Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

కమ్యూనిజంకంటే ఉన్నతమైన వ్యవస్థ

 

పెట్టుబడిదారీ వ్యవస్థ వెన్నెముకను విరిచే సిద్ధాంతాలు రెండు – ఒకటి కమ్యూనిజం, రెండోది ఇస్లాం.
ఇక్కడ (భారత దేశంలోని) కమ్యూనిస్టుల్లో కొంతమంది మాత్రమే ‘దాస్‌ కాపిటల్‌’ ను లోతుగా అధ్యయనం చేసి ఉంటారు. మార్క్స్‌ సిద్ధాంతాలలో ‘మిగులు విలువ’  అన్నదొకటి. ఈ సూత్రాన్ని మార్క్స్‌ మూడు గ్రంథాల్లో విశదీకరించాడు.
పెట్టుబడిదారుడు పెట్టుబడి పెడతాడు. శ్రామికుడు తన శ్రమతో ఆ పెట్టుబడికి లాభం చేకూరుస్తాడు. ఈ లాభం అసలు మూల ధనం కంటే అధికంగా ఉంటుంది. ఈ అధికాదాయంతో పెట్టుబడిదారుడు మరో ప్యాక్టరీ స్థాపనకు పూనుకుంటాడు. ఈ విధంగా అతడు సామాన్యుల్ని దోచుకుంటాడు- ఇదీ కమ్యూనిజం వాదన, ఈ స్థితిలో కమ్యూనిజం రంగప్రవేశం చేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు అసలు బలమైన ఈ ‘మిగులు విలువ’ను అంతమొందించగోరుతుంది. అది పెట్టుబడిదారీ వ్యవస్థను తుదముట్టించి ఉత్పత్తి సాధనాలన్నింటినీ జాతీయం చేసుకుంటుంది.
పరిశ్రమలను జాతీయం చేయడం వల్ల సమస్య పరిష్కృత మవుతుందా? అన్నది ఆలోచించవలసిన విషయం. జాతీయం చేయబడిన పరిశ్రమల నుండి కూడా మిగులు విలువ ఉత్పన్నమవుతుంది. ఈ లాభాన్ని ఎటు తరలించాలన్నది ప్రశ్న. నేడు ఆచరణాత్మకంగా ఈ లాభం ఏమవుతుంది అన్నదాన్ని కూడా చూడాలి.
ముందు పరిశ్రమలు జాతీయం చేయబడతాయి. వాటినుండి వచ్చే లాభంలో కొంత భాగం కార్మికులకు ఇవ్వబడుతుంది. మిగతా ప్రజలకు ఏమీ లేదు.
ఏదైనా పరిశ్రమ వల్ల వచ్చే లాభంలో కేవలం ఆ పరిశ్రమలో పని చేసే కార్మికులకు మాత్రమే భాగం లభిస్తుంది. ఇతర రంగాల్లో పని చేసే శ్రామికులు, దేశంలోని నిరుపేదలు, నిరాధార జీవులకు ఇందులో ఎలాంటి వాటా లేదన్న మాట. జాతీయకరణ ఉద్దేశం ఇది కారాదు. లాభం అన్నది యావత్తు జాతి ప్రజలకు పంపిణీ కావాలి.
కమ్యూనిస్టు ప్రభుత్వం శాసన దండంతో ఈ లాభాన్ని ఒకరి నుండి లాక్కొని మరొకరికి ఇస్తుంది. దీనికి భిన్నంగా ఇస్లాంలో, మిగులు విలువను – దానికి అర్హులైన వారందరికీ పంచేందుకు ప్రేరేరింపజేయడం జరుగుతుంది. దాని గురించి ఉపదేశించబడింది కూడా. ఇస్లాంలో ఈ పంపిణీ వెనుక ప్రేరణ శక్తి ప్రభుత్వ ఒత్తిడి కాదు- విశ్వాస బలమై ఉంటుంది.
కమ్యూనిస్టు దేశాల్లో పరిశ్రమల్ని మాత్రమే జాతీయం చేయడం జరుగుతుంది. ఆదాయం పంపిణీ అయ్యేదేదో ఆ పరిశ్రమల్లోనే అవుతుంది. ఇక వ్యక్తుల ఆధీనంలోనున్న ఆస్తిపాస్తులపై వచ్చే లాభాల పంపిణీకి సంబంధించిన భావన లేనే లేదు. ఆచరణాత్మకంగా కూడా అలాంటి ఏర్పాటేదీ ఉన్నట్లు కానరాదు. కాని ఇస్లాం, వ్యక్తుల ఆదాయంలోని ‘మిగులు విలువ’ను కూడా సమాజంలోని ఇతరులపై వెచ్చించాలని తాకీదు చేస్తోంది. మిగులు విలువలో నుండే ఒక భాగం తీసి సత్కార్యాలకై ఖర్చు చేయడాన్ని జకాత్‌ అనంటుంది ఇస్లాం. అరబీ బాషలో ‘జకాత్‌’ అంటే పరిశుద్ధపరచుట అని అర్థం. వ్యక్తులు తన ఆదాయంలోని ఒక భాగాన్ని ఇతరుల కోసం ఖర్చు చేయడమే జకాత్‌. అంటే జకాత్‌ ఇచ్చి మనిషి తన ధన సంపత్తిని పరిశుద్ధ పర్చుకుంటాడన్న మాట. అలా చెయక పోతే అతని యావత్తు ధనసంపద అశుద్ధమైపోతుంది. ఇంతటి ఉన్నతమైన బోధన, శిక్షణలు ప్రపంచంలో కేవలం ఇస్లాం మాత్రమే ఇచ్చింది. ధనంలో నుండి కొంత భాగం మంచి పనులకై ఖర్చు పెట్టే ప్రబోధనలైతే ఆ మతం యొక్క సిఫారసులు మాత్రమే కదా. ధనవంతుడైనా మోసగించదలిస్తే అతన్ని దాన్నుంచి వారించేదెలా? అని ఎవరైనా ఆక్ష్షేపించవచ్చు.
అయితే ఈ ఆకేపణకు సమాధానం మనకు చరిత్రలో లభిస్తుంది. జకాత్‌ ఇవ్వడానికి నిరాకరించినవారికి వ్యతిరేకంగా ప్రథమ ఖలీఫా హజ్రత్‌ అబూబకర్‌ సిద్దీఖ్‌ (రజి) కరవాలం చేబూనారు. నిజానికి నాడు జకాత్‌ను తిరస్కరించినవారు బాహ్యంలో ముస్లింలే. ఇస్లాం ధర్మావలంబీకులే. విశ్వాసులు, మహనీయ ముహమ్మద్‌ (స) అనుయాయులు, నమాజ్‌ను ఆచరించేవారయిన ముస్లింలకు వ్యతిరేకంగా ఈ కరవాలం ఝుళిపించబడింది. వారు ఏ నేరానికి (జకాత్‌ను ఎగ్గొట్టే) పాల్పడ్డారో అది అంత కఠినమైందన్న మాట. దైవాన్ని విశ్వసించిన తర్వాత ఇస్లాం ఒక వ్యక్తిపై విధిగా మోపే బాధ్యత, చాలా గట్టిగా తాకీదు చేసే విషయం- జకాత్‌. అంటే తన ఆదాయంలో నుండి ఒక నిర్ణీత బాగాన్ని తీసి తన తోటి బలహీన సోదరులకు సహాయం చేయడం అన్న మాట.

ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే, వ్యక్తి తన సొంత ఆదాయం మరియు సొంత పెట్టుబడిలో నుండి ఇతరుల కోసం ఖర్చు చేయమని కమ్యూనిజం బోధించదు. అయితే ఇస్లాం ఈ విషయమై గట్టిగా తాకీదు చేస్తుంది- ఇటువంటి ఖర్చు తప్పక చేయాలని కోరుతుంది. ఈ ఖర్చును ఎవరైనా చెయ్యకపోతే (అతడు ముస్లిం అయినప్పటికీ) ఇస్లాం అతనికి వ్యతిరేకంగా ధ్వజమెత్తుతుంది. అందుకే ఇస్లాం కమ్యూనిజంకంటే ఉన్నతమైనది, శ్రేష్టమయినది.
సాధారణంగా పెట్టుబడి పెట్టే ప్రతి వ్యక్తి తన ఈ ధనం తన సొంత సుఖభోగాలకని భావిస్తాడు. తన ఆదాయాన్ని ఇతరుల కోసం ఖర్చు చేయడం స్వయంగా లేమిని కొనితెచ్చుకోవడమేనని కూడా అతడు తలుస్తాడు. ఈ సంశయమే ప్రజల్ని సాధారణంగా సంకట పెడుతుంది.
ఇస్లాం అన్నింటికంటే ముందు ఈ భావనను వ్రేళ్ళతో సహా పెకలించి పారేస్తుంది. ఇతరులపై ఖర్చు చేయడం వల్ల సంపద తరగదు – పెరుగుతుంది అని ఖుర్‌ఆన్‌ చాటి చెబుతోంది.
”దారిద్య్ర ప్రమాదం చూపి షైతాన్‌ మిమ్మల్ని భయపెడతాడు. నీతిబాహ్యమైన, నీచమయిన మార్గం అవలంబించమని ప్రేరేపిస్తాడు. కాని మిమ్మల్ని క్షమిస్తానని, కరుణిస్తానని అల్లాహ్‌ా వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్‌ా అత్యంత ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు”. (బఖర – 268)
పిసినారితనం అంటే ఏమిటి? తన కోసం, తన భార్యాపిల్లల కోసం, తోటి సమాజంలోని వారి అవసరాల కోసం ఖర్చు చేయడానికి బదులు ఒక్కొక్క పైసాను కూడబెట్టడమే పిసినిగొట్టుతనం.
తమిళ సినీ పరిశ్రమలో ఒక ప్రసిద్ధ గాయకుడుండేవాడు. అతను అత్యంత పిసినారి. తన కొడుకు కాలికి గాయమైతే వైద్య చికిత్స చేయించడానికి కూడా అతను వెనుకంజ వేసేవాడు. పర్యవసానంగా అతని పుత్రుడు చనిపోయాడు. ఇదీ పిసినారితనానికి ప్రతిఫలం! ఇలాంటి పిసినారితనాన్ని, సంకుచిత హృదయాన్ని ఇస్లాం గట్టిగా వ్యతిరేకిస్తుంది.
ఇస్లాం ఇతరులకై ఖర్చు చేసేందుకు కేవలం ఉపదేశాలు మాత్రమే ఇవ్వలేదు. దాంతోపాటు ఖర్చు చేయాల్సిన నియమాలను, పద్ధతులను కూడా అది నేర్పింది. కొంతమంది ఖర్చు చేస్తారుగాని ఇతరులను దెప్పి పొడవటం, ఉపకారం చేసి తమ ప్రతిష్టను పెంచుకోవటం వారి ఆశయమయి ఉంటుంది. ఇవి, ఇంకా ఇలాంటి ఇతర ఉద్దేశ్యాలు ధర్మబద్ధం కావని ఇస్లాం చెబుతుంది. దానం చెయ్యడం ధార్మికమైన విధి అని, ఇది నమాజు తర్వాత రెండో పెద్ద అంశం అని ఇస్లాం చెబుతుంది. తోటి వారికై ఖర్చు చేసి దైవ ప్రసన్నతను బడయటం తప్ప మరే ఉద్దేశ్యం దానధర్మాలకు ఉండరాదన్నది ఖుర్‌ఆన్‌ ఉపదేశం.
నేనొక చోట చూశాను – ఒకాయన ఓ సంస్థకు ట్యూబ్‌ లైట్‌ను విరాళంగా ఇస్తూ, దానిపై తన పేరును వ్రాయించారు. ఎంత ఘోరంగా వ్రాయించారంటే – ఆ లైటు వెలుగు అసలు బయటికి రాలేదు. ఇలాంటి దానధర్మం, ఇటువంటి సహాయం కేవలం తప్పు మాత్రమే కాదు. అది అతని సకల సత్కార్యాల ప్రతిఫలాలను నాశనం చేసివేస్తుందని ఇస్లాం హెచ్చరిస్తుంది. కొంత మంది ధన సహాయమో లేక వేరే ఏదయినా సహాయమో చేస్తారు కానీ తమ పెత్తనాన్ని సహాయం పొందిన వ్యక్తిపై రుద్ద్దుతారు. తత్ఫలితంగా సహాయం పొందిన ఆ వ్యక్తి మనసు గాయపడుతుంది. ఈ పోకడలన్నీ అధర్మ మయినవని ఇస్లాం ఉద్ఘాటిస్తుంది. దివ్య ఖుర్‌ఆన్‌లో ఉంది:మనసును గాయపర్చే దానం కంటే, మృదుభాష్యం, క్షమాబుద్ధి ఎంతో మేలయినవి”. (అల్‌ బఖర – 263)
వినోబాభావే భూదాన ఉద్యమం నడిపినప్పుడు కొందరు సారవంత మయిన భూముల్ని కూడా దానం చేసిన వారున్నారు. కాని చాలా మంది భూస్వాములు బంజరు భూములను, రాళ్ళు-రప్పలు నిండిన భూముల్నే దానం చేశారు.తమ ఇంట్లోని చినిగిపోయిన దుస్తుల్ని, చద్ది అన్నాన్ని, విరిగిపోయిన,పగిలిపోయిన సామాన్లను ఇతరులకు దానం చేసే దాతలు కూడా కానవస్తారు. చినిగిపోయిన నోట్లను, చెల్లని నాణాలను దానం చేసే వారూ ప్రపంచంలో ఉన్నారు. కాని, ఇస్లాం మీ వద్ద ఉండే మంచి వస్తువుల్ని దానం చేయమని ప్రబోధిస్తోంది. దానం చెయ్యదలిస్తే – మీరు ఇష్టపడే దుస్తులు స్వయంగా మీరు తినే పదార్థాలు, మీకు ప్రియమైన సంపద – వీటన్నింటినీ అల్లాహ్‌ా మార్గంలో ఖర్చు చెయ్యమని తాకీదు చేస్తోంది ఇస్లాం. మీరు సంపాయించేదాన్లో అన్నింటికంటే మంచి వస్తువులను దేవుని బాటలో ఖర్చుపెట్టాలి. ఇది ఇస్లాం ఉద్బోధన. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
”విశ్వసించిన ప్రజలారా! మీరు సంపాయించిన ధనంలోని, మేము మీ కొరకు నేల నుండి ఉత్పత్తి చేసినదానిలోని మేలైన భాగాన్ని దైవ మార్గంలో ఇవ్వడానికి పనికిరాని వస్తువుల్ని ఏరి తీసే ప్రయత్నం చెయ్యకండి”. (బఖర – 267)
మీరు ఇతరులకు చేసే అన్నదానమయినా, దుస్త్తులయినా లేక ధన సహాయమయినా – వీటిని రహస్యంగా ఇవ్వడం ఉత్తమ విధానమని ఇస్లాం ప్రకటిస్తోంది. అయితే బహిర్గత సహాయం చెయ్యాల్సిన అవసరం లేక స్థితి ఏర్పడితే అలా చెయ్యవచ్చు. దివ్య ఖుర్‌ఆన్‌ ఉపదేశమిది:
”మీరు మీ దానధర్మాలను బహిరంగంగా చేసినా మంచిదే. కాని రహస్యంగా నిరుపేదలకు దానమివ్వటం మీకు ఎక్కువ మేలు చేకూరుస్తుంది”. (2: 271)
దానధర్మాల విషయంలో, ఎవరయినా ఒక త్రాగుబోతు లేక డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టేవాడు మీ వద్దకు వచ్చి సహాయం అర్ధించే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఒకవేళ అలాంటి వారికి సహాయం చేస్తే అదేమవుతుంది? ఈ ప్రశ్నలకు కూడా జవాబిచ్చింది ఇస్లాం. దుర్మార్గులకు, వ్యర్థప్రలాపనలకు పాల్పడేవారికి డబ్బు సహాయం ఇవ్వరాదన్నది ఇస్లాం ఉపదేశం. అయితే తిండి, దుస్తులు ఏర్పాటు చేయవచ్చు. దివ్య కుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
”అల్లాహ్‌ మీ కొరకు ఏ సొమ్మునయితే జీవనాధారంగా చేశాడో, దాన్ని అవివేకులకు అప్పగించకండి. అయితే దాన్నుండి వారి అన్న వస్త్రాలకు ఇవ్వండి. ఇంకా వారికి హితబోధ చేయండి”. (అన్‌ నిసా-5)

చూడండి! 1) మీ కోసం మీ భార్యాపిల్లల కోసం ఖర్చు చేయగా మిగిలిన
సొమ్మును అల్లాహ్‌ా మార్గంలో ఖర్చు చేయండి.
2) మీ శక్తి స్థోమతలకు మించి ఖర్చు చేయకండి. అలా అని
పిసినారులుగా కూడా వ్యవహరించకండి. మీ వైఖరి మధ్యే
మార్గాన్ని అనుసరించేదిగా ఉండాలి.
3) దానధర్మాల విషయంలో మీ హస్తాన్ని మరీ అంత బిగించి
ఉంచకండి. అలా అని మరీ అంత విచ్చలవిడిగా కూడా
ఇచ్చేయకండి. అలా అతిగా దానం చేసేస్తే స్వయంగా మీరే
ఇతరుల సహాయాన్నికోరాల్సిన అగత్యం ఏర్పడవచ్చు.
4) మీ సమీప బంధువులు, నిరాధారులు, నిరుపేదలు, అనాథలు,
బాటసారులు మీ సహాయం పొందడానికి అర్హులు.
తమ సొమ్ముపై జకాత్‌ చెల్లించడం ముస్లింల విధి. ఈ విధిని విస్మరించినవారికి కఠిన శిక్ష ఉంది. ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్‌ (స) బంగారు గాజులు తొడిగిన ఒక స్త్రీని చూశారు. వీటికి జకాత్‌ చెల్లిస్తున్నావా? అని ఆయన (స) అడిగారు. ‘లేదు’ అన్నదా మహిళ. మహా ప్రవక్త (స) అన్నారు: ”తీర్పు దినాన నీకు అగ్ని గాజులు తొడిగించబడతాయి.” (అది విని ఆ మహిళ బంగారు గాజుల్ని దానం చేసేసింది).
జకాత్‌ పైకం ఎలాింవారికి ఇవ్వాలి అన్న దాన్ని గూర్చి కూడా ఖుర్‌ఆన్‌ స్పష్టంగా ప్రకించింది. బీదసాదలకు, నిరాధార జీవులకు, రుణ గ్రస్తులకు, అనాథలు మరియు బాటసారులకు సహాయం చేయడంతోపాటు మంచి వైపుకు ముందంజ వేసేవారినిప్రోత్సహించడానికి, బానిసలకు విముక్తిని కలిగించడానికి కూడా జకాత్‌ ధనాన్ని ఉపయోగించవచ్చు. అదీగాక, జకాత్‌ ధనాన్ని వసూలు చేసే కార్యంలో నిమగ్నమై ఉన్నవారికి కూడా ఆ మొత్తంలో నుండి భృతిని ఇవ్వవచ్చు. జకాత్‌ ఖర్చుచేసే పద్దుల్లో దైవ మార్గం అన్న పద్దు కూడా ఉంది. ‘దైవ మార్గంలో ఖర్చు’ అనేది భావపరంగా చాలా విస్తృతమైన అర్థాన్ని ఇస్తుంది. సత్కార్యాలన్నీ ‘దైవమార్గం’ పద్దులోకే వస్తాయి. ముఖ్యంగా ధర్మ ప్రచారం. ధర్మోన్నతికై జరిపే వైఖరిలో కార్యకలాపాలు ‘దైవమార్గం’లోకే వస్తాయి.
తల్లిదండ్రులు, సంతానం మొదలుగువారు ఒక వ్యక్తి పోషణలో ఉన్నప్పుడు అతనిచే జకాత్‌ ధనానికి వారు అర్హులు కాజాలరు. జకాత్‌ ధనమైతే ఇతరుల కోసమే కేయించబడుతుంది.
సాధ్యమైనంత వరకు అడగటం లేక యాచించటం నుండి తమను కాపాడుకోండి అనేది ఇస్లాం ప్రబోధనల్లో మరో అంశం. మనిషి వీలయినంతవరకు ఇవ్వడానికి,ఇప్పించడానికి ప్రయత్నించాలిగాని పుచ్చుకోవడానికి కాదు. ఒకరి ముందు దేహి అంటు చేయి చాచడం కంటే కట్టెలు కొట్టి ఆ డబ్బుతో గడపటం ఎంతో ఉత్తమం అని మహా ప్రవక్త (స) ప్రవచించారు.
ఒకసారి మహా ప్రవక్త (స) ఓ పల్లెటూరి వ్యక్తిని దగ్గరకు పిలిచి అతని చేెతుల్ని ముద్దు పెట్టుకున్నారు. అతని చేతులు కాయలు కాసాయి. అతను బ్రతుకు తెరువు కోసం కూలి పని చేసేవాడు.కనుక మహనీయ ముహమ్మద్‌ (స) సంతోషంతో అతని అర చేతుల్ని ముద్దాడారు.
ఒకవైపు, యాచించాన్ని అరికడితే మరోవైపు, మనస్పూర్తిగా ఇతరులకు సహాయం చెయ్యమని ఆజాపిస్తుంది. దీన్ని బ్టి ఇస్లాం ప్రబోధనల్లో ఎంతో గొప్ప సమతూలనం ఉన్నట్లు మనకు తెలుస్తోంది.
(‘నేను ఆరాధించే ఇస్లాం’ పుస్తకం నుండి)

Related Post