటనలు కుడా చేస్తాడు. తాను చేయదలచుకున్నదంతా చాటి చెబుతాడు. ఎన్నో ప్రగాల్భాలు పలుకుతాడు. కొన్ని పర్యాయాలు డాంబికాలు కాక చిత్త శుద్ధితో కృషి జరపాలన్న సంకల్పంతోనే పలుకుతాడు. కాని వాస్తవంగా మనిషి ఏమి చెయ్యలేడు. ప్రపంచంలో ”చక్రం” మొదలుకుని ప్రగతి వికాసాల బాటన ”రాకెట్టు” వరకు కనిపెట్టి భూతలం మీదే కాకుండా గగనతలంలోనూ స్వేచ్ఛావిహారం సాగిస్తున్నవాడు మనిషే! అయినా మనిషి చెయ్యగలిగింది బహు స్వల్పం. నిఖిల జగత్తును తన హస్తగతం చేసకుని అనుక్షణం థాదిశల నిర్దేశనలతో విశ్వాన్ని నడుపుతున్న ప్రభువు, స్వామి, దైవం చెయ్యనివ్వనిదే, ఆయన అనుజ్ఞ, ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు, మనిషి ఏమీ చెయ్యలేడు, మనిషి చెయ్యగలిగింది ఏమీ లేదు!!

ఒక్క చిన్న సంఘటన, అనుదినం సంభవించే ఒక సాధారణమయిన ఉదంతం మానవ నాగరికతలో అంతులేని పరివర్తనకు కారణ మవుతుంది; చెట్టు నుండి రాలే ఒక యాపిల్‌ పండు, ఉడికే టీ పాత్రపైన కదలిన మూత వల్ల మనిషి ప్రగతి వికాసాల ఎత్తయిన సోపానాలనెక్కగలిగే స్థోమతను సంపాదించాడు. ఇది వాస్తవమే, కాని ఆ సందర్భాల కల్పన, సర్వసాధారణమైన ఆ సందర్భాలలో మనిషి ఆంతర్యాన జనించిన ప్రేరణలు దైవికమైనవే తప్ప మరెమీ కావు. మనిషి ఊహాతీతంగా ఎదురయిన ఘటనల వలెనే మనిషి ఆలోచనల్లోని ఊహాసౌధాలన్నీ ఒక్క ప్రకృతి కుదుపుతో కూలి నేలమట్టమయిన సంఘటనలు కోకొల్లలు. అందుకే మానవ సమాజంలో అనుభవాల సారంగా ఏర్పడిన అనేక నానుడులలో ఒకటి ”తానొకటి తలిస్తే దైవమొకటి తలచును” అన్నది. మనిషి ఎన్నో ఆశల ఆకాశహర్మ్యాలు నిర్మించుకుని, ప్రకటించుకుని, భావనల భవంతుల్లో, బస్సుల్లో, రైళ్ళల్లో, విమానాల్లో, ఓడల్ళో ప్రయాణిస్తూ ఉంటాడు. ”దుర్ఘటనలు”గా పేర్కొనబడే అనేక సంఘటనల్లో మనిషి మేనుతోపాటు ఆ మేడలు సైతం అంతుపట్టకుండా పోతాయి. ఏ ప్రయాణం చెయ్యకపోయినా ఇంటిపట్టున కూర్చున్నవాని ఆలోచనలకు, ఆచరణలకు, ఆవేశాలకు అడ్డుకట్టగా ”ప్రకృతి వైపరీత్యాలు” అనబడే ప్రకృతి పరిణామాలు లేక ఆరోగ్య సంబంధమయిన అపశృతులు సంభవించి అంతా క్షణాలలో తల్లక్రిందులైపోతుంది.

ఇవన్నీ చాటిచెబుతున్నదేమిటి? సర్వస్వతంత్రుడయిన మనిషి సంపూర్ణ స్వతంత్రుడు కాడు. అనుకున్నవన్నీ చెప్పడానికి, చెప్పినవన్నీ నెరవేరడానికి అతని ఒక్కని ప్రమేయంతోటే విశ్వ కార్యకలాపాలు సాగటం లేదు. కోటానుకోట్ల మానవులందరిపైనా, వారి ఆశలపైనా, వారి ఆశయాలపైనా, వారి ఆక్రందనలపైనా, ఆక్రోశాలపైనా సర్వాధికార మున్న స్వామి, విశ్వం అంతటికీ ప్రభువు అయిన దైవం, ఆ దేవుని అభీష్టం, అభిమతం, మనిషి తన పథకాన్ని కార్యాచరణ ద్వారా పరిపూర్ణం చేస్తున్నట్లు కనిపించినా అసలు నిర్వాహకుడు ఆ ప్రభువే. అదే మరచిపోవద్దని హెచ్చరిస్తున్నాడు నిజ ప్రభువు:

”ఏ పనినయినా ‘నేను, రేపు తప్పక చేస్తానని ఎంత సేపటికీ గట్టిగా చెప్పనేరాదు. అయితే వెంటనే ‘ఇన్ షాఅల్లాహ్ ‘ (దైవం తలచినట్టయితే) అని పలకాలి. ఇంకా ఎప్పుడైనా మరపు సంభవిస్తే, ‘నా ప్రభువు నన్ను మరంత సన్మార్గానికి, సన్నిహితమయిన మాటకు దారి సచూపుతాడ’ని చెప్పాలి”. (అల్‌ కహఫ్‌: 23,24)
ఇస్లాం మనిషికి నేర్పే సంస్కృతీ నాగరికతల్లో ఒకటి, మనిషి తన శక్తి సామర్ధ్యాలపైన మిడిసిపాటుకు గురికాకుండా తన సృష్టికర్త అయిన దైవం పైన భారం మోపడం. దైవం మీద భారం మోపే ఆ స్పృహను, ఆ చేతనను నిత్యం జాగృతంగా, తేజోవంతంగా, చలనవిహితంగా ప్రజ్వలింపజేయడానికి భవిష్యత్తును గురించి పలికేటప్పుడు- అది ఎంతటి సాధారణమయిన విషయమయినా, ఎంతటి తథ్యమయిన అంశమయినా, ఎంతటి అచంచల నిశ్చిత, నిర్ధారిత కార్యక్రమయినా – ‘ఇన్ షాఅల్లాహ్ ‘ అన్న పద బంధంతో కలిపే పలకాలి అన్న విధ్యుక్త ధర్మాన్ని బోధించింది ఇస్లాం. దైవం మీద భారం మోపే స్పృహతో పాటు ఆ కార్యనిర్వహణకు దైవ సహాయాన్ని అర్ధించే ప్రేరణ కూడా తద్వారా ప్రాప్తమవుతుంది. ఏదో లాంఛనంగా కాక సచేతనంగా పలికే ఆ మాటలకు, దాని వెనక దేవుని ఇష్టం కూడా తోడవ్వాలన్న ప్రబల వాంఛ గోచరిస్తుంది. మనిషి చిత్తశుద్ధితో దైవాన్ని సహాయం అర్ధిస్తే అది ప్రాప్తించడంలో ఆశ్చర్యమేముంది?

‘ఇన్ షాఅల్లాహ్ ‘ అన్న పద బంధం ప్రయోగించబడిన ఖుర్‌ఆన్‌ ఆయతులను కొన్నింటిని పరిశీలిద్దామా?

తల్లిదండ్రులకు దూరమయిన మహనీయ యూసుఫ్‌ (అ)ని రకరకాలుగా బాధపెట్టిన సోదరులు చివరికి ఆయన్నే ఆశ్రయించగా ఆయన ఈజిప్టు సర్వాధికారిగా వారిని ఆదుకోవలసి వచ్చినప్పుడు ఆయన ఎంతో ఉదారంగా వారిని ఆహ్వానించారు. తల్లిదండ్రుల్ని సయితం తీసకురమ్మని కోరారు. అలా వారు వచ్చినప్పటి సందర్భం: అప్పుడు ఆ పరివారమంతా యూసుఫ్‌ వద్దకు చేరినప్పుడు యూసుఫ్‌ తల్లిదండ్రులకు తన చెంత చోటు కల్పించాడు. ఇలా అన్నాడు, ‘దేవుడు సమ్మతిస్తే’ మీరంతా శాంతిభద్రతలతో ఈజిప్టులోకి ప్రవేశిస్తారు. (యూసుఫ్‌: 99)

హజ్రత్‌ మూసా (అ), దైవం నియమించిన ఒక జ్ఞాని అయిన వ్యక్తితో కలిసి ప్రయాణానికి సమాయత్తమయినప్పుడు ఆ జ్ఞాని, మీరు నా చేష్టలకు ఓపిక పట్టలేరు అని అన్న సందర్భంలో: మూసా ఇలా సమాధానం పలికారు: ”దైవం కోరినట్టయితే మీరు నన్ను సహనశీలునిగా గుర్తిస్తారు, నేను ఏ విషయంలోనూ మీ పట్ల అవిధేయతకు పాల్పడను”. (అల్‌ కహఫ్‌: 69)

మహనీయ మూసా (అ) ఈజిప్ట్‌ నుండి బయలుదేరి మద్‌యన్‌ వెళ్ళి ఒక కుటుంబంలో పనికి చేరినప్పుడు ఆ ఇంటి యజమాని ఆయన్ని తన ఇంట పని చేసే ఒడంబడిక చేస్తున్నప్పుడు చెప్పిన మాటలు:”….మీరు ఎనిమిదేళ్ళు మా ఇంట పని చేయాలి. మీరు ఒకవేళ పదేళ్లు పూర్తి చేసినట్టయితే అవి మీ పక్షాన ఉత్తమ ప్రవర్తనగా భావిస్తాను, నేను మిమ్మల్ని కష్టపెట్టాలని అనుకోవటం లేదు. దైవం తలచినట్టయితే మున్ముందు మీరు నన్ను సజ్జనునిగా కనుగొంటారు”. (అల్‌ ఖసస్‌: 27)

మహనీయ ఇబ్రాహీమ్‌ (అ) తన జ్యేష్ఠ కుమారుని తీసుకుని బయలుదేరిన తర్వాత అతన్ని సంబోధించి, ”నా చిట్టీ, నేను నిన్ను జిబహ్‌ (వధ) చేస్తున్నట్లు కల గన్నాను, ఇక నీ అభిప్రాయమేమిటో నాకు చెప్పు” అని పురమాయించినప్పుడు హజ్రత్‌ ఇస్మాయీల్‌ (అ) ఇలా అన్నారు: ”నాన్నగారూ, మీకు ఆదేశమయినట్లే మీరు ఆచరించండి. ‘దైవం తలచితే’ నన్ను మీరు సహనశీలునిగానే చూస్తారు”. (అస్‌ సాప్ఫాత్‌: 102)

సజ్జనుడైన దైవ భక్తుడు, ఎన్నడూ తన నైతిక బలాన్ని, బుద్ధిబలాన్ని, భుజబలాన్ని, అంగబలాన్ని ఆసరాగా తీసుకుని ప్రగల్భాలు పలకడు. వినయవినమ్రతలతో దైవంపై భారం మోపి భావిని గురించి తన సంకల్పాన్ని వ్యక్తం చేస్తాడు. ఇది దైవ భక్తుని విధానం – ఇన్ షాఅల్లాహ్ !

 

Related Post